ముంబై: జెనరేషన్ జెడ్ బొద్దింకలు అయితే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని ఎలుకగా మొఘల్స్ అవమానించారని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. (Uddhav Thackeray) అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా జెన్ జెడ్ ఉద్యమించడాన్ని, యువ శివాజీ పోరాటంతో ఆయన పోల్చారు. ముంబైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘ఒక అవమానకరమైన పేరు నుంచి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని 30 ఏళ్ల అభిజీత్ దీప్కే స్థాపించారు. ‘బొద్దింకలు’గా అవమానిస్తున్న యువత, మనం ఇప్పుడు జెన్ జెడ్ అని పిలిచే తరానికి చెందినవారు. వీరి వయసు సుమారుగా 13 లేదా 14 నుంచి 27 లేదా 28 సంవత్సరాల మధ్య ఉంటుంది’ అని అన్నారు.
కాఆ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా దాదాపు ఇదే వయసులో తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ‘శివాజీ మహారాజ్‌ను కూడా మొఘలులు అప్పుడు ‘ఎలుక’ అని పిలిచి అవమానించారు. సంత్ జ్ఞానేశ్వర్ కూడా జ్ఞానేశ్వరి రాసినప్పుడు చాలా చిన్నవారే కదా? వారిద్దరూ తమ కాలంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు’ అని అన్నారు.
మరోవైపు తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే ఈ రోజు జీవించి ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం ఆయనను కూడా అదే విధంగా ‘హిందూ వ్యతిరేకి’గా ముద్ర వేసేదని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ఠాక్రే కుటుంబంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి ధైర్యం కావాలని ఆయన అన్నారు.
మతం మనిషిని తయారు చేయదని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ‘మానవత్వమే మతం’ అని బాలాసాహెబ్ అనేక ప్రసంగాలలో చెప్పారని గుర్తు చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసం మతాన్ని ఆయుధంగా వాడుకునే వారి నైతిక అధికారాన్ని ఆయన ప్రశ్నించారు. ‘ఏ రాముడి పేరు మీద మీరు అధికారాన్ని సంపాదించారో, అదే రాముడి ఆలయాన్ని దోచుకోవడానికి మీకు సిగ్గు లేదా?’ అని బీజేపీపై మండిపడ్డారు.