సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. చిన్నారులు, మహిళలపై రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. పోలీసుల గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరాల్లో నమోదైన లైంగికదాడి కేసులు, పోక్సో కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదైనట్లు తెలుస్తోంది. గత రెండేండ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ..ఈ ట్రైకమిషనరేట్ల పరిధిలో 3017 పోక్సో కేసులు నమోదు కాగా, లైంగికదాడి కేసులు 2,353 నమోదయ్యాయి.
తాజాగా గడిచిన ఏడునెలలో మరో 1200 కేసులు అదనంగా ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో ఎక్కువ శాతం బాధితులకు తెలిసివారు, పక్కింటివారు, స్నేహితులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో గడిచిన 7 నెలల వ్యవధిలోనే ఏకంగా 270 లైంగిక, గృహహింస, వేధింపుల కేసులు నమోదైనట్లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు మహిళల భద్రతపై ప్రమాదఘంటికలు మోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కంటికి కనిపించని భయం.. ఎటు చూసినా విసిరే వేధింపులు, చివరకు సొంత ఇంట్లోనే కాటేస్తున్న అభద్రత మారుతున్న కాలంలో మహిళల ప్రాణాలకు, స్వేచ్ఛకు, గౌరవానికి ఎదురవుతున్న ముప్పు అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఆధునిక సమాజంలో సాంకతిఏకత ఎంత వేగంగా విస్తరిస్తుందో, అదే స్థాయిలో మహిళపై అకృత్యాలు, వేధింపులు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు షీ టీమ్స్, భరోసా వంటి కేంద్రాలు పనిచేస్తున్నాయి.
మహిళలపై జరుగుతున్న నేరాలపై కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా, ఇంకా మరికొందరు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా, పురుషుల్లో మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడుల కేసుల్లో ఇటీవల గౌరవ న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు నగరవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వీరిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
భరోసా కల్పించాల్సిందే..!
మహిళలపై జరిగే వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అసవరముంటుంది. బహిరంగంగా మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఆయా పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఉన్నాయి. అయితే ఈ షీ టీమ్స్ సైతం సరిగ్గా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మేమున్నామనే చెప్పుకునే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించడం ఆ తరువాత బయట నిఘా పెట్టడం వంటి విషయాలను పక్కన పెట్టేస్తున్నారు. సోసల్మీడియా ద్వారా కూడా వేధింపులు జరుగుతున్నాయి.
మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్, సీడీఈడబ్ల్యూ, ఏహెచ్టీయు, భరోసా కేంద్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటికి తోడు క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలకు భరోసా ఇచ్చే పెట్రోలింగ్ వ్యవస్థ సైతం ఉంది, ఆయా విభాగాలు సరిగ్గా పనిచేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఆయా విభాగాలపై అధికారుల నిరంతర పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, మహిళలు, విద్యార్థులలో ఆత్మరక్షణ మెళకువలపై విస్త్రతంగా అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు.
ఘటనలు ఇవి

-ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో నాలుగు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్సిటీ ఉండగా వీటి పరిధిలో గడిచిన ఏడునెలల్లో సుమారుగా 1200 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.