రాంచి: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఇతర ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలపై ఆ రాష్ట్ర విద్యార్థులు పలు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చల కోసం 11 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే మీడియా ముందు బహిరంగంగా చర్చలు జరుగాలని డిమాండ్ చేస్తున్నారు. (Jharkhand Students Protest) గత నెలలో నిర్వహించిన 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై ఆ రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడవ పక్షం సంస్థ నిర్వహించిన ఈ పరీక్షలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆ పరీక్షను రద్దు చేయాలని, సీబీఐతో విచారణ జరుపాలని, జార్ఖండ్‌లోని పరీక్షా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ‘జేపీఎస్‌పీ-జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో గత 13 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో కూడా ఐదు రోజుల క్రితం నిరాహార దీక్ష ప్రారంభించారు. గురువారం నుంచి జార్ఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో విద్యార్థులు తమ నిరసనలను మరింత తీవ్రం చేశారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనలు విజయవంతం కావడంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బుధవారం, రాంచీ సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీవో) కుమార్ రజత్ నిరసన ప్రదేశాన్ని సందర్శించారు. ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుందని విద్యార్థులకు చెప్పారు. మంత్రులు, అధికారులతో జరుగనున్న ఈ చర్చల కోసం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని వారిని కోరారు.
అయితే రహస్య చర్చలకు తాము అంగీకరించబోమని, కేవలం పాత్రికేయులు, కెమెరాల సమక్షంలోనే ప్రభుత్వం చర్చలు జరుపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎనిమిది మంది విద్యార్థులు, ఒక న్యాయవాది, ఇద్దరు సాంకేతిక నిపుణులతో కూడిన 11 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గురువారం ప్రకటించారు. ఈ జాబితాను ఎస్డీవోకు అందజేశారు. చర్చల సమయం, వేదికను జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించనున్నది.
కాగా, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) పరీక్షలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు చేస్తున్నది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) కూడా దర్యాప్తులో భాగమైంది. ఈ నేపథ్యంలో సుమారు 19 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.