Inspiration | బిడ్డ కోసం మొదలుపెట్టిన కుట్టుపనిలో.. ఒక బ్రాండ్ స్థాయికి ఎదిగారు. సినిమాలు చూస్తూ, పత్రికలు తిరగేస్తూ.. వినూత్నమైన దుస్తులు కుట్టారు. ఇప్పుడు సినిమా పాటలకు, టీవీ తారలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. పదో తరగతితో చదువు ఆగిపోయినా.. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్నారు రజితా రాజ్ రావుల.
చిన్నప్పుడే, పదో తరగతిలో ఉండగానే నా పెండ్లయ్యింది. వెంటనే తల్లినయ్యాను. నా బిడ్డ నాకు బొమ్మలా తోచేది. ఆటబొమ్మలకు దుస్తులు తొడిగి అందంగా ముస్తాబు చేసినట్టు, కూతుర్ని వింతవింత దుస్తులతో అలంకరించడమే నాకు తెలిసిన ఆటా పాటా. మా అత్తగారి పాత చీరలు కత్తిరించి, చేతితోనే రకరకాల దుస్తులు కుట్టేదాన్ని. మా ఆయన కూడా నాలాగే మురిసిపోయేవాడు. మా అమ్మాయి పెద్దయ్యేకొద్దీ.. లంగా, జాకెట్, గౌన్, ఫ్రాక్స్, లంగా-ఓణీ కుట్టడం మొదలు పెట్టాను. తన కోసమే కుట్టుపని కూడా నేర్చుకున్నాను. పెయింటింగ్స్ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. దీంతో పాప దుస్తులపై బొమ్మలేసి సరదా తీర్చుకున్నాను.
ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌తోపాటు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మొదలుపెట్టాను. మా ఆయన రైల్వేలో సెక్షన్ ఇంజినీర్‌గా చేసేవాడు. అప్పుడు మేము కాజీ పేటలో ఉండేవాళ్లం. తనకు సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా ప్రమోషన్ వచ్చింది. సికింద్రాబాద్‌కు బదిలీ చేయడంతో ఇక్కడికి (మల్కాజిగిరి) వచ్చాం. అప్పటికి మా పాప అయిదో తరగతి చదువుతున్నది. తన స్కూల్ డ్రెస్‌లు, ఫ్యాన్సీ డ్రెస్‌లు నేనే కుట్టేదాన్ని. చూసినవాళ్లంతా బాగున్నాయి అనుకునేవారు. తమ పిల్లలకూ కుట్టిపెట్టమని అడిగేవాళ్లు. హైదరాబాద్‌లో ఇంటి ఖర్చులు ఎక్కువ. పాకెట్ మనీ వస్తుంది. కాలక్షేపం కూడా. దీంతో కుట్టడం మొదలుపెట్టాను.
వివిధ పత్రికల్లో కొత్తకొత్త దుస్తులు కనిపించేవి. సినిమా పాటల్లో హీరోయిన్లు వైవిధ్యమైన దుస్తులు ధరించేవారు. అవే నా ఫ్యాషన్ పాఠాలు. అచ్చంగా అలాంటి మెటీరియల్‌ను మార్కెట్లో కొని, మక్కికి మక్కి అదే డిజైన్‌లో డ్రెస్ కుట్టేదాన్ని. నేను కుట్టిన దుస్తులను ఫంక్షన్లు, పండుగలకు ధరించేవారు ఇరుగూపొరుగూ. అలా ఒకరి నుంచి మరొకరు తెలుసుకుని.. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. మళ్లీ మళ్లీ కుట్టించుకునేవారు. దీంతో నాకు చేతినిండా పని దొరికింది. ఆదాయం బాగానే ఉండేది. కానీ, వచ్చిన ఆర్డర్లన్నీ కుట్టే తీరిక ఉండేది కాదు. అదే సమయంలో ‘అక్కా మాకూ నేర్పించవా ప్లీజ్?’ అని అమ్మాయిలు వచ్చేవారు. కాదనలేక, టైలరింగ్ చేస్తూనే టైలర్ ట్రైనర్‌గా మారాను. పిల్లల్ని స్కూల్‌కి పంపాక ఇంటి దగ్గరే టైలరింగ్, ఎంబ్రాయిడరీ క్లాసులు చెప్పాను. ఇరవై సంవత్సరాల నుంచీ శిక్షణ ఇస్తూనే ఉన్నాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్లలో కొంతమంది ఇంట్లోనే తమకు కావాల్సినవి కుట్టుకుంటున్నారు. కొంతమంది కుట్టుపనితో తమ కాళ్లపై తాము నిలబడ్డారు. నాలుగు రాళ్లు సంపాదించుకుందామని మొదలుపెట్టిన వ్యాపకం వందలమందికి జీవనాధారం అయ్యింది. ప్రపంచం మారుతున్నది. మార్కెట్ పెరుగుతున్నది. అవసరాలు అధికం అవుతున్నాయి. కాలానికి అనుగుణంగా.. నలుగురు పనివాళ్లను పెట్టుకుని డిజైనర్ డ్రెస్‌లు తయారు చేయాలని నిర్ణయించుకున్నా.
పది లక్షల రూపాయలు రుణం తీసుకుని అయిదేండ్ల్ల క్రితం వర్క్‌షాప్ ప్రారంభించాను. మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ, జర్దోసి, కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ల పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలతో ‘చోర్ప్స్’ అనే బ్రాండ్ సృష్టించాను. డిజైనర్ వేర్ తీసుకువచ్చాను. మొదలుపెట్టిన కొత్తలో బిజినెస్ బాగుండేది. అంతలోనే కరోనా వచ్చింది. వ్యాపారం ఆగిపోయింది. వేలవేల అద్దెలు కట్టాల్సి వచ్చింది. దీంతో బాగా నష్టపోయాను. లాక్డౌన్ తర్వాత మళ్లీ పనులు ప్రారంభించాను. అమ్మకాలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం, పద్నాలుగు మంది పని చేస్తున్నారు.
ఏ సినిమా పాటలు చూసి నాలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ పోయానో.. అవే సినిమాల్లో ఇప్పుడు నా డ్రెస్‌లు కనిపిస్తున్నాయి. ‘సమ్‌వన్ బిహైండ్’ సినిమాలో పాట కోసం మూడు దుస్తులు ఇచ్చాను. టీవీ సీరియల్స్, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‌లో.. యాంకర్లకు డ్రెస్‌లు డిజైన్ చేసి ఇస్తున్నాను. ‘జీవన జ్యోతి’, ‘జానకి కలగనలేదు’ సీరియల్స్‌కు కాస్ట్యూమ్స్ ఇచ్చాను. ఆ పరిచయాలతో, సొంత అవసరాలకూ సీరియల్ నటీమణులు నా దగ్గరికి వస్తున్నారు. ఆ పరిచయాలకు తోడు వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, గూగుల్‌లో డ్రెస్‌లు ప్రమోట్ చేస్తున్నాను. ఫ్యామిలీ కాంబో, మదర్ అండ్ చైల్డ్ కాంబో, హల్దీ, సంగీత్, బ్రైడల్, ఫొటోషూట్‌కి బాగా డిమాండ్ ఉంది. ఈవెంట్‌కు తగ్గట్టుగా దుస్తులు తీర్చిదిద్ది ఇస్తున్నాను.
కాలాన్ని బట్టి కొత్త కొత్త ఫ్యాషన్లు పరిచయం అవుతూ ఉంటాయి. వాటిని ఫాలో అయితేనే మన పేరు నిలబడుతుంది. ఇదొక్కటే నా విజయ రహస్యం. ఇరుగుపొరుగుతో మొదలైన అమ్మకాలు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్ దాకా విస్తరించాయి. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని దేశ విదేశాల్లో ఉన్నవాళ్లకు కొరియర్ చేస్తున్నా. నా కస్టమర్లే నా ప్రచారకర్తలుగా మార్కెట్ పెంచారు. గుర్తు చేసుకుంటే ఈ గెలుపు ఎంత ఆనందంగా ఉందో!
-నాగవర్ధన్ రాయల
-శ్రీనివాస్ గడసంతల