సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నగరానికి జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు, తెలంగాణ వాటా, తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సర్కార్ ఇస్తున్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్‌గా మారాయి. సర్కార్ ఇచ్చేదాని కంటే, తెలంగాణ ప్రజల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ వాసుల నుంచి తీసుకునేది ఎక్కువ ఉందని మండిపడుతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇక్కడి ప్రజల ఇబ్బందులు, అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్‌ను కేంద్రానికి అందించి 427 రోజులు గడిచినప్పటికీ.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా నిరసనలు..
ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, స్టార్టప్తోపాటు, అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్.. మెట్రో విషయంలో ముందుకు సాగలేకపోతున్నది. కేంద్రం, రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న రెండు జాతీయ పార్టీలు.. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తూ, కీలకమైన మెట్రో విస్తరణ ఫేజ్-2ను అడ్డుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా వినూత్న రీతిలో హైదరాబాద్ నగరానికి మెట్రో ఫేజ్-2 అవశ్యకతను వివరిస్తున్నారు.
జీఎస్టీ వసూళ్లలో రారాజు..
దేశంలోని పది అత్యధిక జీఎస్టీ వసూళ్లు చేసే జాబితాలో ఏడో స్థానంలో తెలంగాణ రారాజుగా నిలుస్తోంది. 14శాతం గ్రోత్ రేట్‌తో జీఎస్టీని కేంద్రానికి హైదరాబాద్ అందజేస్తోంది. ప్రతిరోజు రూ.150 కోట్లు కేంద్రానికి ఇస్తున్నా… రూ.43వేల కోట్లు విలువ చేసే 162 కిలోమీటర్ల పొడవైన మెట్రోకు మాత్రం కేంద్రం అనుమతించడం లేదు. లక్షల కోట్ల తమ కష్టార్జితాన్ని కేంద్రానికి ధారపోస్తున్న నగరవాసులకు.. మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ముందుకురాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-2ను తక్షణమే అనుమతించాలని సోషల్ మీడియా వేదికగా నగరవాసులు పోస్టులు పెడుతున్నారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ కంటే మూడు స్థానాలు వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి మాత్రం వేల కోట్ల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదిక కేంద్రం మంజూరు చేసి, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ నగరం కూడా జీఎస్టీ వసూళ్లలో హైదరాబాద్ తర్వాతి స్థానంలోనే ఉన్నా కూడా సోషల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టుల విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉందనీ, తెలంగాణ విషయంలో ఇకనైనా అభివృద్ధిని పట్టాలెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.