From Jantar Mantar to Silver Screen | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ ఆందోళనలు, విద్యార్థుల పోరాటం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నెల రోజులకు పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సుదీర్ఘ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉద్యమం, ఆ తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా చేపట్టిన ‘చలో సంసద్’తో మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుండి భారీ మద్దతు లభించడంతో తీవ్ర ఒత్తిడి నడుమ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ చారిత్రాత్మక విద్యార్థి ఉద్యమం ఆధారంగా బాలీవుడ్లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ (The Accidental Cockroach Party) అనే టైటిల్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ సమగ్ర పరిశోధన, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సుమారు రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉద్యమానికి సంబంధించి ఇప్పటివరకు బయటకు రాని అనేక ఆసక్తికర, దిగ్భ్రాంతికరమైన నిజాలను చూపించనున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా.. ఈ పోరాటం వెనుక ఉన్న వ్యూహాలు, విద్యార్థులు ఏకమైన తీరును కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో సహ నిర్మాణ చర్చలు జరుగుతుండగా, షూటింగ్ లొకేషన్ల వేట కూడా వేగవంతమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సంచలనాత్మక చిత్రాన్ని 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.