PoK Unrest : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee) ముజఫరాబాద్ (Muzafarabad) కు చేపట్టిన లాంగ్ మార్చ్ (Long March) కు ముందు సోమవారం పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు నిరసనకారులు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
రావల్కోట్, చాందినీ చౌక్, ఖస్సాయి గలి, బల్దియా అడ్డా ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినప్పటికీ నిరసనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావల్కోట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రహదారులను మూసేసి, భారీగా బలగాలను మోహరించి, లాంగ్ మార్చ్‌ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుంది.
స్థానిక చట్టసభలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (JAAC) డిమాండ్ చేస్తున్నది. JAAC డిమాండ్లను అక్కడి పాలకులు పెడచెవిన పెట్టడంతో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.