హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఉచితంగా వైద్యపరీక్షలు అందించాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో 2018లో ప్రవేశపెట్టిన టీ-డయాగ్నోస్టిక్స్‌పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రీఏజెంట్స్ కొరత కారణంగా ప్రధాన టెస్టులు నిలిచిపోయినట్టు తెలుస్తున్నది.
ప్రభు త్వ దవాఖానల్లో బ్లడ్‌షుగర్ లెవల్స్ కోసం నిర్వహించే హెచ్‌బీఏ1సీ(ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్) మెగ్నీషియం టెస్ట్, సీరమ్ క్రియాటినిన్, టోటల్ ఐరన్-బైండింగ్ కెపాసిటీ(టీఐబీసీ), సీ-రీయాక్టివ్ ప్రొటీన్ (సీఆర్పీ) తదితర పరీక్షలు పూర్తిగా నిలిచిపోయినట్టు తెలిసింది. దవాఖానల్లో వైద్యపరీక్షలు నిర్వహించాలంటే రీఏజెంట్స్ తప్పనిసరి.
రీఏజెంట్స్ సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. చెల్లింపులో జాప్యం చేయడంతో ఏజెన్సీలు సరఫరా నిలిపివేసినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో మూడు నెలలకుపైగా వైద్య పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య పరీక్షలు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ టీ-డయాగ్నోస్టిక్స్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రధాన హబ్‌గా టీ-డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 32 మైక్రోబయోలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్‌ను ఏర్పాటు చేసింది. పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానలు, కమ్యూనిటీ సెంటర్లలో 1,546 చోట్ల స్పోక్స్(చిన్న కేంద్రాలు) నెలకొల్పింది. ఫలితాలు వెంటనే వచ్చే టెస్టులను స్పోక్స్‌లలో, సమయం పట్టేవి హబ్‌లలో నిర్వహించేలా చర్యలు చేపట్టింది.