Ajith | తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తల్లి మోహిని మణి శనివారం ఉదయం కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో అజిత్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తల్లి మరణ వార్త తెలిసే సమయానికి అజిత్ విదేశాల్లో ఉన్నారు. దుర్వార్త అందుకున్న వెంటనే ఆయన చెన్నైకి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొన్నారు. మాతృవియోగంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన అజిత్‌ను చూసి అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోహిని మణి మరణ వార్తను అజిత్ సోదరుడు అనిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 1937లో జన్మించిన ఆమె 2026 మే 30న కన్నుమూశారని తెలిపారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన ఆమె, భర్త మరణానంతరం ఆయన జ్ఞాపకాలతోనే జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. కుటుంబానికి ఆమె చూపిన ప్రేమ, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని అన్నారు.అజిత్‌కు మాతృవియోగం సంభవించిందనే వార్తతో తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్‌తో పాటు పలువురు నటీనటులు మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలా ఉండగా, అజిత్‌ను పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. వారిని చూసిన అజిత్ భావోద్వేగానికి గురై కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారు మోహిని మణి పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. సాధారణంగా విజయ్, అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పోటీ వాతావరణం కనిపించినా, ఇలాంటి క్లిష్ట సమయంలో విజయ్ స్వయంగా వెళ్లి అజిత్‌ను ఓదార్చడం అభిమానులను కూడా ఆకట్టుకుంది. వ్యక్తిగత బంధాలు, మానవీయ విలువలు అభిమానుల మధ్య ఉన్న విభేదాల కంటే గొప్పవని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.
#Ajithkumar receiving #ThalapathyVijay along with Trisha..🤝 pic.twitter.com/DH4nJB8x2F
— Laxmi Kanth (@iammoviebuff007) May 30, 2026