సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ అధికారులు, సిబ్బంది అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నమస్తే తెలంగాణ వరుస కథనాలు టీజీఎస్పీడీసీఎల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి. గౌరవ హైకోర్టు తీర్పులనే ఫ్యాబ్రికేట్ చేసి నిషేధిత భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు యూడీఎస్కు సంబంధించిన వాటిని పునరుద్ధరిస్తూ ఇచ్చిన అక్రమ కనెక్షన్లకు లక్షలు దండుకున్న వైనం, అందులో భాగస్వాములై ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్‌శాఖకు చెందిన సెక్రటరీ, సీఎండీ స్థాయి ప్రధాన అధికారులే ఈ వ్యవహారం నిగ్గు తేల్చడానికి సిద్ధమైనట్లు సమాచారం.
హైకోర్టు ఉత్తర్వులను తారుమారు చేసి నకిలీ ఉత్తర్వులు సృష్టించి నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు మీటర్లు ఇవ్వడం మొదలుకొని పలురకాల అక్రమాలపై సీఎండీ జితేష్ పాటిల్ క్షేత్రస్థాయిలో స్వయంగా ఆరా తీస్తున్నారు. తమకు ఇటీవలే ఈ వ్యవహారం తెలిసినప్పటికీ ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నట్లుగా తాము ఊహించలేదని, కేవలం చిన్నచిన్న పనుల వరకే ఈ వ్యవహారం జరిగిందనుకున్నట్లుగా స్థానిక అధికారులతో ఆ జోన్ ఉన్నతాధికారులు అన్నట్లు తెలిసింది.
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఫోర్జరీ చేయడంతో పాటు పలు కీలకపత్రాల ఫోర్జరీలో అధికారులు, సిబ్బంది ప్రమేయాన్ని గుర్తించడంలో తమ శాఖ పరంగా విఫలమవుతున్నట్లుగా అధికారులే చర్చించుకుంటున్నారు. ఇది పూర్తిగా ఆ సర్వీసుకనెక్షన్లు తీసుకున్న వినియోగదారుల మెడకే చుట్టుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత పెద్ద నేరంలో భాగస్వాములైన ఆ ఇద్దరు ఆర్టిజన్లు, స్థానిక కీలక ఇంజినీరుతో పాటు సర్కిల్ కార్యాలయంలో ఒక ఇంజినీర్, జోన్ స్థాయిలో అధికారులు ఇందులో ప్రధాన భూమిక పోషించినట్లుగా మూడు సర్కిళ్లల్లో చర్చ జరుగుతోంది.
ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండా..!
ఇదిలా ఉంటే కూకట్పల్లి సర్వేనెంబర్ 1007 వివాదాస్పదమైన భూమి కాగా అందులో అక్రమనిర్మాణాలకు సంబంధించి సర్వీసు కనెక్షన్లు ఇవ్వడానికి ఇదే అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అందులో ఉన్న ఒక హౌసింగ్ సొసైటీలోని ఇంటికి సంబంధించిన సర్వీసు విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. సాధారణంగా నలభై మీటర్ల లోపు సర్వీసు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తే వాటికి సర్వీసు వైర్ ద్వారానే ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా కనెక్షన్ ఇస్తారు.
కానీ ఇక్కడ చెప్పిన ఈ నిర్మాణానికి అవసరమైన ఎల్టీ లైన్ లేకపోవడంతో పాటు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఎల్టీ లైన్ నుంచి 200మీటర్లు దూరం ఉంది. దీంతో ఎలాంటి ఎస్టిమేషన్లు కానీ, టెక్నికల్ అప్రూవల్‌లు, సాంక్షన్లు కానీ లేకుండా సంబంధిత ఎల్టీ లైన్ ఎక్స్‌టెన్షన్‌ను విడుదల చేశారు. ఈ సర్వీసుపై ఏ అధికారి అనుమతి ఇచ్చారు, ఏ నిబంధనల ప్రకారం ఎల్టీ లైన్ లేకుండానే సర్వీసు విడుదల చేశారనేది ప్రస్తుతం సైబర్‌సిటీ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎలా సర్వీసు రిలీజ్ చేస్తారని, ఆ తర్వాత వారికి ఎల్టీ లైన్ లేకున్నా వేరే దగ్గర నుంచి ఐదు పోల్లు ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా సైబర్ సిటీ సర్కిల్లోని కొందరు అధికారుల అండదండలతో ఆర్టిజన్లే నేరుగా ఈ వ్యవహారం నడిపించినట్లు సమాచారం.
ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. నిషేధితభూములు, కోర్టు వివాదాలు ఉన్న గురుకుల్ట్రస్ట్, అయ్యప్పసొసైటీల వంటి వాటిల్లో కొత్త సర్వీసులు ఇవ్వాలంటే కోర్టు ఉత్తర్వులు కావాలి. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని ఈ ప్రాంతంలో కోర్టు ఆర్డర్ లేకుండా కమర్షియల్ సీఈ ఉత్తర్వులు లేకుండా మీటర్ కానీ సర్వీస్ కనెక్షన్ కానీ విడుదల చేయడం లేదు. కానీ ఈ ప్రత్యేక కేసులో మాత్రం ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా సీఈ ఉత్తర్వులు కూడా పట్టించుకోకుండా సర్వీస్ కనెక్షన్ విడుదల చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులనే ఫోర్జరీ చేసి నకిలీలు సృష్టించిన ఆ ఇద్దరు ముఖ్య అధికారులతో పాటు మరో ఇద్దరు ఇంజినీర్లు, ఒక అకౌంట్స్ అధికారి, ఇద్దరు ఆర్టిజన్ల దందాలో ప్రధానంగా వారెవరూ తెరమీద లేకపోవడం గమనార్హం.
వారికేం తెలియదట..!
సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే అసలు తమకేం తెలియదని స్థానిక అధికారులు తమ పై అధికారులకు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కేవలం 26 కనెక్షన్లు మాత్రమే అక్రమమని, మిగతా వాటి విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉన్నట్లుగా వారు పేర్కొంటున్నారు. మరో విచిత్రమేంటంటే అక్కడ ఉన్న కీలక అధికారికి సంబంధించిన లాగిన్‌ను ఆ ఆర్టిజన్లు వాడుకున్నారంటూ ఆ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఒక అధికారికి తెలియకుండానే ఆర్టిజన్లు ఆయన లాగిన్ వాడుకునే పరిస్థితి ఆ డివిజన్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అర్ధమవుతున్నదని జోన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
సంవత్సరకాలంగా తనకు తెలియకుండా తన ఐడీతో లాగిన్ అవడం, తాను ఊళ్లో లేనప్పుడు ఇదంతా జరిగిందంటూ ఆ ఇంజనీర్లు బుకాయించే ప్రయత్నాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయం కార్పొరేట్ ఆఫీసులోని ఉన్నతాధికారుల వరకు తెలిసినా మొదట్లో సైబర్ సిటీ సర్కిల్నే పట్టించుకోలేదని, అందులోనూ కొండాపూర్ డివిజన్ అంటే అక్రమాలకు నిలయంగా చెప్పుకుంటారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సర్కిల్ కార్యాలయం, కొండాపూర్ ఆఫీసుల్లోని ఇద్దరు ఇంజనీర్లు ఆ ఇద్దరు ఆర్టిజన్ల అక్రమాలకు సహకరించినట్లు చర్చ జరుగుతోంది. గతంలో సస్పెండయి ప్రస్తుతం మళ్లీ అదే సెక్షన్లలో ఎఫ్ఓసీ డ్యూటీలు చేస్తున్న ఆ ఇద్దరు ఉద్యోగులే సైబర్‌సిటీ సర్కిల్లో అక్రమ నిర్మాణాలు, ఇతర కనెక్షన్లకు సంబంధించిన పనులు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రంగారెడ్డి జోన్లో పనిచేస్తున్న పన్నెండు మంది ఏఈలకు ఇటీవలే మెమోలు ఇచ్చినట్లు తెలిసింది. వారి పనితీరు బాగాలేదని, బకాయిల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ వారికి మెమోలు ఇచ్చిన వైనం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా ఇంజినీర్లు జోన్ కార్యాలయం నుంచి చెప్పిన పనులు చేయకపోవడం వల్లే మెమోలు ఇచ్చారంటూ మాట్లాడుకుంటున్నప్పటికీ వారు పనుల్లో నిర్లక్ష్యం వహించారనేది వాస్తవం. అయితే ఇందులో కొంత పై నుంచి ఒత్తిడితో పాటు వారి నిర్లక్ష్యం కూడా కారణంగా మెమోలు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. మొత్తమ్మీద ప్రస్తుతం ఎస్పీడీసీఎల్లో సైబర్ సిటీ సర్కిల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై నిగ్గు తేల్చడానికి సీఎండీ జితేష్ పాటిల్ సిద్ధమవ్వడంతో ఎవరిపై వేటుపడుతుందోనంటూ రంగారెడ్డి జోన్ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది.