అయిజ, మే 30: సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో నలుగురు గల్లంతు కాగా, ఒకరు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా, మంత్రాలయం పుణ్యక్షేత్రం సమీపంలోని శనివారం చోటుచేసుకున్నది. మంత్రాలయం డీఎస్పీ భార్గవి, సీఐ సురేంద్రబాబు వివరాల మేరకు.. మంత్రాలయానికి చెందిన చంద్రాచారి ఇంట్లో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా హైదరాబాద్, ఉరవకొండ పట్టణాలకు చెందిన బంధువులు శనివారం ఇంటికి వచ్చారు.
సాయంత్రం హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర(5), సతీశ్(35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధనుశ్ (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22), ఆదోనికి చెందిన అపర్ణ తుంగభద్ర నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో ఐదుగురు నీటిలో మునిగిపోగా, ప్రమాదం నుంచి బయటపడ్డ అపర్ణ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియ జేసింది. దీంతో వెంటనే పోలీసులు, మత్స్యకారులతో కలిసి తుంగభద్ర నదిలో గాలింపు చేపట్టారు. గాలింపులో మంత్రాలయానికి చెందిన ధనుశ్ మృతదేహాన్ని మత్స్యకారులు బయటకు తీశారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.