వికారాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం లో చేనేత, జౌళి శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖరారైనట్టు ఆయన వర్గం నాయకుల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉన్నా సామాజిక సమీకరణాల్లో భాగంగా కేబినెట్లో బెర్తు కాకుండా స్పీకర్ పదవి దక్కింది. ఇప్పటికే కర్ణాటకలో సీఎం మార్పుతోపాటు మంత్రివర్గ విస్తరణకు ఆ పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, త్వర లో తెలంగాణలోనూ మంత్రివర్గ విస్తరణ జరగనున్నదనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో వరుస భేటీలతో రాష్ట్రంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.
శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని కోరిన ఆయన.. శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనూ కలిశారు. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించాలనే దానిపై ఆలోచన చేస్తున్న ఆ పార్టీ హైకమాండ్.. ఎవరిని కేబినెట్ నుంచి తొలగించి.. ఏ శాఖను కేటాయిస్తారోనని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతున్నది. మరోవైపు మంత్రివర్గం లో మాల సామాజిక వర్గానికి చెందిన వారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు గడ్డం వివేక్ ఉన్నారు. మరి వారిద్దరి లో ఎవరినైనా మం త్రివర్గం నుంచి తప్పించి స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు పదవిని కట్టబెడతా రా..?లేకుంటే ఆ పార్టీ హైకమాండ్ మరో ఆలోచనలో ఉన్నదా? అనేది త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణతో తేలనున్నది.
తమకూ మంత్రి పదవి కావాలంటూ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తోపాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమకూ మంత్రి పదవి కావాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. రామ్మెహన్‌రెడ్డి త్వరలో జరగనున్న మంత్రివర్గంలో ఏలాగైనా చోటు దక్కించుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నే ఈ నెలలో కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన ఆయన రాహుల్‌గాంధీని కలిసి మంత్రివర్గంలో అవకాశమివ్వాలని కోరారు. అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా కేబినెట్లో బెర్తు కోసం ఆ పార్టీ కమాండ్‌ను కలిశారు. ఇప్పటికే రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు మా ఇద్దరిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించినా సరేనంటూ పార్టీ హైకమాండ్‌కు రాతపూర్వక లేఖను ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా.. ఆ సామాజిక వర్గం నుంచి వారికి మంత్రి పదవి దక్కే చాన్స్ లేదంటూ ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మరోవైపు రెండు నెలల కిందట వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీని స్పీకర్ కలిసిన సమయంలో ఢిల్లీకి వచ్చి కలవండంటూ చెప్పడంతో మంత్రి పదవి దక్కనున్నదనే ప్రచారం ఊపందుకున్నది. అంతేకాకుండా రేవంత్‌రెడ్డిని కాదని మంత్రి పదవి కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేయడం నచ్చని ముఖ్యమంత్రి రామ్మోహన్‌రెడ్డి పట్ల సానుకూలంగా లేనట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చ నడుస్తున్నది. మరోవైపు మొదట్నుంచి సీఎంకు విధేయుడిగా ఉన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి కలిసొస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఏదైమైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ ప్రసాద్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డిలు మంత్రివర్గంలో చోటుకోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరిని పదవి వరించనుందో త్వరలో తేలనున్నది.