Allu Sneha Reddy | టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్-స్నేహా రెడ్డి దంపతులు నేడు (మార్చి 6) తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో ఏర్పడిన అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ హృదయాన్ని హత్తుకునే సందేశం రాశారు.
15 ఏళ్ల ప్రయాణం… మన ప్రేమతో నిండిన ప్రపంచం, ఇద్దరు పిల్లలు, స్వీట్ పప్పీస్… ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలు అంటూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలోని ప్రతి అధ్యాయంలో తనకు తోడుగా నిలిచినందుకు అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ కూడా తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. నువ్వు లేకపోతే ఈ 15 ఏళ్లు ఇలా ఉండేవి కావు అంటూ ఆమెకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణంలో స్నేహ రెడ్డి ఎప్పుడూ అండగా నిలిచారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో లవర్ బాయ్‌గా కనిపించే అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ ఒక అందమైన ప్రేమకథను కొనసాగించారు. అమెరికాలో చదువు పూర్తిచేసుకుని వచ్చిన స్నేహ రెడ్డిని ఒక స్నేహితుడి పెళ్లిలో చూసిన బన్నీ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారని చెబుతారు
మొదట్లో కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా, ఇద్దరి పట్టుదలతో చివరికి పెద్దలు అంగీకరించారు. దీంతో 2011 మార్చి 6న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014లో కుమారుడు అయాన్, 2016లో కుమార్తె అర్హ జన్మించారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడం అల్లు అర్జున్ ప్రత్యేకతగా అభిమానులు చెబుతుంటారు. షూటింగ్స్ నుంచి విరామం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం లేదా పిల్లలతో సరదాగా గడపడం ఆయనకు అలవాటు. ఇలా అన్యోన్య దాంపత్యంతో ముందుకు సాగుతున్న ఈ జంటను టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్‌గా అభిమానులు ప్రశంసిస్తుంటారు. వారి బంధం ఇలాగే కలకాలం కొనసాగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.