Nikhil Kamath | గురు, త్రీ ఇడియట్స్, సూపర్ థర్టీ.. ఇలా ఆంత్రప్రెన్యూర్‌షిప్ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. త్వరలో మరో కుబేరుడి బంగారు బాతుగుడ్డు కథా వెండితెర మీద కాసుల వర్షం కురిపించబోతున్నది. ఓ మధ్యతరగతి యువకుడు.. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుని.. స్టార్ ఇన్వెస్టర్‌గా, దలాల్ స్ట్రీట్ ( Dalal Street ) రాజాగా ఎదిగిన తీరు ఇది. ‘జెరోదా స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ( Zeroda )’ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ గెలుపు ప్రయాణాన్ని త్వరలోనే సినిమాగా చూడండి!
సక్సెస్ స్టోరీలకు వెండితెర మీద మినిమమ్ గ్యారెంటీ! ఇప్పటికే చాలా గెలుపు కథలు సినిమాలుగా వచ్చాయి. కలెక్షన్లు కురిపించాయి. తాజాగా ఓ స్టార్ బ్రోకర్ కథను తెరకెక్కిస్తున్నారు.. నిర్మాతలు రాజ్‌కుమార్ హిరాని, నీరజ్ పాండే, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. నిఖిల్ కామత్ గెలుపు కథ వాళ్లను బాగా ఆకర్షించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, మధ్యలోనే బడి మానేసిన నిఖిల్.. ముప్పై అయిదేండ్ల వయసులోనే ఏడు తరాలకు సరిపోయేంత సంపదను సాధించాడు.
కర్ణాటకలోని శిమోగ నిఖిల్ స్వస్థలం. బెంగళూరులో పెరిగాడు. నాన్న రఘురామ్ కామత్ బ్యాంక్ ఉద్యోగి. తల్లి రేవతి పర్యావరణవేత్త. ఓ తోబుట్టువూ ఉన్నాడు. కొడుకులిద్దరినీ చదివించి, ప్రయోజకుల్ని చేయాలని కన్నవారు కలగనేవారు. కానీ నిఖిల్ ఆ కలల్ని కల్లలు చేశాడు. 14వ ఏటనే బడి మానేశాడు. సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేశాడు. పదిహేడేండ్లు వచ్చేసరికి.. కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాడు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ డ్యూటీ ఉండేది. ఆ తర్వాత లాండ్రీ షాపులో పార్ట్‌టైమ్ జాబ్ చేసేవాడు. కొంతకాలానికి ఓ మెడికల్ షాపులో ఎక్కువ జీతానికి కుదిరాడు. రెండు ఉద్యోగాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ ఎనిమిది వేల రూపాయలు వెనకేశాడు. ఇంకొంత, మరింత సంపాదించాలనే కోరికే ఆ యువకుడిని స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయించింది. ఉద్యోగంలో కూడబెట్టిన ఎనిమిది వేలనూ పెట్టుబడిగా పెట్టాడు. స్టాక్ నేలచూపులు చూడకముందే అమ్మడం, మార్కెట్ పతనపు అంచుల్లో ఉన్నప్పుడు కొనడం తన వ్యూహం. విశ్వాసం పెరిగాక.. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు రెండూ మానేశాడు. దలాల్ స్ట్రీట్పైనే ఫోకస్ చేశాడు. ఆ మెరుపులు కన్న తండ్రినీ ఆకర్షించాయి. తన రిటైర్మెంట్ సొమ్మునంతా కొడుకు చేతిలో పెట్టాడు. అతి తక్కువ కాలంలోనే లక్షలు కోట్లుగా మారాయి. స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ ‘జెరోదా స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్’ స్థాపించాడు. స్టాక్ బ్రోకరేజీలో తలపండినవారిని కూడా వెనక్కి నెట్టేశాడు. టెక్నాలజీ సాయంతో బ్రోకరేజీని సులభతరం చేయడమే కాకుండా ఊహించని ఫీచర్లతో మార్కెట్‌ను అంచనా వేసే సాంకేతికతను ఇన్వెస్టర్ల చేతిలో పెట్టాడు. అందులోనూ జెరోదా తీసుకొచ్చిన ‘కైట్’ యాప్ ఒక సంచలనం. ఆగస్టులో నిఖిల్‌కు ముప్పై ఆరేండ్లు నిండుతాయి. అన్నట్టు, తనది ప్రేమ వివాహం ఇటలీలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న అమందా పురవంకరతో తన వివాహమైంది.
‘ప్రారంభంలో నేను సరదాగానే స్టాక్ మార్కెట్లో కాలుపెట్టాను. షేర్స్ కొంటే ఇంత లాభం ఉంటుందని నాకు తెలియదు. ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వచ్చింది. సంపాదనలో ఫార్ములా అంటూ ఏమీ లేదు. ధైర్యమే ఆయుధం. క్రమంగా ఆసక్తిని అభిరుచిగా మలుచుకున్నాను’ అని చెబుతాడు నిఖిల్. ఎనిమిది వేల పెట్టుబడితో మొదలై వేల కోట్ల రూపాయలకు చేరుకుంది నిఖిల్ ఆర్థిక ప్రయాణం. తన జీవితంలో ఒకట్రెండు వివాదాలూ ఉన్నాయి. కృత్రిమమేధతో విశ్వనాథన్ ఆనంద్‌ను చెస్‌లో ఓడించి.. ‘అనైతిక’ విజయం సాధించాడనే చెడ్డపేరు మూటగట్టుకున్నాడు.
☞ డబ్బు వెంటపడకండి. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మార్గం ఆలోచించండి.
☞ పొద్దున్నే లేవడంతోనే సగం విజయం మీ సొంతం అయినట్టు. ఆంత్రప్రెన్యూర్స్‌కు ఉండాల్సిన తొలి లక్షణం ఇది.
☞ ఇన్వెస్ట్మెంట్ మీ ఉపాధి కావచ్చు, కాకపోవచ్చు. కానీ దీన్నే అలవాటుగా మాత్రం చేసుకోండి.
☞ అప్పు చేసి మదుపు చేయొద్దు.
☞ సంతోషం కోసం ఆస్తులను కాదు, అనుభూతులను కొనండి.
☞ ఆర్థిక విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం.
ఇప్పుడిక షేర్ మార్కెట్ నుంచి మీడియా వైపు దృష్టి మళ్లించాడు. ఓటీటీలో అవకాశాల కోసం చూస్తున్నాడు. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని గుర్తించిన నిఖిల్ వెండితెర మీదకూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే తను అటుగా అడుగులు వేయకముందే తన జీవితం వెండితెరపై రాబోతున్నది. ‘నువ్వు ఏదో ఓ రంగానికి పరిమితమైతే నూతిలోని కప్పలా మిగిలిపోతావు. ఒక వ్యాపారం మీద పట్టు సాధించగానే మరోవైపు దృష్టిసారించు’ అని సలహా ఇస్తాడు నిఖిల్. ఇంకేముంది.. ‘శుభం’!
పేడకుప్ప ఉన్నచోటే ఉంటే మురిగిపోతుంది. దుర్వాసన వస్తుంది. అదే, ఏ పంటలకో ఎరువుగా వేస్తే దిగుబడి పెరుగుతుంది. డబ్బుకు కూడా ఈ పోలిక వర్తిస్తుంది.
-నిఖిల్ కామత్, జెరోదా స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్