Tea Party | దేశాన్ని శాసించేవి రాజకీయ పార్టీలని మనకు తెలుసు. అయితే, స్వపక్షాన్ని వైరి పక్షంగానూ, విపక్షాలను స్వపక్షంగానూ మార్చే శక్తి టీ పార్టీకి ఉందన్నది కాదనలేని సత్యం. చరిత్ర పుటలు తిరగేస్తే సముద్ర జలాలే కాదు.. తేనీరు కూడా సునామీ సృష్టించగలదని తెలిసొస్తుంది. చరిత్ర అనగానే శతాబ్దాలు వెనక్కి వెళ్లిపోకండి. పాతికేండ్ల కిందటి ముచ్చటే! ఒక్క టీ పార్టీ దేశ రాజకీయాలనే మార్చేసింది. కేంద్రంలో రాకరాక వచ్చిన అధికార ధ్వజాన్ని కాషాయదళం నుంచి ఎగరేసుకుపోయేలా చేసింది. ‘టీ కప్పులో తుఫాన్’ అని ఊరికే అన్నారా మరి!
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ‘అమ్మ’ అనిపించుకున్న జయలలిత అప్పట్లో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి. ఓ ఏడాదిపాటు మద్దతు పద్ధతిగానే సాగింది. తమిళనాడులోని కరుణానిధి ప్రభుత్వం జయలలితపై కత్తిగట్టింది. ఎత్తిన కత్తి దించేలా చేయకపోతే.. ఊరుకోబోనని హెచ్చరించారామె. జయలలిత అధ్యక్షురాలిగా ఉన్న అన్నాడీఎంకే ఆక్సిజన్ కరువైతే కేంద్ర ప్రభుత్వం ఊపిరి ఆగిపోవడం ఖాయం! ఇదే అదనుగా జనతాపార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తేనీటి విందుకు సన్నాహాలు చేశారు. కాగల కార్యాన్ని నిర్వర్తించే బాధ్యతను జయలలితే ఆయనకు అప్పగించిందని అందరి మాట! కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విపక్షాలన్నీ ఈ ఉష్ణోదక ఉత్సవానికి తరలి వచ్చాయి.
లబ్ధప్రతిష్ఠులైన నేతలు ఏకాక్షరిని ఆస్వాదిస్తూ ఉపసంహ‘రణానికి’ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తేనీటి వేడుక పూర్తయ్యేసరికి దేశ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 1999 మార్చి 29న తేనీటి విందు జరిగితే.. రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు జయలలిత. తర్వాత విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోలేకపోవడంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత చరిత్ర ఎలా ఉన్నా.. బద్ధశత్రువులనైనా ఒక్కటి చేసే శక్తి టీ పార్టీకి ఉందని ఈ సంఘటన రుజువు చేస్తుంది. మిత్రభేదానికే కాదు.. మిత్రలాభానికీ తేనీటి పార్టీని మించిన వేదిక మరొకటి ఉండదు.
కావలసినవి: నీళ్లు: ఒకటిన్నర కప్పు, తేనె: ఒక టేబుల్ స్పూన్, వైట్ టీ బ్యాగ్: ఒకటి (ఈ-కామర్స్ వెబ్సైట్లలో లభిస్తుంది)
తయారీ: స్టౌ మీద గిన్నెపెట్టి అందులో నీళ్లు పోయాలి. నీళ్లను బాగా మరిగించాలి. బుడగలు వస్తున్నప్పుడు ఆ నీటిని తేనె వేసిన కప్పులో పోసుకోవాలి. తర్వాత వైట్ టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాల పాటు బ్యాగ్ కదిలేలా ఆడించాలి. ఇంకేం.. కొవ్వును కరిగించే రుచికరమైన వైట్ టీ సిద్ధం. తేయాకు మొక్కల లేత చివుళ్లను సేకరించి, వాటినుంచి వైట్ టీపొడిని తయారుచేస్తారు.
నాకు అమరత్వంపై ఆసక్తి లేదు. కానీ, తేనీరు సేవించే క్షణాలు మాత్రం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాను!
లూ తాంగ్, చైనా కవి
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!