అరవై ఏండ్లు పైబడిన తర్వాత చర్మం మునుపటిలా ఉండదు. చర్మంలో తేమ నిల్వ చేసుకునే శక్తి తగ్గిపోతుంది, పలుచగా మారిపోతుంది. దీంతో దురద, ఇరిటేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణంగా వేడి నీళ్లు చర్మంలోని సహజ నూనెలను వేగంగా తొలగిస్తాయి. అంతేకాదు.. స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం వల్ల చిన్నపాటి గాయాలు అవుతాయి. ఈ గాయాల నుంచి ముదిమి చర్మం సులభంగా కోలుకోలేదు. మరో సమస్య ఏంటంటే.. చాలామంది 60ప్లస్ పెద్దలు శుభ్రత పేరుతో పదే పదే స్నానం చేస్తుంటారు. దీంతో చర్మం బిగుతుగా మారిపోతుంది.
ఈ క్రమంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే, రోజు స్నానం చేయకుండా, ఒక రోజు విడిచి ఒక రోజు చేయడమే మంచిదని ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ (INSERM) పేర్కొంటున్నది. స్నానం చేయని రోజుల్లో అవసరమైన శరీర భాగాలను తడి వస్త్రంతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక స్నానానికి గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలని, పది నిమిషాలకు మించి స్నానం చేయొద్దని సూచిస్తున్నారు.
అప్పుడు కూడా చర్మాన్ని గట్టిగా రుద్దకుండా, నెమ్మదిగా స్క్రబ్ చేయాలని చెబుతున్నారు. స్నానం పూర్తై.. చర్మం తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ ఐప్లె చేయాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లయితే.. పాదాలు, వేళ్ల మధ్య తేమ అస్సలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. బాత్రూమ్లో గచ్చు జారిపోకుండా గ్రాబ్ బార్స్, రబ్బర్ మ్యాట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.