Telangana | భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): అది మారుమూల పల్లె.. కొలువుల ముల్లె.. ఆ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 809 జనాభా ఉండగా.. అందులో ఎస్టీ కుటుంబాలు 190 ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో 75 మంది సర్కారు కొలువులు చేస్తున్నారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ‘రంగాపురం’ పంచాయతీపై ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్..
ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ ఊరికీ ఓ ప్రత్యేకత ఉంది. ఎన్నో గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు అబ్బలేదని మధ్యలోనే బడి మాన్పిస్తారు. ఇంట్లో వెసులుబాటు లేదనే కారణంతో కూలి పనులకు పంపిస్తారు. కానీ ఈ ఊరి గ్రామస్తుల సంగతి వేరే లెవల్. అందరికీ చదువంటే ఇష్టం. తాము చదువుకోకపోయినా తమ పిల్లలను విద్యావంతులను చేసి ప్రయోజకులను చేశారు. కొలువులు సాధించేలా ప్రోత్సహించారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది ? ప్రభుత్వ బడుల్లో చదివి యువత ప్రభుత్వ కొలువులు ఎలా సాధించారు? అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
రంగాపురం పాల్వంచ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామం. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసిన సమయంలో రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామ జనాభా 809. ఎస్టీ కుటుంబాలు 190. ఆయా కుటుంబాల్లో 75 మంది సర్కార్ కొలువులు చేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ టీచర్లు 45, కేటీపీఎస్ ఉద్యోగులు 20, వీఆర్వో ఒకరు, ఎఫ్‌బీవో ఒకరు, పోలీస్ ఒకరు, అంగన్వాడీ టీచర్ ఒకరు, అసిస్టెంట్ ఇంజినీర్లు ఇద్దరు, హెల్త్ ఉద్యోగి ఒకరు ఉన్నారు. కొలువులు సాధించడంలో వీరి కృషి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎనలేనిది. కొలువులు సాధించినవారంతా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవారే. ఐదో తరగతి వరకు గ్రామంలో చదువుకుని హైస్కూల్ చదువుకోవడానికి కిన్నెరసాని, ఉప్పుసాక, ఎంపీ బంజరలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. ఆ తర్వాత పైచదువులు చదువుకుని ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం ఒక్కింట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులూ ఉన్నారు. ఒకే ఇంట్లో కొడుకూ కోడలు. కొన్ని ఇండ్లలో కుమార్తే అల్లుడూ. అంతేనా గ్రామానికి చెందిన పలువురు యువతీ యువకులు ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ సాధించారు. మెయిన్స్ సాధిస్తే ఇక వారికి సర్కార్ ఉద్యోగాలు వచ్చినట్లే. అంటే ఈ చొప్పున కొలువులు చేసే వారి సంఖ్య సెంచరీకి చేరనున్నది.
నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. మాకు కొంత పొలం ఉంది. వరి పంట వేస్తాను. ఊర్లో అందరూ జీవనాధారం వ్యవసాయమే. మా పల్లెలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ. మా పిల్లలతో పాటు వారి పిల్లలూ మంచి చదువులు చదువుతున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నాం.
– భూక్యా బాలు, గ్రామపెద్ద
ఒక తరం కంటే మరో తరం మెరుగైన జీవితం గడపాలంటే చదువు ఒక్కదానితోనే సాధ్యం. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే జీవన ప్రమాణాలు వాటంతట అవే పెరుగుతాయి. మా అమ్మానాన్న అదే ఆలోచించారు. కష్టపడి మమ్మల్ని చదివించారు. ఇప్పుడు మా పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాను.
– భూక్యా భాస్కర్, కేటీపీఎస్ ఉద్యోగి
నేను చిన్నప్పుడు సాధా రణ విద్యార్థినే. నాన్న కేటీపీఎస్‌లో పని చేస్తారు. నేనూ మంచి కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలనేది నాన్న ఆకాంక్ష. నన్ను బాగా చదివించారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో చదివా. అటవీశాఖ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం మణుగూరు ఎఫ్‌బీవో విధులు నిర్వర్తిస్తున్నాను. మా ఊరు చాలా గొప్పది. సరస్వతీ నిలయం.
– రోజా, మణగూరు ఎఫ్‌బీవో
మా ఇంట్లో నాతో పాటు అన్నయ్య, ఆయన ఇద్దరు కొడుకులు, అల్లుడు ప్రభు త్వ ఉద్యోగులే. ఒకరిని ఆదర్శంగా తీసుకుని మరొకరు ప్రభుత్వ కొలు వులు సాధించారు. అదీ మా ఊరి గొప్పతనం. రంగాపురం అంటేనే కొలువుల ఊరు అని ఇప్పుడు పేరు వచ్చింది. మా పిల్లలనూ బాగా చదివిస్తున్నా. మా బాబు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు.
– బాలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మా ఊరి నుంచి నాతో పాటు 20 మంది పాల్వంచ కేటీపీఎస్‌లో పనిచేస్తున్నారు. కొంతమంది ప్రైవేటుగా పనిచేస్తుండగా మరికొందరి కొలువులు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు పర్మినెంట్ కావాల్సి ఉన్నది. తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మేం కూడా తర్వాతి తరాలను ప్రోత్సహిస్తున్నాం.
– మాళోత్ సురేశ్, కేటీపీఎస్ ఉద్యోగి