Karnataka : 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించబోతున్నట్లు వెల్లడించారు. పిల్లలపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రభావం పడుతోందని, చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని, దీన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
చాలా కాలంగా కర్ణాటక ఈ నిర్ణయం తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై గతంలో రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రకటన చేశారు. విద్యా సంస్థల్లో సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించే అంశంపై పలు యూనివర్సిటీల వీసీలతో సీఎం సిద్ధరామయ్య ఇటీవల చర్చలు జరిపారు. వీసీల దగ్గరినుంచి అభిప్రాయాలు సేకరించారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావ్ కూడా పిల్లలు సోషల్ మీడియా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి గతంలో పలు సూచనలు చేశారు. పిల్లలు సోషల్ మీడియా బారిన పడకుండా చూడాలని బీజేపీ నేత, ఎమ్మెల్యే సురేష్ కుమార్ కోరారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలియాల్సి ఉంది.
ఇక.. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దేశంలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది. ఏపీ, గోవా ప్రభుత్వాలు దీనిపై ప్రతిపాదన చేసినా.. ఇంకా అమలు దిశగా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా దీనిపై నిర్ణయం తీసుకుని, ఇప్పటికే నిషేధాన్ని అమలు చేస్తోంది. ఫిన్లాండ్, బ్రిటన్ కూడా పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అలాగే, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు సొంత చట్టాలతో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ విధించాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు కూడా పిల్లలు స్కూళ్లలో సోషల్ మీడియా, మొబైల్స్ వాడకంపై నిషేధం విధించాయి.
పిల్లలు చదువుపై ఫోకస్ చేయాలని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. పిల్లలు ఎస్ఎం వాడటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. నిద్రలేమి, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలా బ్యాన్ చేయడం వల్ల పూర్తి ఉపయోగం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు.