సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇండ్లను కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్ల్లూ కూల్చకుండా, ఒక్క ఇటుక కదపకుండా కేసీఆర్ మూసీ సుందరీకరణకు చర్యలు తీసుకున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం రూ.6 కోట్లతోనే నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు మూసీని సుందరీకరించి మోడల్‌గా చూపించామని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రబుత్వం మాత్రం మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టకుండా, వారి జీవనోపాధికి భంగం కలగకుండా కూడా నగరాభివృద్ధి సాధ్యమని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. అదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుందో సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.