జహీరాబాద్, ఆగస్టు 12 : సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల గుండా వెళ్లే 65వ జాతీయ రహదారి అయిన హైదరాబాద్-ముంబై రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండడంతో నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించిన తర్వాత కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు వివిధ రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు పెరగడం, విచ్చలవిడిగా నడపడంతో యాక్సిడెంట్లు నిత్యకృత్యంగా మారాయి. సంబంధిత అధికారులు అవగాహన కల్పించినా.. తనిఖీలు చేసి ఫైన్లు వేసినా వాహనచోదకుల తీరు మారడం లేదు. తాము ప్రమాదాలకు గురవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ముప్పుగా మారుతున్నారు. గతంలో హైదరాబాద్, ముంబై వెళ్లే రహదారి జహీరాబాద్ పట్టణం మీదుగా ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉండేది.
ఇప్పుడు బైపాస్ నిర్మించడంతో పట్టణంలో ట్రాఫిక్ తగ్గింది. ముంబై వెళ్లే రహదారి కావడంతో వాహనాల వేగ నియంత్రణకు అడ్డుకట్ట లేకుండాపోయింది. ఎల్అండ్టీ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సదరు సంస్థ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నచోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం, వేగ నియంత్రణకు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం కొత్తూర్(డి) మొదలుకుని మొగుడంపల్లి మండలం మాడ్గి చౌరస్తా వరకు 45 కిలోమీటర్ల మేర 65వ నంబరు జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గంలోని కోహిర్ మండలం కొత్తూర్(డి), చింతలగట్టు, దిగ్వాల్, జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డి), హుగ్గెల్లి, జహీరాబాద్ పట్టణంలోని ఇంద్రప్రస్థాన్, అల్గొల్ , బూడ్దిపాడ్, మొగుడంపల్లి మండలంలోని సత్వార్, అసద్గంజ్ వద్ద ప్రధాన చౌరస్తాలు ఉన్నాయి.
ఈ చౌరస్తాలన్ని డేంజర్ స్పాట్లుగా మారాయి. వాహనాల వేగ నియంత్రికలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కూడా కానరాకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల జీబ్రా లైనింగ్ కూడా సరిగ్గా లేదు. రాత్రివేళలో ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. లైట్లు కానీ.. రేడియం స్టిక్కర్లు కానీ కానరావు. ఆయా చౌరస్తాల సమీపాల్లోని గ్రామాలకు చెందిన బైక్లు, వాహనాలు, కాలినడకన రోడ్డు దాటే సమయంలో వేగంగా వచ్చే వాహనాలను గమనించక ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ చౌరస్తాల్లో నెలలో ఒకటీ రెండు ప్రమాదాలు జరుతుండడంతో పాటు మృత్యువాత పడుతున్నారు. వందల సంఖ్యలో గాయాలబారినపడి కొందరు అంగవికలురుగా మారుతున్నారు. గత ఏడాది సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్ ముంబైకి వెళ్లే జాతీయ రహదారిపై 394 ప్రమాదాలు జరుగగా, 128 మంది మృతి చెందారు.
తాజాగా ఈ జాతీయ రహదారిపై మోడంపల్లి మండలం సత్వర్ గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదే జాతీయ రహదారి పరిధిలోని కోహిర్ మండలంలో వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.
వాహనాలను జాగ్రత్తగా నడపాలి: డీఎస్పీ
వాహనాలను ఓపికగా, జాగ్రత్తగా నడపాలని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. ‘‘అతివేగం, అజాగ్రత్తతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చౌరస్తాలను దాటే సమయంలో వాహనాన్ని నిలిపి ఇరువైపులా చూసి రోడ్డును దాటాలి. హైవేపై వచ్చే వాహనం దూరంగా ఉంది కదా.. అనుకుని తమ వాహనాన్ని ముందుకు పోనివ్వరాదు. హైవేపై వాహనాల వేగం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. రాంగ్రూట్లో వెళ్లడం, యూటర్న్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హైవే నిర్వహణ సంస్థతో మాట్లాడి ప్రధాన చౌరస్తాల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’ అని డీఎస్పీ అన్నారు.