Old Age Problemsజీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞానానికి మురిసిపోవాలా? కార్పొరేట్ దవాఖానల మోతలను తలుచుకునివణికిపోవాలా? ఎలా చూసినా.. వృద్ధాప్యం సంక్షోభంలో పడుతున్న ఛాయలే కనిపిస్తున్నాయి.
రాజకీయ కురువృద్ధుడు.. దేశ గమనాన్ని మార్చిన నేత.. విలువల తరానికి ప్రతినిధి.. అపార అనుభవజ్ఞుడు.. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా మనకు ఏదో ఒక రూపం స్ఫురించడం ఖాయం. ఆ నెరిసిన మీసం వెనుక,
మెరిసే చిరునవ్వులో నిండు జీవితాన్ని చూసిన గర్వమేదో కనిపిస్తుంది. ఆ కట్టూబొట్టు సంప్రదాయానికి ప్రాణం పోసినట్టు ఉంటాయి. తన మాటలు గాలిపోగేసినవి కావు. ప్రతి అభిప్రాయంలో అపార అనుభవం దాగి ఉంటుంది. వందమందిలో ఉన్నా, వెయ్యి మంది మధ్య నిలబడినా.. ఆ ప్రత్యేకతను కాదనలేం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థికం నుంచి సామాజికం వరకు అనేకానేక సవాళ్లు చిరాకుపెడుతుంటాయి. వాటన్నిటికి పరిష్కారాలు అసాధ్యం కానేకాదు. ముందుజాగ్రత్తతో, పరిపూర్ణ అవగాహనతో ఆ సంక్షోభాన్ని దాటేయవచ్చు.
వి.ఎస్.అచ్యుతానందన్! భారతీయ ఫిడెల్ క్యాస్ట్రోగా పేరుపొందిన ఈ కమ్యూనిస్టు నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి, ఆయన వయసు 83 ఏండ్లు. లాటరీ మాఫియా, అక్రమ కట్టడాల కూల్చివేత లాంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు. 97 ఏండ్లు వచ్చేవరకూ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు.
మన్మోహన్ సింగ్! చరిష్మా లేకున్నా, మాటల మాంత్రికుడు కాకున్నా… వ్యక్తిత్వంతో, మేధస్సుతో అత్యున్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. 82 ఏండ్ల వయసులోనూ దేశాన్ని నడిపించిన మౌని. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీ కూడా ఎనిమిది పదులు దాటినవారే. ఇలాంటి నేతలెందరో, వయసును ఓ సంఖ్యగానే భావించారు. చురుకైన ప్రజా జీవితం గడిపారు. ఆ మాటకొస్తే నేతలే కాదు… అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలు సైతం రాజీలేని పోరుతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు.
మిలీనియల్ తరం మధ్య ఉంటూనే తాము నమ్మిన విలువల కోసం పోరాడుతున్నారు. గుల్జార్, శ్యామ్ బెనెగల్, రోమిలా థాపర్.. 80 ఏండ్లు దాటినా తమవైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఓ వ్యక్తిగా కాకుండా, వ్యవస్థకు మార్గదర్శిగా ఉన్న వృద్ధుల జీవితాలు ఏమేరకు సౌకర్యంగా ఉన్నాయి? అనే ప్రశ్నకు సవాళ్లే జవాబుగా నిలుస్తున్నాయి.
Old People4
వృద్ధుల ఆరోగ్య సమస్యల గురించి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. కణవిభజనలో లోపం వల్ల వయసుతో పాటు అవయవాలూ బలహీనపడుతూ ఉంటాయి. ఇక డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వార్ధక్యంలోని ఒంటరితనంతో వచ్చే కుంగుబాటు లాంటి సమస్యలు సరేసరి. ఆ వయసులో వీటికి మందులు వాడటమే ఆర్థికంగా పెను భారం. ఇక హాస్పిటల్లో చేరాలన్నా, శస్త్రచికిత్స అవసరమైనా.. ఆస్తుల మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి. కారణం! ఆసుపత్రి ఖర్చులకు అండగా నిలిచే ఆరోగ్య బీమా వీరికి అంత తేలికగా వర్తించదు. ఓ అయిదు లక్షల పాలసీ తీసుకోవాలన్నా.. నెలనెలా వేలకు వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారిని బీమా సంస్థలు అంత త్వరగా కరుణించవు. ఓ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ టారిఫ్ ప్రకారం.. రక్తపోటు, మధుమేహం ఉన్న ఎనభై ఏండ్ల వ్యక్తికి పదిలక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కావాలంటే వార్షిక ప్రీమియం అక్షరాలా 84 వేలు. మరేదో కంపెనీ అందులో సగానికి సగం ప్రీమియం వసూలు చేసినా.. నెలకు దాదాపు నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. దశాబ్దాల క్రితమే రిటైర్ అయిపోయి.. అప్పటి లెక్కల ప్రకారం పెన్షన్ పొందుతున్న వృద్ధులకు ఇదంతా ఎంత భారం!
ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోవు. అప్పటికప్పుడు కాకుండా, తక్కువ వయసులోనే పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో రాయితీ వస్తుంది. మిత్రులంతా కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకునే సౌలభ్యం కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. ఆస్తిలో, ఆదాయంలో కొంత భాగాన్ని వైద్యానికి దాచి ఉంచడం మరో పద్ధతి. ఇలాంటి సందర్భాల్లో సమాచారమే కీలకంగా మారుతుంది.
☞ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధుమేహం, క్యాన్సర్, కుంగుబాటు తదితర సమస్యల మీద కృషి చేస్తూ ఉంటాయి. వాటిని సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. ఆ ఎన్జీవోలు నిర్వహించే వైద్య శిబిరాలను కూడా వినియోగించుకోవచ్చు.
☞వృత్తిపరమైన సంఘాల్లో సభ్యులుగా కొన్ని రాయితీలు దక్కించుకోవచ్చు.
☞ ఇక ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వర్తిస్తాయి అనే అవగాహన కూడా ముఖ్యమే.
కంప్యూటర్ల ప్రవేశంతో సాంకేతికత విస్తరించింది. కంప్యూటర్ వాడని కార్యాలయం.. స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు కనిపించడం లేదు. టెక్నాలజీ ఊసే లేకుండా చదువు, కెరీర్ దాటేసిన తరం.. హఠాత్తుగా వాటి మీద పట్టు సాధించడం కష్టమే. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.
☞ గతంలో ఎన్నడూ పరిచయం లేని క్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేందుకు సంకోచించడం.
☞ దృష్టి సమస్య కారణంగా.. స్క్రీన్ మీది అక్షరాలను చదవలేకపోవడం. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 23 శాతం మంది వృద్ధులు ఈ ఇబ్బందితోనే ఆన్‌లైన్‌కు దూరంగా ఉంటున్నారు.
☞ చేతులు వణకడం లేదా వేళ్లు మొద్దుబారిపోవడం వల్ల టచ్ స్క్రీన్ ఉపయోగించలేకపోవడం.
☞ నేర్పేందుకు ఎవరూ లేకపోవడం. మొబైల్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలని ఉన్నా నేర్పేందుకు పిల్లలు ఆసక్తి చూపడం లేదని 60 శాతం వృద్ధులు వాపోతున్నారు. ఒకవేళ నేర్పే ప్రయత్నం మొదలుపెట్టినా, ఓపిక లేక పెద్దల్ని నిరుత్సాహ పరుస్తున్నారు. అయితే ఇందుకు పరిష్కారాలూ లేకపోలేదు.
☞ అనుకూలమైన సెట్టింగ్స్- ఏదైనా ఫోన్, యాప్ ఎంచుకునేటప్పుడు వాటి ఉపయోగంతో పాటు… వృద్ధులకు ఏమేరకు సాయపడతాయో చూసుకోవాలి. ఉదాహరణకు చాలా పరికరాల్లో యాక్సెసబిలిటీ ఫీచర్ అని ఉంటుంది. ఎంపికలను వినిపించడం, అక్షరాలు పెద్దవిగా చూపించడం తదితర వెసులుబాట్లు కల్పిస్తుంది.
☞ తొలిదశలో బేసిక్ మాడల్‌ను ఎంచుకుంటే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి.
☞ ‘ఏజ్ వెల్’ లాంటి సంస్థలు వృద్ధులకు డిజిటల్ నైపుణ్యాన్ని నేర్పేందుకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటితోపాటుగా ఈజీ హై లాంటి సంస్థలు, ఎవర్గ్రీన్ క్లబ్ లాంటి యాప్స్… పెద్దలకు సాంకేతికత పరిచయం చేస్తున్నాయి.
వయసు మీదపడుతూ శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. దానికి పేదరికం తోడైతే ఇక చెప్పేదేముంది? అమెరికా లాంటి ధనిక దేశంలోనే 80 ఏండ్లు దాటిన వారిలో పేదరికం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. వీరిలో 11 శాతం మంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారట. మహిళల్లో అయితే అది 13.6 శాతం. చాలా మందికి పదవీ విరమణ తర్వాత సరైన జీవనాధారం ఉండదు. స్థిరమైన ఆదాయం కోసం పనిచేసే ఓపిక, అవకాశం దొరకదు. పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి, పెండ్లిళ్లు చేసి.. బాధ్యతలన్నీ తీర్చుకునే దశలోనే కూడబెట్టుకున్న ధనమంతా కరిగిపోయి ఉంటుంది. ఆస్తిపాస్తులు కూడా పంచేసి ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ఆకలి తీరేందుకు కూడా పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఓ నివేదిక ప్రకారం 1961లో 10.6 శాతం వృద్ధులు పిల్లల మీద ఆధారపడి ఉండేవారు. అది ప్రస్తుతం 15.7 శాతానికి చేరుకుంది. మరో పదేండ్లకు పరిస్థితి ఇంకా దిగజారవచ్చని హెచ్చరిస్తున్నదీ నివేదిక. అంతేకాదు! కేరళ లాంటి కొన్ని రాష్ర్టాల్లో మూడోవంతు మంది వృద్ధులు పూర్తిగా పిల్లల మీదే ఆధారపడి జీవించే రోజులు వస్తాయని చెబుతున్నది. పాతతరం మహిళల్లో ఉద్యోగస్తుల శాతం తక్కువ కాబట్టి.. వృద్ధాప్యానికి చేరుకునేసరికి భర్త లేదా పిల్లల మీద ఆధారపడేవారే అధికం. అంతేకాదు! వయసు పెరుగుతున్న కొద్దీ… ఆకలితో అలమటించేవారి సంఖ్య కూడా పెరిగిపోతున్నదని మరో సర్వే చెబుతున్నది.
ఇదంతా ఒక ఎత్తయితే.. వృద్ధులను మోసం చేసో, బలవంత పెట్టో ఆస్తులు, ఆదాయ వనరులు లాక్కొనే ప్రయత్నాలకు కొదవ లేదు. సంతకాలను ఫోర్జరీ చేయడం, అప్పు తీసుకుని చెల్లించకపోవడం, సాయం చేసే నెపంతో సర్వం దోచుకోవడం సర్వసాధారణంగా మారింది. పైగా ఆర్థిక మోసగాళ్లు వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటారు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, మోసం జరిగినా వెల్లడించేందుకు జంకడం పెద్దల బలహీనతలు. మోసగాళ్లకు ఇవే బలం అవుతున్నాయి.
సంపాదించే వయసులో ప్రతి రూపాయినీ భవిష్యత్తు కోసం దాచినా, పిల్లల సుఖాలకే వెచ్చించినా, వార్ధక్యానికి చేరుకున్న సమయంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం దురదృష్టకరం. వైద్యం లాంటి అత్యవసర ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి. ముందునుంచీ జాగ్రత్తపడటమే ఇందుకు పరిష్కారం. భవిష్యత్తులో తన అవసరాల గురించి జాగ్రత్తపడకుండా కష్టాల్లోకి జారిపోయినవారి కథలు పార్కులు, కమ్యూనిటీహాళ్ల దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. తరచూ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని చూసైనా మేల్కోవాలి. భవిష్య నిధి లాంటి పథకాలు.. మన శక్తి మేరకు పొదుపు చేసుకునే అవకాశం ఇస్తాయి. చాలా బీమా సంస్థలు పెన్షన్ పాలసీలు కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఆస్తులు వాటా వేసినా… కొంతభాగాన్ని ‘తదనంతరం’గానే పేర్కొని తీరాలి. ప్రపంచీకరణ కాలంలో ఎన్నో బలహీనతలు, అవసరా మధ్య పెరుగుతున్న పిల్లలు.. కష్టకాలంలో తమను ఆదుకుని తీరతారనే భరోసా అంత మంచిది కాదు. ఇక ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పింఛను లాంటి సౌకర్యాల గురించీ పెద్దలు తెలుసుకోవాలి. ఆర్థిక నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. సంతకాలు చేస్తున్నప్పుడు, ఏటీఎం కార్డులు మరొకరికి ఇస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
వృద్ధులు వయోభారంతో వంగిపోయి ఉంటారు. ఎవరో ఒకరిమీద ఆధారపడుతూ ఉంటారు. దౌర్జన్యం జరిగినా అడ్డుకోలేని దుర్బలత్వం. దీంతో నేరగాళ్లకు సులువైన లక్ష్యాలుగా మారుతుంటారు. అవమానించి, హింసించి, ఆర్థికంగా దోచుకుని, లైంగిక దాడి చేసి, స్వేచ్ఛను హరించి… చాలా సులువుగా తప్పించుకోవచ్చనే భావన చాలామందిలో ఉంటుంది. Longitudinal Ageing Study in India (LASI) అనే నివేదిక ప్రకారం మన దేశంలో కనీసం అయిదు శాతం మంది వృద్ధులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీహార్ లాంటి కాస్త వెనుకబడిన రాష్ర్టాల్లో… ఈ సంఖ్య మరింత ఎక్కువని నివేదిక చెబుతున్నది. మారుపేర్లతో పిలవడం, అవమానించడం, బంధుమిత్రులను చూడనీయకపోవడం, వాళ్ల వస్తువులు పాడు చేయడం లాంటి వేధింపులతో వృద్ధులు మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారని వెల్లడించిందీ సంస్థ. నిజానికి ఈ తరహా గణాంకాలను సేకరించడం అంత తేలిక కాదు. భవిష్యత్తు పట్ల భయంతోనో, పిల్లల మీద ప్రేమతోనో.. బయటికి వచ్చి తమ సమస్యను చెప్పగలిగే పెద్దలు తక్కువే!
పసిపిల్లల కోసం మనం ఇంటాబయటా ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. వారి నడక నుంచి వైద్యం వరకు అన్నీ సమకూరుస్తాం. మరి వృద్ధుల సంగతేమిటి?
☞ వృద్ధుల్లో కీళ్లనొప్పులు లాంటి సమస్యలు సాధారణం. నడిచేటప్పుడు పట్టు లేకపోయినా ఇబ్బంది పడతారు. కానీ ఆసుపత్రుల్లాంటి చోట మాత్రమే వీరి కోసం ప్రత్యేకమైన మౌలిక వసతులు కనిపిస్తాయి. సినిమా హాళ్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు రాజీపడి నడవడమో, ఒకచోట కూలబడిపోయి.. చూస్తూ ఉండిపోవడమో తప్పదు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యామ్నాయ మౌలిక వసతులను కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకునేవారి సంఖ్య తక్కువే!
☞ వృద్ధులకు ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వస్తుందో చెప్పలేం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆపద ఎదుర్కొంటారో ఊహించలేం. కొవిడ్ సమయంలో ప్రాణా మైన మందులు సైతం కొనలేక విలవిల్లాడటం చూశాం. అందుకే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
☞ ప్రతి ఆరోగ్య సమస్యకూ ఓ స్పెషలిస్ట్ ఉంటారు. కానీ వృద్ధులకు ప్రత్యేకంగా చికిత్స అందించే geriatricians చాలా అరుదుగా కనిపిస్తారు. వయసుతో పాటు తలెత్తే సమస్యలను గుర్తిస్తూ, రాబోయే సమస్యలను నివారిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిందే.
వయోధికుల సంఖ్య పెరుగుతున్నది. పెద్దల ఆరోగ్యాన్ని కాపాడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తున్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నిండు నూరేండ్లు హాయిగా ఉండాలంటే.. చిన్నపాటి జాగ్రత్తలు పాటించాల్సిందే! నడివయసు నుంచే వృద్ధాప్యానికి ఆర్థిక బాటలు వేసుకోవాలి. కేంద్రం అందించే రాయితీల పట్ల అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు, Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 లాంటి చట్టాలు వృద్ధులకు అండగా నిలబడుతున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి. సదా అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ మించి.. వృద్ధాప్యం ఓ శాపం కాదు సంతోషకరమైన జీవితానికి కొనసాగింపు అనే దృక్పథంతో చురుగ్గా మెలిగే ప్రయత్నం చేయాలి. అందుకు చుట్టుపక్కల వారినుంచి కూడా తగిన ప్రోత్సాహం ఉండాలి. ఆ కురువృద్ధులను వ్యక్తులుగా కాకుండా సంప్రదాయాలకు, విలువలకు ప్రతినిధులుగా… నడిచి వచ్చిన చరిత్రకు ఆనవాళ్లుగా, సుదీర్ఘమైన అనుభవాలను దాటిన జ్ఞానులుగా గుర్తించాలి. గౌరవించాలి. పిల్లల్లా చూసుకోవాలి. పెద్దలకు నమస్కారం.
వైద్య విధానంలో వస్తున్న మార్పులు, అందుబాటులో ఉన్న ప్రజారోగ్యం… ఇలా ఎన్నోకారణాలతో ఆయుఃప్రమాణం పెరుగుతున్నది. వైద్య జర్నల్ లాన్సెట్ అంచనా ప్రకారం.. 1990 నాటికి మన సగటు ఆయుర్దాయం 59.6 ఏండ్లు మాత్రమే… ముప్ఫై ఏండ్లు గడిచేసరికి అది 70.8కి చేరుకుంది. ఆరోగ్యం పట్ల అవగాహన, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో సగటు ఆయుర్దాయం 77 ఏండ్లకు చేరుకోవడం విశేషం. ఇక నోమియా అనే వెబ్సైట్ ప్రకారం మన దేశంలో 80 ఏండ్లు దాటినవారి సంఖ్య 1.38 కోట్లకు పైమాటే. అంటే మన దేశ జనాభాలో దాదాపు ఒక శాతం! దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. వయసు పెరుగుతున్నప్పటికీ జనం అనారోగ్యంతోను, వైకల్యాలతోనూ శేష జీవితాన్ని వెళ్లదీస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు టీకాలు, యాంటీబయాటిక్స్ అందుబాటులోకి రావడం వల్ల ..తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో గుండెజబ్బులు, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ తరహా వ్యాధులతో బాధపడేవారి శాతం రెట్టింపు అయింది.
మన తర్వాత, మన మీద ఆధారపడినవారు ఇబ్బంది పడకుండా రక్షగా నిలుస్తుంది జీవిత బీమా! కానీ వయసు పెరిగే కొద్దీ ‘రిస్క్ ఫ్యాక్టర్’ ఎక్కువవుతుందనే భయంతో బీమా సంస్థలు వృద్ధుల పాలిట కటువుగా ఉంటాయి. 60 ఏండ్లు దాటిన దగ్గర నుంచీ కొత్త పాలసీలు తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ ఇచ్చినా… ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా 80 ఏండ్ల లోపు ముగిసిపోవాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే… 80 ఏండ్లు దాటిన వారి మొహానే తలుపులు వేసేస్తాయి జీవిత బీమా సంస్థలు. వ్యాపారం కోసం ఒకటీ అరా సంస్థలు అనేకానేక షరతులతో బీమా సౌలభ్యం కల్పించవచ్చేమో కానీ… దిగ్గజ సంస్థలు మాత్రం వయోధికులకు దూరంగానే ఉన్నాయి.
ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారంటే… కుటుంబసభ్యులంతా వారితో ఏదో ఒక సమయంలో సంభాషించేవారు. ముఖ్యంగా మనవళ్లు, మనవరాళ్లకు వారితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడేమో, ఇంట్లో పెద్దలు ఉంటున్న సందర్భాలే తక్కువని అనుకుంటే, సామాజిక మాధ్యమాల మోజులోపడిపోయి వారితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడకపోవడం దారుణం. దేశంలోని 23 నగరాల్లో జరిగిన ఓ అధ్యయనంలో ఇందుకు సంబంధించి స్పష్టమైన వివరాలు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం 73 శాతం మంది పెద్దలు, తమ పిల్లలు ఫోన్లలో బిజీగా ఉంటున్నారని వాపోతున్నారు. 60 శాతం మంది… ఆ ఫోన్ల వల్ల తమతో గడిపే సమయంలో తేడా వచ్చిందని బాధపడ్డారు. ఆ మార్పునకు కారణం సామాజిక మాధ్యమాలే అంటూ 78 శాతం ఆరోపించారు. ఈ వివరాలన్నీ సేకరించిన హెల్పేజ్ ఇండియా సంస్థ, ఆన్లైన్ వ్యసనాన్ని తగ్గించుకుని ఇంట్లో మనుషులను పట్టించుకోవాలని పిలుపునిస్తూ #Disconnect2Connect పేరుతో ప్రచారం మొదలుపెట్టింది కూడా!
దేశంలో వృద్ధాశ్రమాలకు కొదవ లేదు. భారం అనుకుని కొన్ని సందర్భాల్లో, మెరుగైన పర్యవేక్షణ లభిస్తుంది కదా అని మరికొన్ని సార్లు… వృద్ధులను ఇక్కడ చేరుస్తుంటారు. మరికొన్ని సార్లు వృద్ధులే స్వచ్ఛందంగా వీటిలో చేరుతుంటారు. కానీ వారి ఆహారం, ఆరోగ్యం, కదలికలు, కాలక్షేపం అన్నింటి విషయంలో జాగ్రత్తగా మెలగాల్సిన ఈ కేంద్రాల్లో నైపుణ్యం కొరవడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నడిచే చాలా ఆశ్రమాలు తగినంత గాలి, వెలుతురు కూడా లేకుండా జైళ్లను తలపిస్తూ ఉంటున్నాయి. అక్కడి సిబ్బందిలో శిక్షణ, సహనం కనిపించవు. ఉపాధి, విద్యలాంటి అవసరాల విషయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చే దిగ్గజ సంస్థలు… వృద్ధుల సమస్యల మీద కూడా దృష్టిపెడితే మెరుగైన వసతులు కల్పించవచ్చు. వృద్ధాశ్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు సైతం.. కఠినమైన నిబంధనలు పాటిస్తూ, చట్టాలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాల్సిన అవసరమూ ఉంది.
వృద్ధాప్యంలో ఒంటరితనం తీరని వేదన. కుటుంబసభ్యులు ఎవరి పనిలో వారు ఉండటం, స్నేహితులు దూరం కావడం, చురుగ్గా తిరగలేని అనారోగ్యం, వినికిడి లోపం, మతిమరుపు లాంటి సమస్యలతో ఒంటరితనం మరింత భారమవుతుంది. ఏజ్‌వెల్ సంస్థ చేసిన పరిశీలనలో.. మన దేశంలో సగానికి సగం మంది వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. వారిలో అయిదో వంతు అత్యవసర చికిత్స అవసరమయ్యే స్థితిలో ఉన్నారు. ఏదో ఒక వ్యాపకంలో మునిగే ప్రయత్నం చేయడం, కొత్త మిత్రులను పరిచయం చేసుకోవడం, స్వచ్ఛంద సేవలో పాల్గొనే చొరవ… తదితర మార్గాల్లో ఒంటరితనం నుంచి దూరమయ్యే ప్రయత్నం చేయవచ్చు. Maya Care, The Family Member లాంటి సంస్థల కార్యకర్తలు వృద్ధులకు చేదోడువాదోడుగా ఉంటూ వాళ్లు చెప్పే కబుర్లు వింటూ… ఒంటరితనంలో సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పు డిప్పుడే ఈ తరహా సేవలు మన దేశంలో పెరుగుతున్నాయి.
“Flyrobe | ఫ్యాషన్ డబ్బున్నోళ్ల సొత్తు కాదు.. ఇదే ఈమె సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక ఉన్న నినాదం”