T20 World Cup | భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌లో విజయపతాక ఎగురవేసింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు మోసుకుంటూ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి టైటిల్ కొల్లగొట్టి తీన్మార్ మోగించింది. పొట్టి ఫార్మాట్లో తమను కొట్టే జట్టే లేదన్నట్టుగా మేటి జట్లను మట్టికరిపిస్తూ సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలోని భారత్ అప్రతిహత విజయాలతో న్యూజిలాండ్ భరతం పట్టింది.
సమష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ ఫైనల్లో కివీస్‌పై చారిత్రక విజయం సొంతం చేసుకుంది. మూడేండ్ల క్రితం సగటు భారత అభిమాని గుండె బద్దలైన చోట తమ అద్భుత ప్రదర్శనతో కలల కప్‌ను ముద్దాడింది. అచ్చిరాదనుకున్న అహ్మదాబాద్‌లో టీమ్ఇండియా నయా జోష్‌తో ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం తీసుకొచ్చింది.
అహ్మదాబాద్: టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా మూడో టైటిల్‌ను అందుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది. తమకు అచ్చిరాదేమో అనుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థిని 96 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫీని నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు ఇది వరుసగా రెండో వరల్డ్ కప్ (2024 తర్వాత) కాగా స్వదేశంలో ఈ ట్రోఫీ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది. ఫైనల్లో సంజూ శాంసన్ (46 బంతుల్లో 89, 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర మెరుపులతో భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఛేదనలో బుమ్రా (4/15) పేస్ పదునుకు తోడు అక్షర్ పటేల్ (3/27) స్పిన్ మాయతో కివీస్ 19 ఓవర్లలో 159కే కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్ (26 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా నిరాశపరిచారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, శాంసన్‌కు(321 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డులు దక్కాయి.
ఛేదనలో న్యూజిలాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ ఓటమి ఆ జట్టు ఇన్నింగ్స్ అర్ధభాగానికే ఖరారైంది. బుమ్రా, అక్షర్ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. గత మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతకంతో సఫారీ బౌలింగ్‌ను చెడుగుడాడుకున్న విధ్వంసకర ఫిన్ అలెన్ (9) మూడో ఓవర్లోనే ఔట్ అవడంతో ఆ జట్టు ఢీలా పడింది. తొలి ఓవర్లోనే అతడి క్యాచ్‌ను మిడాఫ్ వద్ద దూబె మిస్ చేసినా వ్యూహాత్మకంగా మూడో ఓవర్లో బంతినందుకున్న అక్షర్.. అతడికి చెక్ పెట్టాడు. బౌలింగ్‌కు వస్తూనే బుమ్రా.. రచిన్ (1)ను పెవిలియన్‌కు పంపి కివీస్‌ను మరో దెబ్బకొట్టాడు. ఇషాన్ అద్భుతమైన క్యాచ్‌తో రచిన్ కథ ముగిసింది. అక్షర్ తన తర్వాతి ఓవర్లో మరో సూపర్ డెలివరీతో ప్రమాదకర ఫిలిప్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఒకపక్క సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా ఓపెనర్ సీఫర్ట్ మాత్రం వేగంగా ఆడాడు. హార్ధిక్ రెండో ఓవర్లో రెండేసి సిక్స్‌లు, ఫోర్లు బాదిన అతడు.. వరుణ్ ఏడో ఓవర్లో రెండు సిక్సర్లతో 23 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. కానీ 4 బంతుల వ్యవధిలో ఆ జట్టు మరో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. చాప్మన్ (3)ను హార్ధిక్ ఔట్ చేయగా వరుణ్ బౌలింగ్‌లో సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద ఇషాన్ మరో అద్భుత క్యాచ్ పట్టడంతో ఆ జట్టు కథ దాదాపుగా ముగిసింది. ఆ తర్వాత కివీస్ బ్యాటర్ల ఆటంతా ఓటమి అంతరాన్ని తగ్గించడానికే సాగింది.
టాస్ గెలిచిన కివీస్ సారథి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించి తానెంత తప్పు చేశాడో తెలుసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. టోర్నీ ఆసాంతం దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కున్న అభిషేక్ శర్మ.. క్రీజులో కుదురుకుంటే తానెంత ప్రమాదకారో మరోసారి నిరూపించుకున్నాడు. అభిమానులు ఆశించినట్టుగానే తన కసినంతా ఫైనల్‌కు దాచుకున్నట్టు.. ఉన్నది కొద్దిసేపే అయినా అతడి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మరో ఎండ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న సంజూ కూడా అతడికి జతకలవడంతో భారత స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది.
అభిషేక్ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని రెండో ఓవర్లోనే శాంట్నర్.. ఫిలిప్స్‌కు బంతినిచ్చినా ఈసారి సంయమనాన్ని ప్రదర్శించిన అతడు, డఫ్ఫీ ఓవర్లో మాత్రం రెండు ఫోర్లు బాదాడు. ఇక సిక్స్‌తో ఖాతా తెరిచిన సంజూ.. ఫెర్గూసన్ ఓవర్లో 6,4 కొట్టగా అభిషేక్ కూడా ఫోర్, సిక్స్‌తో ఆ ఓవర్లో 24 రన్స్ వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఈ ఇద్దరూ తలా ఓ సిక్స్ కొట్టగా డఫ్ఫీ బౌలింగ్‌లో 4, 6, 4, 2, 4తో బాదిన అభిషేక్ 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. దీంతో పవర్ ప్లేలో భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అయితే 8వ ఓవర్లో బంతినందుకున్న రచిన్.. అభిషేక్‌ను ఔట్ చేసి 98 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.

ఓపెనర్ల దూకుడుతో 7.2 ఓవర్లకే 100 పరుగుల మార్కును దాటిన భారత్‌కు అభిషేక్ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కూడా తగ్గలేదు. వస్తూనే రెండు బౌండరీలు బాదాడు. శాంట్నర్ 11వ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సంజూ.. ఈ టోర్నీలో వరుసగా మూడో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రచిన్ ఓవర్లో సంజూ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. శాంట్నర్ బౌలింగ్‌లో ఇషాన్ కూడా 6, 4తో 15 ఓవర్లకే టీమ్ఇండియా 203/1తో జోరుమీదుండంతో 280 దాకా వెళ్తుందని భావించారంతా.. కానీ నీషమ్ ఒకే ఓవర్లో ‘ట్రిపుల్’ షాకులిచ్చాడు. ఫుల్‌టాస్‌గా విసిరిన తొలి బంతిని లాంగాన్ మీదుగా ఆడబోయిన శాంసన్.. మెక్కాంచీ క్యాచ్ పట్టడంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తృటిలోనే శతకం చేజార్చుకున్నాడు. ఐదో బంతికి ఇషాన్ కూడా అనవసరపు షాట్ ఆడి చాప్మన్ చేతికి చిక్కాడు. రెండో వికెట్‌కు ఇషాన్, సంజూ 48 బంతుల్లోనే 105 రన్స్ జోడించారు. లాస్ట్ బాల్‌కు కెప్టెన్ సూర్య డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 3 ఓవర్లలో 27 పరుగులే రాగా హార్ధిక్ (18) కూడా నిష్క్రమించాడు. కానీ ఆఖరి ఓవర్లో దూబె (8 బంతుల్లో 26 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) 4, 6, 6, 4, 4తో 24 రన్స్ పిండుకోవడంతో భారత్ ఈ టోర్నీలో మూడోసారి 250 పరుగుల మార్కును దాటింది.
టీమ్ఇండియా పోగొట్టుకున్న చోటే వెతుక్కుంది. సుమారు రెండున్నరేండ్ల క్రితం ఇదే వేదికపై వన్డే ప్రపంచకప్ టైటిల్ కోల్పోయిన మెన్ ఇన్ బ్లూ.. ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఆ అవకాశమివ్వకుండా సగర్వంగా మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులకు తీవ్ర వేదనను మిగిల్చిన టీమ్ఇండియా.. ఆ బాధను తాజా టోర్నీ విజయంతో కాస్త తగ్గించింది.
భారత్: 20 ఓవర్లకు 255/5 (సంజూ 89, ఇషాన్ 54, నీషమ్ 3/46, రచిన్ 1/32); న్యూజిలాండ్: 20 ఓవర్లకు 159 ఆలౌట్ (సీఫర్ట్ 52, శాంట్నర్ 43, బుమ్రా 4/15, అక్షర్ 3/27)

సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు! ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర తిరుగరాసింది. కోట్లాది మంది అభిమానుల కలను సాకారం చేస్తూ తమ కలల కప్‌ను ముచ్చటగా మూడోసారి సగర్వంగా ముద్దాడింది. పొట్టిపోరులో తమకు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతూ సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా విజయదుందుభి మోగించింది. అచ్చిరాదనుకున్న అహ్మదాబాద్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను పడగొడుతూ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు సార్థకత చేకూరుస్తూ మిగతా జట్లకు సాధ్యం కాని రీతిలో మూడోసారి కప్‌ను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా రెండేండ్ల క్రితం కరీబియన్ దీవుల్లో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ అదే చాంపియన్ ఒరవడి కొనసాగించింది. దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ ఫార్మాట్‌క వీడ్కోలు పలికినా..ఆ లోటు ఏ మాత్రం కనిపించకుండా కుర్రాళ్లు అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
మిషన్-2026 స్ఫూర్తిని కొనసాగిస్తూ సొంత ఇలాఖాలో తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. రోహిత్ వారసునిగా సారథ్య పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ సహచరుల్లో అద్భుత స్ఫూర్తి నింపాడు. ఎంతలా అంటే ఫామ్‌లేమితో ఇబ్బందులు ఎదురైనా సహచరులకు అండగా నిలుస్తూ చిరస్మరణీయ విజయాలు సాధించాడు. సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ భారత్‌కు విజయాలందించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణించిన వారిని జట్టులో సెలెక్టర్లు అవకాశం కల్పిస్తే..సూర్యకుమార్ వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఫామ్‌లేమితో ఇబ్బందులు ఎదుర్కొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ విషయంలో మేనేజ్మెంట్ ఎక్కడా వెనుకకు తగ్గలేదు. ఫలితం మెగాటోర్నీలో కీలకమైన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా హ్యాట్రిక్ అర్ధసెంచరీలతో శాంసన్..టీమ్ఇండియా టైటిల్ విజయంలో కీలకమయ్యాడు. మరోవైపు టోర్నీకి ముందు పరుగుల వరద పారించిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ హ్యాట్రిక్ సున్నాలు చుట్టినా అతనిపై నమ్మకముంచారు.
దీనికి తోడు దేశవాళీలో దుమ్మురేపిన ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. ఇలా తమ బాధ్యతలను నెరవేరేస్తూ చిరస్మణీయ విజయంలో భాగమయ్యారు. ఇదిలా ఉంటే సరిగ్గా మూడేండ్ల క్రితం (నవంబర్ 19, 2023) అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఓటమి కోట్లాది మంది భారత హృదయాలను మెలిపెట్టిన సందర్భాన్ని మరిపిస్తూ కుర్రాళ్లు కొత్త చరిత్ర లిఖించారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే పొందాలన్న ఏకైక లక్ష్యంతో భారత్ చెలరేగిన తీరు నభూతో నభవిష్యత్. కివీస్‌ను మరోమారు రన్నరప్‌గా పరిమితం చేస్తూ టీమ్ఇండియా అహ్మదాబాద్షా అని నిరూపించింది. ఈ క్రమంలో దేశానికి టీ20 ప్రపంచకప్ అందించిన సారథులు మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్‌శర్మ సరసన సూర్యకుమార్‌యాదవ్ రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్‌ను ఊపిరిగా భావించే భారత్‌లో మనోళ్ల అద్భుత ప్రదర్శనకు అల్విదా అంటూ అభిమానులు సంబురాల్లో మునిగిపోవడం మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
పరిమిత ఓవర్ల క్రికెట్లో భాగంగా ఐసీసీ నిర్వహించే వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో టీమ్ఇండియా 5వ ట్రోఫీ సాధించింది. 1983, 2011 (వన్డేల్లో), 2007, 2024, 2026 (టీ20)లో భారత్ కప్పు గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీతో కలుపుకుంటే మొత్తంగా 8వ టైటిల్. 2022 (కివీస్‌తో సంయుక్తంగా), 2013, 2025లో భారత్ విజేతగా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (10) తర్వాతి స్థానం మెన్ ఇన్ బ్లూదే.
వెల్డన్ టీమ్ఇండియా
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బుమ్రా మరోమారు తన విధ్వంసక బౌలింగ్‌తో ఎంత ప్రమాదకారో నిరూపించాడు. అక్షర్‌పటేల్ అద్భుత ప్రదర్శన మరిచిపోకూడదు. ప్రపంచకప్ గెలువడానికి భారత్ అన్ని రకాల అర్హత కల్గింది.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వాట్ ఏ విక్టరీ!
టీ20 ప్రపంచ చాంపియన్ భారత్‌కు హ్యాట్సాఫ్. విధ్వంసక బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్, చాంపియన్ ఆటతీరుతో ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. టోర్నీ ఆసాంతం శాంసన్ మెరుగైన ప్రదర్శన కనబర్చగా, అభిషేక్, కిషన్, దూబే, బుమ్రా, అర్ష్‌దీప్ జట్టు విజయంలో కీలకమయ్యారు. యావత్ భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తున్నది. అభినందనలు టీమ్ఇండియా.
– హరీశ్‌రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత
ఈ టోర్నీ ఫైనల్లో ఒక బ్యాటర్ అత్యుత్తమ స్కోరు శాంసన్‌దే. గతంలో శామ్యూల్స్ (విండీస్), విలియమ్సన్ (కివీస్) చేసిన 85 రికార్డును అతడు అధిగమించాడు.
ప్రైజ్‌మనీ విజేత