Mothers Recipe | ‘ఏ ఉత్పత్తి అయినా అమ్మ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకానీ, అమ్మకు ప్రత్యామ్నాయం కానే కాదు. అసలు అమ్మ చేతి రుచికి తిరుగే లేదు’ అంటారు మదర్స్ రెసిపీ వ్యవస్థాపకురాలు సంజన దేశాయ్. ఆమె పుణెలోని కిరాణా దుకాణాలతో మొదలుపెట్టి.. పదిహేనేండ్ల ప్రస్థానంలో తన కంపెనీని అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లారు. పచ్చళ్ల విభాగంలో దేశీయంగా అగ్రస్థానం సాధించారు. పొడులు, అప్పడాలు, మసాలాలు, బిస్కెట్లు.. మదర్స్ రెసిపీ తయారు చేయని వంటింటి దినుసులంటూ లేవు.
స్నాక్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ‘మేము ఏం తింటామో, మా ఉత్పత్తుల్లోనూ అవే వాడతాం. రసాయనాలు జోడించం. రంగులు వాడం. అత్యాధునిక సాంకేతికత ఉపయోగిస్తాం కాబట్టి, చేతులతో తాకాల్సిన అవసరమే రాదు’ అంటూ తయారీ విధానాన్ని వివరిస్తారు సంజన. దాదాపుగా మూతపడే స్థితిలో ఉన్న ఓ కంపెనీ నుంచి ఆమె పచ్చళ్ల వ్యాపారాన్ని కొనుగోలు చేశారు. తొలిరోజుల్లో తానే మండీకి వెళ్లి కూరగాయలు, మసాలా దినుసులు ఎంచుకునేవారు. ఆ కృషి ఫలించింది. రూ.1,442 కోట్ల పచ్చళ్ల మార్కెట్లో 24.1శాతం వాటాను సొంతం చేసుకుంది మదర్స్ రెసిపీ.