– రాష్ట్ర బడ్జెట్లో యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలి
– ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా డిమాండ్
జూలూరుపాడు, మార్చి 06 : నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నిరుద్యోగం వల్ల దేశంలో యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని, దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో బడా కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్ల దేశ సంపదను దోచిపెట్టిందన్నారు. గతంలో కార్పొరేట్ సంస్థలు 37 శాతం పన్ను చెల్లిస్తే, బీజేపీ ప్రభుత్వం దానిని 16 శాతానికి తగ్గించిందని దీనివల్ల దేశ ఖజానాకు రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడం, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు పోవడంతో నిరుద్యోగం ‘కుంభమేళా’లా పెరిగిపోతోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ ఇప్పటికీ సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయమన్నారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. కోర్టు స్టేలు, రాజకీయ కారణాలతో నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయని, దీనివల్ల యువత తమ భవిష్యత్‌పై భరోసా కోల్పోతున్నట్లు తెలిపారు. కావునా రాబోయే రాష్ట్ర వార్షిక బడ్జెట్లో యువత కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ పలు సూచనలు చేశారు. అన్ని ఖాళీల భర్తీకి స్పష్టమైన కాల పట్టికను విడుదల చేయాలన్నారు. యువజన రంగానికి ఈసారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని, సామాజిక భద్రత స్వయం ఉపాధి పథకాలు, ఆరోగ్య బీమా, విద్యా సహాయం ద్వారా యువతకు భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశం తీవ్ర సామాజిక అసమతుల్యతను, సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చాంద్ పాషా హెచ్చరించారు.