కోట్ల రూపాయలు విలువ చేసే గైరాన్ భూములు మాయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో పేదలకు సంబంధించిన భూములను పెద్దలు చెరబట్టారు. కొందరు పెద్దలు ఈ భూములను తమ అనుచరుల పేరిట మార్చుకుని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి సొమ్ము చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. గైరాన్ భూములు చేతులు మారడం వెనక అధికార పార్టీకి చెందిన ఓ నేత కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. పేదల భూములను అడ్డదారిలో ఆక్రమించుకున్న రియల్ సంస్థ, ప్రస్తుతం రెవెన్యూ, పోలీసుల అండతో తమ భూముల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని 153 సర్వే నెంబరులోని భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సర్వేనెంబరు 153లో ఇండ్ల స్థలాల కోసం తమకు కేటాయించిన భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించుకుని, వెంచర్ ఏర్పాటు చేస్తుందంటూ 80 మంది పేదలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ కేవలం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలం మాత్రమే కాకుండా వెంచర్ చేస్తున్న మొత్తం భూమి గతంలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అసైన్మెంట్ చేసిన గైరాన్ భూములుగా బాధితులు చెబుతున్నారు.
153 సర్వేనెంబర్లో ఉన్నవి గైరాన్ భూములే
పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి పక్కన 153 సర్వే నెంబర్లో ఉన్న 53 ఎకరాల భూమిరెవెన్యూ రికార్డుల ప్రకారం గైరాన్ భూములు. 53 ఎకరాల గైరాన్ భూమిని ప్రభుత్వం 1980-90లలో పోతిరెడ్డిపల్లికి చెందిన ఎస్సీ,బీసీ పేదలకు పంపిణీ చేసింది. 40మంది పేదలకు 53 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం అసైన్మెంట్ పట్టా పొందిన పేదలు ఈ భూములను కేవలం సాగు చేసుకుని జీవనం సాగించాల్సి ఉంటుంది. కాలక్రమంలో పోతిరెడ్డిపల్లిలో భూముల ధరలు అమాంతం పెరిగాయి.
పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు సమీపంలోనే భూములు ఉండటం, దీంతో నివాస స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరగడం, జాతీయ రహదారి పక్కగానే ఉండటంతో 153 సర్వే నెంబర్లోని భూముల విలువ ఎకరం రూ.20 నుంచి రూ.25 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ భూములపై ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కన్ను పడింది. ఎలాగైనా అభూములను దక్కించుకోవాలని తెరవవెనుక పావులు కదిపాడు. ఇందు కు రెవెన్యూ అధికారులు రాజకీయ నేతకు సంపూర్ణంగా సహకరించారు. దీంతో భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ అడ్డదారిలో దక్కించుకున్నట్లు తెలిసింది. తద్వారా పేదల భూములు చేతులు మారి పెద్దల ఖాతాలోకి చేరాయి.
అడ్డదారిలో రియల్ సంస్థకు దఖలు
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూములపై రైతులకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. ఈ భూముల్లో కేవలం సాగుచేసుకుని జీవించాల్సి ఉంటుంది. గతంలో అప్పటి ప్రభుత్వాలు 1954కు పూర్వం ఎస్సీ, ఎస్టీలకు అసైన్మెంట్ చేసిన భూములకు కాలక్రమంలో ఎన్ఓసీలు జారీ చేసి, రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఇది తెలుసుకున్న అధికార పార్టీ రాజకీయనేత ఒకరు పోతిరెడ్డిపల్లిలోని 153 సర్వే నెంబర్లోని 53 ఎకరాల అసైన్మెంట్ భూమికి 1954కు పూర్వం 40 మంది ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన అసైన్మెంటు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది.
ఈ నకిలీ పత్రాలను రెవెన్యూ అధికారులకు సమర్పించి, తమకు కేటాయించిన అసైన్మెంట్ భూములు రిజిష్టర్ అయ్యేలా ఎన్వోసీలు జారీ చేయాల్సిందిగా రైతులతో అధికార పార్టీకి చెందిన నేత దరఖాస్తులు పెట్టించారు. వాస్తవంగా 1980-90లలో అసైన్మెంట్ చేశారు. అయినా వారికి 1954 పూర్వమే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులతో సహకారంతో అడ్డదారిలో 153 సర్వే నెంబర్లోని 53 ఎకరాల అసైన్మెంట్ భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) సాధించినట్లు తెలిసింది. ఎన్వోసీ వచ్చిన వెంటనే అసైన్డ్భూములను రైతులు తమ పేరిట భూయాజమాన్య హక్కులు వచ్చేలా రిజిస్ట్రేషన్లు చేసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. రూ.కోట్ల విలువ చేసే ఆ భూములను అధికార పార్టీ నేత రైతులకు డబ్బులు ఇచ్చి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన అనుచరుడికి రిజిస్ట్రేషన్లు చేయించినట్లు తెలిసింది.
తన పేరిట 53 ఎకరాల భూమి వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నాలా కన్వర్షన్ చేసుకోవడంతో పాటు వెంచర్ చేసేందుకు హెచ్ఎండీఏ వద్ద దరఖాస్తు పెట్టుకున్నారు. వెంచర్‌కు పూర్తిస్థాయిలో ఇంకా అనుమతులు రాలేదు. ప్రాథమిక అనుమతులు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ సంస్థ పోతిరెడ్డిపల్లిలోని 53 ఎకరాల భూమిలో వెంచర్ పనులను ప్రారంభించింది. నిబంధనలను ప్రకారం అసైన్మెంట్ భూములకు ఎన్వోసీలు ఇవ్వరు. అయినప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఎన్వోసీలు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు ఆక్రమణ
153 సర్వేనెంబర్లో 2007లో రెవెన్యూ అధికారులు పేదలకు కేటాయించిన 2.05 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 80 మంది పేదలకు ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున మొత్తం 2.5 ఎకరాల భూమిని పేదలకు రెవెన్యూ అధికారులు ఇచ్చారు. పట్టాలు వచ్చినా సరైన సౌకర్యాలు లేవని వెంటనే పేదలు ఇండ్లు నిర్మించుకోలేదు. ఇటీవల ప్రభుత్వం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలివేముల వరకు 60పీట్ల రోడ్డు నిర్మిస్తున్నది. దీంతో 80 మందిపేదలు తమకు కేటాయించిన స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందకు సిద్ధం కాగా, రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూములను ఆక్రమించుకుని వెంచర్ వేస్తుండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కాగా, రియల్ ఎస్టేట్ సంస్థ తమ పరిధిలోని 53 ఎకరాల భూమి విషయంలో ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సంగారెడ్డి మండల రెవెన్యూ అధికారులు, సంగారెడ్డి మున్సిపల్ అధికారులు కలుగజేసుకుని వెంచర్ పనులు ఆపకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
విచారణకు ఆదేశించాం..
పోతిరెడ్డిపల్లిలోని 153 సర్వేనెంబర్‌లోని 53 ఎకరాల గైరాన్ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన అంశంపై ఫైళ్లను వెతుకుతున్నాం. ఈ భూమి పేదలకు అసైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందులో 53ఎకరాల భూమికి ఎన్వోసీలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన రికార్డులను నాకు ఇవ్వడంతో పాటు వివాదానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఆదేశించాం.
– జయరాం, సంగారెడ్డి తహసీల్దార్