నారాయణపేట రూరల్ : పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు ( Snakebite) కు గురై మృతి చెందిన విషాదకర ఘటన నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్( Eklaspur ) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి ( Third Standard ) చదువుతున్న పిచ్చికుంట్ల రంజిత్ (8) తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది.
వెంటనే విద్యార్థినిని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థికి అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడు మృతి పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పొదలు తొలగించడం, విషపురుగులు, పాములు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారి మృతి ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు సేకరించి, పాఠశాలలో విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.