Jay Shetty | ‘ఎయిట్ రూల్స్ ఆఫ్ లవ్’లో ప్రపంచ యువతకు ప్రేమ రహస్యాలు చెప్పాడు జై శెట్టి! అలా అని, అతనేం ముదురు ప్రేమికుడు కాదు. దాదాపుగా యవ్వనమంతా సన్యాసంలోనే గడిచిపోయింది. సన్యాసాన్ని వదిలిపెట్టాకే అతని ప్రపంచం సువిశాలమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. యూట్యూబర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టే, ‘జై’కి జై కొట్టింది ప్రపంచం!
అప్పుడు నాకు పద్దెనిమిదేండ్లు. చాలామంది సెలెబ్రిటీలను కలిశాను. సంపన్నులతో మాట్లాడాను. ప్రపంచ సుందరీమణులతోనూ ముచ్చటించాను. వాళ్లంతా చాలా అందంగా ఉన్నారు. కానీ, ఏమంత ఆనందంగా లేరని అర్థమైంది. అదే సమయంలో ఒక సాధువును కలిశాను. ఓ సర్వసంగ పరిత్యాగితో సంభాషించడం అదే మొదటిసారి. అతను ఆనందంగా ఉన్నాడు. ఆస్తులతోనో, పేరు ప్రఖ్యాతులతోనో, విజయంతోనో వచ్చిన ఆనందం కాదది. అకారణ ఆనందం అంటే అదేనేమో.. పసిపిల్లలు నవ్వినట్టు, నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టు. అతని భావాలు నన్ను ప్రభావితం చేశాయి. దారీతెన్నూలేని నా ఆలోచనలకు ఓ ఆధారం దొరికింది.
Jay Shetty1
డిగ్రీ చేతికిరాగానే సాధువుగా జీవించాలని నిర్ణయించుకున్నాను. పైచదువుల జోలికి వెళ్లలేదు. సన్యాసుల గుంపులో చేరాను. రోజూ తెల్లవారుజామున నిద్ర లేచేవాణ్ని. వ్యాయామం, యోగా, ధ్యానం చేసేవాణ్ని. రెండే జతల దుస్తులు ఉండేవి. ఒంటిమీద ఒక జత. దండెం మీద ఒక జత. అంతకంటే ఏమీ అవసరం లేదని అనిపించేది. ఆ నిరాడంబరత జీవన నైపుణ్యాలను నేర్పింది. రోజూ ఏదో ఒకచోటుకు వెళ్లేవాళ్లం. ఎక్కడెక్కడో నిద్రపోయేవాళ్లం. మితభాషణకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. మౌనం ఆలోచనల్ని అదుపులో పెట్టడమే కాదు, ఎంతో మనోశక్తిని ఇస్తుంది. అంతలోనే నాకు పాతికేండ్లు వచ్చాయి. అప్పటికే మా కుటుంబానికి రెండు కోట్ల అప్పులున్నాయి. వాటిని తీర్చడం నా బాధ్యత అనిపించింది. దీంతో సన్యాస జీవితం నుంచి వెనక్కి వచ్చాను. బతుకుదెరువు కోసం కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టాను. నలభై కంపెనీలకు ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. ఎక్కడికి వెళ్లినా ‘ఆహా.. ఓహో..’ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కానీ, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. ‘ఈ సన్యాసి ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటాడా?’ అనే అనుమానం కావచ్చు. మొత్తానికి యాక్సెంచూర్లో ఉద్యోగం వచ్చింది. ఆ కొలువు పెద్దగా సంతృప్తినివ్వలేదు. దీంతో లండన్‌లో కొన్ని టాక్ షోలు నిర్వహించాను. ఆ వీడియోలను టీవీ ఛానెల్స్‌కు చూపించాను కూడా. ఎవరికీ నచ్చలేదు. దీంతో నేనే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనుకున్నా. వారానికో వీడియో పోస్ట్ చేయాలని ప్రణాళిక. అంతలోనే వాటిని ఏదో పత్రికవాళ్లు చూసి, తమ వెబ్సైట్లో పెట్టారు. లక్షలకొద్దీ వ్యూస్ వచ్చాయి. లౌకిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ ఇదే నా తొలి విజయం. ముందు నుంచీ నాకు ఆరోగ్య విషయాల మీద కొంత అవగాహన ఉంది. దీంతో ఆన్ పర్పస్ (On Purpose) పేరుతో పాడ్‌కాస్ట్ ప్రారంభించాను. అదిప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ హెల్త్ పాడ్‌కాస్ట్. ఆ తర్వాత ‘థింక్ లైక్ ఎ మాంక్’ పుస్తకం రాశాను. అదీ బెస్ట్ సెల్లరే. లైఫ్ కోచ్‌గా జీవితాన్ని ప్రారంభించాను. చాలామందికి గెలుపు రుచి చూపించాను.
Jay Shetty2
ఇటీవలే ‘ఎయిట్ రూల్స్ ఆఫ్ లవ్’ తీసుకొచ్చాను. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితంలోని సమస్యల పరిష్కారానికి అనువర్తింప చేసే ప్రయత్నం ఇది. భ్రమలు, అపోహలు, అత్యాశలు, అభద్రతలు, అబద్ధాలు, స్వార్థాలు.. వదులుకుంటేనే ఎదుటి మనిషిని ప్రేమించగలం. ఎదుటి మనిషిని మభ్యపెట్టడానికి ముసుగులు వేసుకోవడం మంచిది కాదు. అది ప్రేమ కాదు, భ్రమ! మనల్ని మనం ప్రేమించుకోవడం నుంచి సమాజాన్ని ప్రేమించడం వరకూ సమస్త విషయాలూ చర్చించాను.. ‘ప్రేమకు ఎనిమిది నియమాలు’ పుస్తకంలో. ఇన్నేళ్లుగా నన్ను ఆన్లైన్లో ఆదరించినవాళ్లను హృదయపూర్వకంగా హత్తుకోవాలని నా కోరిక. అందుకోసం ప్రపంచ యాత్ర మొదలుపెట్టబోతున్నాను.
‘చిన్నతనంలోనే బళ్లో ఎక్కాలు నేర్పిస్తారు. హైస్కూల్లో సూత్రాలు బోధిస్తారు. కాబట్టే లెక్కలు సులువుగా చేయగలుగుతాం. కానీ ప్రేమించడం గురించి ఎవరూ చెప్పరు. సినిమాలు చూసి, కథలు చదివి, స్నేహితుల అతిశయోక్తులు నమ్మి.. ప్రేమలో పడిపోతాం. ఓ అమ్మాయి.. అబ్బాయి మనసు గెలిచే ప్రయత్నం చేస్తాం. ఎంత అశాస్త్రీయం? కాబట్టే, నూటికి తొంభై ప్రేమలు విఫలం అవుతాయి. ఆత్మహత్యలు, హత్యలు, కుంగుబాట్లు.. జీవితాల్ని నాశనం చేస్తాయి. ఆ అనిశ్చితిని తొలగించడమే ‘ఎయిట్ రూల్స్ ఆఫ్ లవ్’ ఉద్దేశం.