మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అత్యంత ఖరీదైన కూకట్పల్లి ప్రాంతంలో దాదాపు రూ.2వేల కోట్ల విలువైన సర్కారు భూమి దారాదత్తమైపోతున్నది..అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) పరిధిలోకి వస్తుందని గతంలో స్వయంగా నిర్ధారించిన ప్రభుత్వ భూమిని రక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. అధికారుల అలసత్వం, కోర్టులో బలహీనమైన వాదనలు వినిపించడమే కాకుండా..తదుపురి సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన చోట అధికార పార్టీ నేతలకు దాసోహమైన యంత్రాంగం కారణంగా ప్రభుత్వానికి దక్కాల్సిన వేల కోట్ల విలువైన ఆస్తి పరాధీనమైంది. ఈ లొసుగులనే అదనుగా మలచుకున్న అధికార పార్టీ నేతలు, భూ బకాసురులు రంగంలోకి దిగి క్లియరెన్స్ పేరుతో ముందస్తుగా అగ్రిమెంట్లు చేసుకుని..కోర్టు తీర్పు తర్వాత ఏకంగా బలవంతంగా అగ్రిమెంట్లు చేసుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిని కాపాడడంలో విఫలమైన యంత్రాంగం ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆక్రమాలకు కొమ్ముకాస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-సిటీబ్యూరో/కూకట్పల్లి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో/కూకట్పల్లి (నమస్తే తెలంగాణ) :హైదర్‌నగర్ గ్రామంలోని సర్వేనంబర్ 148 నుంచి 155 పరిధిలో 92 ఎకరాల 21 గుంటల భూమి కి సంబంధించి వివాదం నెలకొంది. ఈ స్థలాన్ని 1980లో గోపాల్ నగర్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్లింగ్ సొసైటీ పేరుతో కొనుగోలు చేశారు. కానీ సర్వే నెంబర్లు 148,149,150/1, 151/1, 152, 153, 154, 155 పరిధిలోని 43700.95 స్కేర్ మీటర్ల స్థలం (సుమారు 10.8 ఎకరాలు) మిగులు భూమిగా గుర్తించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. యు/సి .10(6) యాక్ట్ ప్రకారం… సీసీ నెంబర్ హెచ్1/7496/76 ద్వారా స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ గెజిట్ నెంబర్ 202 పేరుతో 2005లో జీవో జారీ చేశారు.
ఈ జీవో ఆధారంగా 2012 లో గోపాల్ నగర్లో యూఎల్సీ స్థలానికి మారింగ్ వేసి, దీని పరిధిలోని పది ఎకరాల యుఎల్‌సీ భూములలో వెలసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని అప్పటి రంగారెడ్డి జిల్లాలోని మూసాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయగా అప్పటినుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 2010లో యుఎల్సి ప్లాట్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దని జీహెచ్ఎంసి కమిషనర్‌కు యుఎల్సి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్థలాలలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానీ నిర్మాణాలకు కానీ జరగలేదు. కాగా ఇటీవల కోర్టు తీర్పు గోపాల్ నగర్ సొసైటీకి అనుకూలంగా రావడంలో రెవెన్యూ అధికారులు సరైన వాదన వినిపించ లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విలువైన స్థలాన్ని కాపాడేందుకు రెవిన్యూ విభాగం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్న…. ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోలేదు..ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మౌనంగా ఉండడం వెనుక అనేక ఆక్రమాలు జరిగాయన్న చర్చ జరుగుతున్నది.
అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు
గోపాల్‌నగర్‌లోని యూఎల్సీ భూములపై వెస్ట్ జోన్‌లోని పార్టీ కండువా మార్చిన ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కనుపడింది. వివాదాస్పద స్థలం లోని ప్లాట్లను గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తే కోర్టులో యూఎల్సీ భూముల వివాదాన్ని పరిషరిస్తామని, ఆపై బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి వాటా ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని కొందరు ప్లాట్ల యజమానులతో కోర్టు తీర్పు రాకముందే ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ చట్ట వ్యరేతిక అవగాహన ఒప్పందాలు చేసుకుని విలాసవంతమైన లే అవుట్ల ఏర్పాటుకు పెద్ద ఎత్తున స్కేచ్ వేశారు. ఈ కంపెనీలో సంబంధిత ఎమ్మెల్యే బావమరిది, మియాపూర్ ఓ మాజీ కార్పొరేటర్, ఎమ్మెల్యే బంధువులు సూత్రధారులు ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది.
ఈ క్రమంలోనే అధికారుల అలసత్వం..అనుకూలమైన న్యాయస్థానం తీర్పును అసరాగా చేసుకొని మిగిలిన ప్లాట్ల ఓనర్లపై ఒత్తిడి పెంచి బలవంతంగ భయభ్రాంతులకు గురిచేసి (డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నరీ) డీఏజీపీఏ బలవంతంగా చేయించుకునే పనిలో నిగమ్నమయ్యారు. రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో డీఏజీపీఏ చేయించుకున్న పరిస్థితి. ఈ తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాస్పద స్థలంలోని 10 ఎకరాల స్థలాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు నయానో భయాన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
ఎస్ఎల్పీ వేయకుండా మౌనం
కూకట్పల్లి మండలం హైదర్ నగర్ గ్రామంలోని సర్వేనెంబర్ లోని 148 నుంచి 155 వరకు 10.8 ఎకరాల స్థలం ఇన్నాళ్లు యుఎల్సి భూమిగా పేరొన్న మూసాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇప్పుడు మాయమైందని అధికారులు చెబుతుండడం గమనార్హం. గతంలో యుఎల్సి నీ సాకుగా చూపెట్టి ప్లాట్ల యజమానులకు రిజిస్ట్రేషన్లు చేయడం గాని, డీఏ జీపీఏ చేయడం గాని చేయలేదు. కానీ కోర్టు తీర్పును సాకుగా చూపెట్టి గత వారం రోజులుగా వివాదాస్పద స్థలంలో ప్లాట్లకు డిఏ జీపీఎ చేస్తున్నారు. ఇన్నాళ్లు యూఎల్సీ భూమి అని, ఇప్పుడు ఆ జాబితాలో లేవని రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక సబ్ రిజిస్టర్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి బలమైన ఒత్తిడి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే జిపిఏ చేస్తున్నంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో రెవెన్యూ అధికారులు పైకోర్టుకు అప్పిలుకు వెళ్లి… యుఎల్సి భూమిగా నిర్ధారించే అవకాశం అవకాశం ఉన్నప్పటికీ… సబ్ రిజిస్టర్ వాటిని పట్టించుకోకపోవడం వెనక ధనదాహం కారణం కావచ్చని చర్చ జరుగుతున్నది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయకుండా ప్రభుత్వం వెనకడుగు వేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిటిషన్ వేయకుండా అడ్డుకున్నదెవరు? ప్రజాధనమైన కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దక్కకుండా చేసేందుకు రియల్ భూ స్వాములను మేలు చేకూర్చేలా అధికార యంత్రాంగంపై ఎవరు ఒత్తిడి తెచ్చారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలి
సంబంధిత ఎమ్మెల్యే బంధువులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణరంగ సంస్థకు వత్తాసు పలుకుతూ అక్రమంగా రిజిస్ట్రేషన్లకు సహకారం అందుతుందని దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు జిల్లా కలెక్టర్ మనూ చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు తీర్పును ప్రామాణికంగా తీసుకుంటే ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని, మధ్యవర్తుల ద్వారా మోసాలకు గురికాకుండా ప్లాట్ల యజమానులు నేరుగా ఇల్లు నిర్మించుకునీ వారి కలను సహకారం చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అధికారులు ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేని కారణంగా యూఎల్సీ భూములు లేక ప్రైవేట్ భూములన్న మీమాంసను అడ్డుపెట్టుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిజమైన ప్లాట్ యజమానులను మభ్యపెట్టి వందల కోట్ల విలువైన భూములను తమ వ్యాపార అడ్డాగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయని, కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రేటర్ పేరుతో ఏర్పాటైన ప్రాజెక్టు పాత్రను నిగ్గు తేల్చాలని స్థానిక ప్రజాప్రతినిధులు, బాధిత ప్లాట్ల యాజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌ను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.