Rajya Sabha Elections | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. అయితే రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. నలుగురు బీసీ నాయకులు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరడం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను అధిష్ఠానం ఖరారు చేస్తుందని వెల్లడించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్ పదవుల భర్తీపై కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. మార్చిలో కొన్ని పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్‌గాంధీకి కొందరు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. డీసీసీల శిక్షణకు మంత్రులు రావొద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానం పలుకుతామన్నారు.