Lulu Mall Owner Yusuff Ali | తాత ముత్తాల వారసత్వం లేదు.. అయినా కష్టపడి దుబాయ్ రిటైల్‌కు సుల్తాన్‌గా మారాడు.. ఇదీ యూసుఫ్ అలీ ఇన్స్పిరేషన్ స్టోరీ!
Lulu Mall Owner Yusuff Ali | ఆయనేం హార్వర్డ్‌లో చదువుకోలేదు. కనీసం పట్టభద్రుడు కూడా కాదు. తాతముత్తాతల వారసత్వం అసలే లేదు. దుబాయ్‌లో ఒక్క పెట్రోలు బావి కూడా లేదు. అయితేనేం.. ఆ ఇసుక నేలల్లోనే అవకాశాల్ని తవ్వి తీశారు.
Lulu Mall Owner Yusuff Ali | ఆయనేం హార్వర్డ్‌లో చదువుకోలేదు. కనీసం పట్టభద్రుడు కూడా కాదు. తాతముత్తాతల వారసత్వం అసలే లేదు. దుబాయ్‌లో ఒక్క పెట్రోలు బావి కూడా లేదు. అయితేనేం.. ఆ ఇసుక నేలల్లోనే అవకాశాల్ని తవ్వి తీశారు. సూపర్ మార్కెట్‌తో మొదలైన లులు గ్రూప్.. ఎల్లలు దాటి విస్తరించింది. హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టింది. లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ జీవితం వేయి వ్యక్తిత్వ వికాస గ్రంథాలకు సమానం.
కేరళకు చెందిన యూసుఫ్ అలీ.. 37 దేశాల్లో 50వేల మందికి ఉపాధినిస్తున్న పెద్ద బిజినెస్‌మాన్. దుబాయ్ రిటైల్ రారాజు. తన దగ్గర భారతీయులనే ఉద్యోగంలో పెట్టుకోవడం అతని ప్రత్యేకత. ‘మనవాళ్లకు మనమే అవకాశం ఇవ్వాలి’ అనేది తన విధానం. యూసుఫ్ ఆస్తుల విలువ రూ.42,795 కోట్ల పైమాటే. త్రిస్సూర్ సమీపంలోని నట్టిక సొంతూరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. యూసుఫ్ తండ్రి అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణం నడిపేవాడు. దీంతో, యూసుఫ్ అలీ తన పెదనాన్న వద్ద పెరిగాడు. లాయర్ కావాలన్నది ఆ పసివాడి కల. కానీ టీనేజ్లోనే చిల్లర వ్యాపారంలోకి రాక తప్పలేదు. అహ్మదాబాద్ వెళ్లకా తప్పలేదు. తండ్రికి సాయం చేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. పార్ట్‌టైమ్‌గా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా చేశాడు. సరిగ్గా అదే సమయంలో కేరళ నుంచి అరబ్ దేశాలకు వలస వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఆ అవకాశాన్ని అలీ వదులుకోలేదు. తల్లి తరఫు బంధువు దుబాయ్‌లో రిటైల్ స్టోర్ నడుపుతున్నాడని ఎవరో చెప్పారు. ఆ బాదరాయణ బంధుత్వాన్ని పట్టుకుని దుబాయ్ విమానం ఎక్కాడు. అప్పటికి అలీ వయసు సరిగ్గా పద్దెనిమిది.
మార్కెట్‌పై గురి
దూరపు చుట్టానికి సాయంగా ఉంటూనే దుబాయ్ మార్కెట్‌ను లోతుగా అధ్యయనం చేశాడు. ఏ వస్తువులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి, ఎలాంటి సరుకులకు డిమాండ్ ఉన్నది అనేది గమనించేవాడు. విదేశాలకు వెళ్లడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేవాడు కాదు. అలా ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్ చుట్టొచ్చాడు. ఆ దేశాల్లో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్ల ట్రెండ్‌ను గమనించాడు. ఆర్థికంగా కుదుటపడిన తర్వాత అబుదాబీలో సూపర్ మార్కెట్ తెరిచాడు. అప్పటికి అలీ వయసు ముప్పై నాలుగు. ఆ నిర్ణయం.. అలీ జీవితాన్నే కాదు, రిటైల్ రంగాన్నే మార్చేసింది. అంతలోనే గల్ఫ్ యుద్ధం ముంచుకొచ్చింది. చాలామంది కేరళీయులు సొంతదేశానికి తిరిగి వెళ్లసాగారు. యుద్ధ వాతావరణాన్ని చూసి కూడా అలీ తన ఆలోచనను మార్చుకోలేదు. దుబాయ్‌లోని అన్ని ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లు తెరవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని దుబాయ్ సుల్తాన్‌తో పంచుకున్నాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెట్టుబడి పెట్టి సూపర్ మార్కెట్లు తెరవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఆలోచించు’ అని సలహా ఇచ్చారాయన. ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజలకు నిత్యావసర సరుకులు అవసరం. పైగా నా కంటే సామాన్య ప్రజలకే సూపర్ మార్కెట్ల వల్ల ఉపయోగం ఉంది’ అని ఒప్పించాడు అలీ. చూస్తుండగానే దుబాయ్ మొత్తం యూసుఫ్ అలీ సూపర్ మార్కెట్లు వెలిశాయి. ఆ తర్వాత తయారీ, ఎగుమతులు, దిగుమతులు, ఆతిథ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, కమోడిటీ ట్రేడింగ్, శీతల పానీయాలు, కన్వెన్షన్ సెంటర్లు, లగ్జరీ హోటల్స్, ట్రావెల్ అండ్ టూరిజం.. ఇలా ఎన్నో విభాగాల మీద దృష్టి పెట్టాడు. అతి కొద్దిరోజుల్లోనే ‘లులు గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ ప్రపంచ రిటైల్ రంగంలో నెంబర్ వన్‌గా నిలిచింది. ఎన్నో కంపెనీల్లో వాటాలు కొన్నాడు అలీ. దుబాయ్‌కి వలస వచ్చే భారతీయులకు ఉపాధి మార్గం చూపడం తన బాధ్యతగా భావించాడు. కాబట్టే, ఆయన స్టోర్లలో భారతీయ సిబ్బందే ఎక్కువగా కనిపిస్తారు. ఇతర దేశాల్లో భారతీయులకు అత్యధికంగా ఉపాధి కల్పించిన సంస్థగా లులు గ్రూప్ రికార్డు కెక్కింది. ఈ సేవలకు ప్రవాస భారతీయ సమ్మాన్, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆయన.
అత్యంత వేగంగా
విస్తరి స్తున్న హైదరాబాద్ నగరాన్ని తన వ్యాపార స్కందావారంగా మార్చుకుంటున్నారు అలీ.త్వరలోనే ఇక్కడ లులు మాల్, లులు హైపర్ మార్కెట్ ప్రారంభం కానున్నాయి. దాదాపు ఐదొందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘తెలంగాణకు వచ్చిన ప్రతిసారి నా మాతృభూమి కేరళలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది’ అంటారు అలీ.
Read More :
“Mothers Recipe | పచ్చళ్లు అమ్మి ఫేమస్ అయ్యింది ! అమ్మ చేతి రుచికి ఎక్కడైనా తిరుగు ఉండదుగా!!”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

