Indian-Origin : కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువతి ఏడు నెలల క్రితం హత్యకు గురికాగా.. తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కెనడా పోలీసులు వెల్లడించిన వివరాలివి. కెనడాలోని టొరంటోలో ఉంటున్న హిమాన్షు ఖురానా (30) అనే భారతీయ సంతతి యువతి గత ఏడాది డిసెంబర్ 19న హత్యకు గురైంది. దీనికి సంబంధించి పోలీసులకు డిసెంబర్ 20న ఫిర్యాదు అందింది. టొరంటో, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్‌లోని, స్ట్రాచన్ అవెన్యూలో హిమాన్షు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
ముందుగా అనుమానాస్పద మృతిగా భావించగా, తర్వాత ఇది హత్యగా తేలింది. ఇది టొరంటోలో ఆ ఏడాది జరిగిన 40వ హత్య. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న టొరంటో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో హిమాన్షు ఖురానాను ఆమె ప్రియుడు, భాగస్వామి అయిన అబ్దుల్ గఫూరి (32) హత్య చేసినట్లు గుర్తించారు. కొంతకాలం నుంచి వీరిద్దర రిలేషన్లో ఉన్నట్లు తేలింది. ఇద్దరి మధ్యా విబేధాల కారణంగా అతడు ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, హత్య తర్వాత నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు జాతీయ స్తాయిలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడి ఫొటోలు మొత్తం సర్క్యులేట్ అయ్యేలా చేశారు. ప్రజలకు కూడా అతడి గురించి తెలిసేలా చేశారు. అతడి ఆచూకీ గుర్తిస్తు తెలపాలంటూ చెప్పారు.
అయితే, అతడు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో విదేశీ సంస్థలతోనూ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో విదేశాల్లో ఉన్న అతడిని కెనడా రప్పించారు. అతడు టొరంటో రాగానే ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడు ఏ దేశంలో ఉన్నాడనే వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. పోలీసులు అబ్దుల్ గఫూరిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. హిమాన్షు హత్య జరిగిన ఏడు నెలలకు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ విచారణలోనే అబ్దుల్ ఈ హత్య ఎందుకు చేశాడో తేలుతుంది. దీనికి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు.