మోర్తాడ్, మార్చి 2: గల్ఫ్‌లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో బాంబుల మోత మోగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశ సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందడంతో, అమెరికా స్థావరాలు కలిగిన దేశాలను ఇరాన్ టార్గెట్ చేస్తూ భీకర దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా బాంబులు, మిసైల్, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతుంది. తెలంగాణ వాసులు బతుకుదెరువు కోసం వెళ్లిన దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఉంటున్న ఇజ్రాయిల్, ఖతర్, కువైట్, అబుదాబీ, దుబాయ్, బహ్రెయిన్, సౌదీ, జోర్దాన్లలో భీకర దాడులకు పాల్పడతుండడంతో భయానక వాతావరణం నెలకొన్నది. ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
సెలవులు ప్రకటించిన దేశాలు
ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్దేశాలు అక్కడ ఉంటున్న ప్రజలను అలర్ట్ చేశాయి. ప్రతి ఒక్కరికీ బయటికి రావొద్దని, యుద్ధ వాతావరణం ముగిసే వరకు గదులకే పరిమితం కావాలని అలర్ట్ మెస్సేజ్‌లను ప్రభుత్వాలు పంపిస్తున్నాయి. మార్చి 4 వరకు అలర్ట్ ప్రకటించిన గల్ఫ్దేశాలు సెలవులు ప్రకటించాయి. దీంతో బయటికి వెళ్లలేక, పనికి వెళ్లలేక గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాంబులు, మిసైళ్లు పడుతున్న శబ్దాలు వినపడుతుండడం మరింత భయంగా గడుపుతున్నారు.
వేల్పూర్ మండలం కుకునూరుకు చెందిన లింగన్న దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 28న దుబాయ్‌లో ఫ్లైట్ ఎక్కి ఇండియాకు రావాల్సిన వాడు. సామగ్రి మొత్తం సిద్ధం చేసుకుని టికెట్ బుక్ చేసుకొని, వస్తున్నానని ఇంటి వారికి సైతం చెప్పుకున్నాడు. ఇరాన్ దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉండడంతో ఇంటికి వెళ్తున్నాననే సంతోషం అతడికి ఎక్కువ సేపు నిలువలేదు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో తెలంగాణ వాసులు గల్ఫ్‌దేశాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు
ఫోన్ల ద్వారా క్షేమ సమాచారం
ఇజ్రాయెల్‌లో కూడా తెలంగాణ వాసులు వేలసంఖ్యలో ఉన్నారు. అక్కడ కూడా యుద్ధవాతావరణంతో భయంభయంగానే కాలం వెళ్లదీస్తున్నారు. ఈదేశంలో సైరన్మోతలు రాగానే బంకర్లలోకి వెళ్లి దాక్కోవడం, తర్వాత బయటికి రావడం పరిపాటి. రెండు రోజులుగా బాంబుల దాడులు, సైరన్మోతలు జోరుగా వినపడుతుండడంతో ఇక్కడ కూడా భయంభయంగానే ఉంటున్నారు. ఉపాధికోసం అక్కడికి వెళ్లిన వారు ఎలా ఉన్నారో, ఏమవుతుందోనన్న భయం ఇక్కడ ఉన్న వారి కుటుంబసభ్యుల్లో నెలకొన్నది. దీంతో రోజూ ఫోన్ ద్వారా అక్కడి పరిస్థితులు, క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వారు యుద్ధవాతావరణంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా, ఇక్కడ ఉంటు న్న వారి కుటుంబసభ్యులు తమ వారికి ఏమీ కావొద్దని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధవాతావరణం ముగిసి ప్రశాంత వాతావరణం నెలకొనాలని, పరిస్థితులు ఇదే విధంగా ఉంటే తమవారిని రప్పించే ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
సైరన్ మోగగానే బంకర్లలో ఉంటున్నం
యుద్ధవాతావరణం ఏర్పడడంతో భయంభయంగానే ఉంటున్నం. బాంబులు పడుతున్నయంటే సైరన్ వస్తుంది. వెంటనే బంకర్లకు వెళ్లి అక్కడే ఉంటం. ఇజ్రాయెల్ తరచూ బాంబులు వేయడం ఇక్కడ కొంచెం అలవాటే అయినా ఇప్పు డు జరుగుతున్న పరిస్థితుల్లో కొంచెం భయంగానే ఉన్నది. యుద్ధవాతావరణం ముగిసి ప్రశాంతవాతావరణం నెలకొంటే బాగుంటుంది.
– దేవరాజ్(ఇజ్రాయెల్), కమ్మర్పల్లి
బంద్ పెట్టిండ్రు..
మాది మోర్తాడ్ గ్రామం. నేను ఖతర్‌లోని అల్కోర్ ప్రాంతంలో ఉంటున్నా. యుద్ధ వాతావరణం కారణంగా ఇక్కడ పనులు, కార్యాలయాలన్నీ మూసివేశారు. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఇంకా రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగేట్లు ఉన్నది. బాంబులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ మేస్సేజ్‌లు వస్తున్నాయి. ఇంటి దగ్గర ఉన్న మావోళ్లు కూడా భయపడుతున్నారు.
– రజనీకాంత్(ఖతర్), మోర్తాడ్
అర్ధరాత్రి ఫ్లైట్ ఎక్కేవాడిని..
నేను దుబాయ్‌లో డ్రైవర్ పనిచేస్తు ఉపా ధి పొందుతున్న. శనివారం అర్ధరాత్రి ఇండియా రావడానికి ఫ్లైట్ ఎక్కేవాడిని. కానీ మధ్యాహ్నం నుంచే ఎయిర్‌పోర్టులన్నీ బంద్ చేయడంతో రావడం క్యాన్సి ల్ అయ్యింది. ఒక్కరోజైతే ఇంటికి చేరుకునేటోడిని. మళ్లీ ఎప్పుడు వెళ్లేందుకు సమయం దొరుకుతుందోనని ఎదురుచూసుడే. యుద్ధవాతావరణం ముగిస్తే తప్ప మాకు ప్రశాంతత ఉండదు.
-లింగన్న, కుకునూర్, వేల్పూర్ మండలం
గదుల్లోనే ఉంటున్నం..
నేను దుబాయ్‌లో డ్రైవర్ పని చేస్తున్నా. యుద్ధం కారణంగా మమ్మల్ని బయటకు రావొద్దని చెప్పిండ్రు. శనివారం నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మా గదుల్లోనే ఉంటున్నం. బాంబులు పడ్డ శబ్ధా లు వినబడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నాం.
– కొమిరె రాము (దుబాయ్), మోర్తాడ్