హే.. రాంజీ
కూలీల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవీకా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రాంజీ) (పూర్వ ఉపాధి హామీ పథకం) ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
- సమస్యల పరిష్కారం కోసం వీబీజీ రాంజీ ఉద్యోగుల పోరుబాట
- కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం.. ‘పెన్‌డౌన్’తో ఉద్యమం
- హామీల అమలు, వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై అసహనం
- వారం రోజులుగా ‘ఉపాధి హామీ’ సిబ్బంది పోరాటం ముమ్మరం
- ప్రధాన డిమాండ్ల సాధనకు ‘ప్రత్యేక కార్యాచరణ’తో ముందుకు..
- ఆగస్టు 15లోగా మాట నిలుపుకోవాలంటూ సర్కారుకు డెడ్‌లైన్
అశ్వారావుపేట, ఆగస్టు 3 : కూలీల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవీకా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రాంజీ) (పూర్వ ఉపాధి హామీ పథకం) ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు పెండింగ్ వేతనాల చెల్లింపులోనూ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. నెలలతరబడి నిరీక్షించిన ఉద్యోగులు.. అసహనం, ఆగ్రహంతో ప్రధాన డిమాండ్ల సాధనకు కార్యాచరణ చేపట్టారు. ఈ నెల 15 నాటికి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు కూడా ప్రకటించారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 182 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలు చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరును వీబీజీ రాంజీగా మార్చిన విషయం విదితమే. అయితే, ఈ పథకం ప్రారంభం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన చాలామంది ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారు. ‘ఒకే పోస్టు – ఒకే వేతనం’తో కొనసాగుతున్నారు.
దాదాపు 20 ఏళ్లు గడిచినా వారి వేతనంలోనూ, వారి హోదాలోనూ మార్పులేదు. పైగా, సమస్యలు కూడా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. పే స్కేల్ అమలు, సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాలు విడుదలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముందస్తు కార్యాచరణతో ఈ ఏడాది జూలై 27 నుంచి సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనలను దశల వారీగా ఉధృతం చేస్తున్నారు.
గ్రామ ప్రగతిలో కీలకంగా..
కూలీల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించడంతోపాటు గ్రామ ప్రగతిలో వీబీజీ రాంజీ ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా హరితహారం, పల్లె ప్రగతి, చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ అనుబంధ పనులు, రోడ్ల నిర్మాణాలు, పండ్ల తోటల అభివృద్ధి, ఇంకుడు గుంతల నిర్మాణం, వైకుంఠాధామాలు, క్రీడా ప్రాంగణాలు వంటి అనేక ప్రభుత్వ అభివృద్ధి పనులను వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయినా ఉద్యోగ భద్రతలేక అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 182 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఈ నెల 15 నాటికి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాకెందుకు అమలు చేయరు?
ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తదితరులు గతంలో పలుమార్లు హామీ ఇచ్చారు. అయినా అవి ఇంతవరకూ అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై ఉపాధి హామీ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే శాఖ పరిధిలో పనిచేస్తున్న సెర్ప్ (ఐకేపీ) ఉద్యోగులకు పే స్కేల్ అమలుచేస్తున్న ప్రభుత్వం.. తమకెందుకు అమలు చేయడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తమకు హామీ ఇచ్చారని, తమను కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు..
- ఎఫ్‌టీఈ 2026 ఆగస్టు 15 నాటికి పే స్కేల్‌ను అమలు చేసి సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలి.
- రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలి.
- పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి.
- ఎస్ఆర్డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన అన్ని నిర్ణయాలను వెంటనే అమలు చేయాలి.
- సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేయాలి.
- సీఆర్డీ కార్యాలయంలోని ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల మధ్య సమన్వయ లోపాలను నివారించాలి.
- వేతనాల విడుదలలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి.
- క్యాడర్ స్ట్రెంగ్త్ ఖరారు, ప్రమోషన్లు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ అమలు చేయాలి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

