Alcoholics Anonymous | ఎంత సంపదైనా ఉండవచ్చు. ప్రతిభావంతులే కావచ్చు. హోదా, అధికారం.. దేనికీ లోటు లేకపోవచ్చు. కానీ ఒకే ఒక్క వ్యసనం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. గౌరవాన్ని కించపరుస్తుంది. అదే – మద్యం! మితిమీరిన వ్యసనం తీవ్రవ్యాధితో సమానం. అలాంటివారిని చూసి జాలిపడే వాళ్లూ తక్కువే. ఆ దురలవాటు మాన్పించడానికి పసరుమందులు పనిచేస్తాయనే నమ్మకం లేదు. కౌన్సెలింగ్‌తో శాశ్వత పరిష్కారం రాకపోవచ్చు. Alcoholics Anonymous మాత్రం ఈ సమస్యను ఎదురొడ్డి నిలిచే స్థయిర్యాన్ని ఇస్తుంది. మద్యాన్ని ఏమార్చడమే కాదు… వ్యక్తిత్వాన్నీ మార్చేస్తుంది.
గొప్ప మేధావిని పట్టుకుని వ్యసనపరుడని సంబోధిస్తారు. ఆకాశమెత్తు ఖ్యాతి ఉన్నా చిన్నచూపే చూస్తారు. పలకరించడానికే ఇష్టపడరు. శుభకార్యాలకు ఆహ్వానించడం అసాధ్యమే. ‘తాగుబోతు’ అనే ముద్ర మనిషిని అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఆత్మీయులను దూరం చేస్తుంది. రక్త సంబంధీకులను పగవాళ్లుగా మారుస్తుంది. దురలవాటు కారణంగా.. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతలోనే ఏ తీవ్ర అనారోగ్యమో పట్టిపీడిస్తుంది. ఏదో ఒకరోజు దిక్కులేని చావు ఖాయం. ఏ తాగుబోతు కథ అయినా.. దాదాపుగా ఇలానే ముగిసిపోతుంది. వద్దు. ఆ దుస్థితి వద్దేవద్దు.
మందుల సంగతి ఏమో కానీ, మనోబలంతో మద్యం వ్యసనాన్ని అధిగమించవచ్చని భరోసా ఇస్తున్నది.. ఆల్కహాలిక్స్ అనానిమస్ (ఏఏ). ఈ సంస్థకు దాదాపు నూరేండ్ల చరిత్ర ఉంది. 1935లో న్యూయార్క్‌కు చెందిన ఓ స్టాక్‌బ్రోకర్, ఒహయోకి చెందిన ఓ సర్జన్ కలిసి స్థాపించారు. భావసారూప్యం ఉన్న వ్యక్తులు సభ్యులుగా చేరారు. అంతా ఏకమై మద్యం బానిసల జీవితాలు మార్చారు. ఉమ్మడిగా ‘బిగ్ బుక్’ అనే పుస్తకాన్ని రాసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఏఏ.. ఒక గ్రూప్ థెరపీలాంటిది. ఇది చేయాలి, అది చేయాలి అనే కట్టడి ఎక్కడా ఉండదు. కానీ ఇలా చేయడం వల్ల మేం లాభపడ్డాం, మీకూ ఉపయోగం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో చేరే ప్రతి సభ్యుడినీ ఒక సీనియర్ గైడ్ చేస్తారు. ఏఏ పనితీరు చాలా సరళంగా, సూటిగా ఉంటుంది. తరచూ జరిగే సమావేశాలు, పన్నెండు సూత్రాల జీవన విధానం ద్వారా మద్యం మత్తును ఎదుర్కొనేంత బలంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యం.
Alcohol2
తొలి దశలో మద్యానికి దూరం చేస్తూ, ఏఏ సమావేశాలకు దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ సమావేశాలు కూడా ఎక్కువగా రాత్రి 7-8 గంటల మధ్య ఉంటాయి. ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనో, మిత్రులను కలిసో.. ఏ బార్లోనో, వైన్‌షాప్ దగ్గరో ఆగి మద్యం తీసుకుంటే బాగుండు అనిపించే బలహీనమైన వేళ అది. సమావేశానికి వెళ్లారంటేనే.. మద్యంపై యుద్ధంలో మొదటి విజయం సాధించినట్టే. మద్యపాన నష్టాలపై చర్చలు, పన్నెండు సూత్రాలపై విశ్లేషణలు.. మీటింగ్ అజెండా ఏమైనా కావచ్చు. బయటవారు కూడా పాల్గొనే అవకాశం ఉన్న ఓపెన్ సమావేశాలూ ఉంటాయి. కొన్నిటిలో మాత్రం సభ్యులకు మాత్రమే ప్రవేశం. మద్యం మానేసే ప్రయత్నంలో తమ
అనుభవాలను ఎప్పటికప్పుడు చెప్పుకొనేందుకు, సీనియర్ల సలహాలు తీసుకునేందుకు.. ఇవి చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా కొత్తవారిలో నమ్మకాన్ని కలిగించేందుకు సాయపడతాయి. ఆల్కహాలిక్స్ కుటుంబసభ్యులు తమ సమస్యలను చర్చించుకునేందుకూ మీటింగ్స్ ఉంటాయి.
మద్యానికి లోనైనవాళ్లు తమ బలహీనతను తెలుసుకుని, తమంతట తాముగా వ్యసనం నుంచి బయటపడేందుకు సాయపడటమే ఈ వ్యవస్థ లక్ష్యం. అందుకే, ఎప్పుడూ వ్యక్తిగత వివరాల జోలికి వెళ్లరు. ఉచిత సలహాలు అందించరు. చికిత్సల గురించి మాట్లాడరు. రాకపోకలను పర్యవేక్షించరు. బయటి విషయాల మీద ఎలాంటి అభిప్రాయాలనూ వ్యక్తం చేయరు. ఆఖరికి మద్యం వద్దని కానీ, మద్యనిషేధం చేయాలని కానీ ప్రకటనలు గుప్పించరు. ఈ ఫోకస్.. నేరుగా లక్ష్యం మీదే దృష్టి కేంద్రీకరించేందుకు సాయపడుతుంది. అంతేకాదు, పూర్తి స్వావలంబనతో సాగే వ్యవస్థ ఇది. ఏఏలో పదవులు, హోదాలు ఉండవు. బయటి వ్యక్తుల నుంచి విరాళాలు స్వీకరించరు. అందులో చేరినవాళ్ల నుంచి కూడా, పరిమితికి మించి డబ్బు తీసుకోరు. ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం ఉంటుంది కానీ, ఎలాంటి భాగస్వామ్యాలకూ తావుండదు.
‘ఇవాళ తాగి, రేపటి నుంచి మానేద్దాం’.. అనుకుంటూ ఆత్మవంచన చేసుకుంటాడు ఆల్కహాలిక్. కానీ ‘ఇవాళ ఓపికపట్టు, రేపటి సంగతి తర్వాత ఆలోచిద్దాం’ అంటుంది ఏఏ. One Day At a Time సూత్రం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘లివింగ్ సోబర్’ అనే పుస్తకం ఈ సూత్రాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. ఆల్కహాలిజం సమస్య ఉన్నవారు మద్యాన్ని ఒక్కసారి రుచిచూస్తే ఆ ఊబిలోకి జారిపోతారు (permanent, irreversible). కాబట్టి ప్రతిరోజూ దాని జోలికి పోకుండా ఉండటమే కీలకం. అలాగని One Day At a Time అని పైపైకి అనుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. మనపట్ల, మన చుట్టూ ఉన్న సమాజం పట్ల… వినయం, కృతజ్ఞత, ప్రేమ లాంటి సానుకూలమైన భావనలు అలవర్చుకున్నప్పుడే ఈ నియమం ఉపయోగపడుతుంది. ఏఏతో కలిసి ప్రయాణించడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది.
Alcohol1
ఎవరూ తమ వివరాలు బహిరంగంగా వెల్లడించకూడదన్నది ఏఏ సిద్ధాంతం. ఇందుకు కారణాలు సుస్పష్టం.
☞ వ్యక్తుల సామాజిక నేపథ్యానికి ప్రాధాన్యం ఇవ్వదు ఏఏ. రాజు, పేద.. సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా ఒక్కటేనని సంస్థ విశ్వాసం.
☞ చాలామంది తమ సమస్యను చెప్పుకొనేందుకు మొహమాటపడతారు. ఎవరేం అనుకుంటారో అనే భయం అడ్డొస్తుంది.
☞ ఇతర సభ్యుల గురించి బయట ప్రస్తావించడం వల్ల గౌరవ మర్యాదలకు భంగం కలగవచ్చు. బ్లాక్
మెయిలింగ్ ప్రమాదమూ ఉంది.
☞ అత్యుత్సాహంతో (ముఖ్యంగా సెలెబ్రిటీలు) తమ వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించుకునే ప్రమాదం లేకపోలేదు.
అలాగని ఇదేమీ రహస్య సంస్థ కాదు. తమ సభ్యత్వం గురించి ఆప్తులతో పంచుకోవచ్చు. బహిరంగంగా లేదా మాధ్యమాల ద్వారా చెప్పుకోవచ్చు. కానీ పూర్తి పేరు, ఫొటో వివరాలు లేకుండా జాగ్రత్తపడాలి.
Alcohol5
మద్యం బలహీనతను వదిలించుకునేందుకు పాటించాల్సిన పన్నెండు మార్గాలు, సంస్థ సజావుగా సాగేందుకు ఏర్పరుచుకున్న పన్నెండు ఆచారాలు.. ఆల్కహాలిక్స్ అనానిమస్ సంస్థకు ప్రాణం. ‘మేం మద్యాన్ని ఎదుర్కోలేమనీ, దానివల్ల మా జీవితాలు గాడి తప్పాయనీ ఒప్పుకొంటున్నాం’ అనే వాక్యంతో ఈ పన్నెండు మార్గాల జాబితా మొదలవుతుంది. దేవుడి మీదో, మరో శక్తి మీదో, బలమైన వ్యక్తిత్వం మీదో విశ్వాసం ఉంచి.. ఆ బలహీనతను దాటేందుకు ప్రయత్నిస్తామంటూ.. సానుకూలమైన నమ్మకాలను బలపరిచే ప్రయత్నం చేస్తుందీ జాబితా. ఇక పన్నెండు ఆచారాలూ ఏఏ వ్యవస్థ పనితీరు సజావుగా ఉండేందుకు తయారుచేసుకున్నవి.
‘ఇక్కడ సభ్యత్వం కావాలంటే ఒకటే దారి. తాగుడు మానాలనే బలీయమైన ఆకాంక్ష ఉంటే చాలు’, ‘డబ్బు, హోదా, ఆస్తి.. మన ప్రాథమిక లక్ష్యాన్ని నిర్వీర్యం చేయకూడదు’ .. తదితర సూచనలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ రెండు జాబితాలూ ఇంటర్నెట్లోనూ సులువుగా దొరుకుతాయి కానీ ఏఏతో కొంత అనుబంధం ఉండి, దాని లక్ష్యాల మీద అవగాహన ఉన్నవారే వీటిని ప్రభావవంతంగా వివరించగలరు.
ఓ వ్యక్తి తాను తాగుడుకు బానిసయ్యాడా లేదా అని తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఒక్క సెకను పాటు అహాన్ని పక్కన పెడితే నిజం గట్టిగా వినిపిస్తుంది. ఆల్కహాలిజం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇదో కుటుంబ సంక్షోభం. తాగుడుకు బానిసైనవాడు బాటిల్ వెనుక పరిగెడుతుంటే, కుటుంబం అతని కోసం తల్లడిల్లిపోతుంటుంది. పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం, ఆర్థిక స్తోమత, బంధాలు… అన్నీ బలహీనపడిపోతాయి. ఇదో సామాజిక సమస్య. మద్యానికి బానిసైనవాడి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా తనలానే అస్థిరంగా మారిపోతాయి. ఇదో న్యాయపరమైన సమస్య. హత్యల నుంచి రోడ్డు ప్రమాదాల వరకూ ఎన్నో చట్టపరమైన తప్పులకు కారణం అవుతుంది ఆ మత్తు. అన్నిటికీ మించి ఇది ఓ మహమ్మారి. తాగుడు అలవాటు చేసుకునే ప్రతి పదిమందిలో ఒకరు ఆల్కహాలిక్‌గా మారే ప్రమాదం ఉంది. ఈ వ్యసనాన్ని ఎదుర్కొనేందుకు ఏఏ చాలా పాటుపడుతుంది. జనం కూడా దాని ప్రభావాన్ని గ్రహిస్తున్నారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థలో 20 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. భారత్‌లో 1957లో ప్రారంభమైన ఏఏ ఇక్కడ కూడా గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. తెలుగునాట కూడా ఏఏ శాఖలు విస్తృతంగా ఉన్నాయి.
ఈ సమావేశాలు ఎక్కువగా రాత్రి 7-8 గంటల మధ్య ఉంటాయి. ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనో, మిత్రులను కలిసో.. ఏ బార్లోనో, వైన్‌షాప్ దగ్గరో ఆగి మద్యం తీసుకుంటే బాగుండు అనిపించే బలహీనమైన వేళ అది. సమావేశానికి వెళ్లారంటేనే.. మద్యంపై యుద్ధంలో మొదటి విజయం సాధించినట్టే. మద్యానికి లోనైనవాళ్లు తమ బలహీనత తెలుసుకుని, తమంతట తాము వ్యసనం నుంచి బయటపడేందుకు సాయపడటమే ఈ వ్యవస్థ లక్ష్యం.
Alcohol6
తాగుడులో ఆయనది 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆ క్రమంలో ఆల్కహాలిక్‌గా మారారు. మద్యానికి బానిసగా మారడానికి కారణం అలర్జీ. మద్యం తాగినప్పుడు శరీరం తీవ్రంగా స్పందిస్తుంది. అదే తరహా స్పందన కోసం మళ్లీమళ్లీ తాగాలనిపిస్తుంది (క్రేవింగ్). అలా రోజుకు 15 నిమిషాలు కూడా తాగకుండా ఉండలేకపోయేవారు కృష్ణ. ఏఏ గురించి తెలుసుకుని అందులో చేరారు. ఇప్పటికి 15 ఏండ్లయింది. మద్యం జోలికి పోనేలేదు. అది తనకు పునర్జన్మ అంటారు. అందుకే తన పుట్టినరోజును కూడా జరుపుకోవడం మానేశారు.
‘సభ్యులందరితోనూ నడిపే సంస్థే కానీ.. దీనికంటూ ప్రత్యేక వ్యవస్థ ఉండదు. అందుకే ఎలాంటి ప్రకటనలు కనిపించవు. సభ్యులే తమ సమయం, శ్రమ, డబ్బుతో ఈ వ్యవస్థను నడిపిస్తారు. ఈ సమావేశాల్లో ఎవరైనా అడుగు పెట్టవచ్చు. వచ్చినవాళ్లు ఎవరు? స్తోమత, సామాజికవర్గం ఏమిటి? అనే ప్రశ్న ఉండదు. పేరు చెప్పకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే మా లక్ష్యం… మద్యాన్ని ఎదుర్కోవడమే! ఏఏ గురించి తెలియకుండా ఏ ఆల్కహాలిక్ చనిపోకూడదన్నది మా తపన. ఎందుకంటే ఇక్కడ మద్యానికి బానిసైనవారు ఎదుర్కొనే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం కనిపిస్తుంది. లివింగ్ సోబర్, కేమ్ టు బిలీవ్ లాంటి విస్తృతమైన సాహిత్యం సాయపడుతుంది. పత్రికలు, కరపత్రాలు ఎప్పటికప్పుడు సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను చేరవేస్తుంటాయి. నిరక్షరాస్యులకు ఆడియోబుక్స్, అంధులకు బ్రెయిలీ సాహిత్యం… ఇలా ప్రతీ ఒక్కరికీ సాయపడే ప్రయత్నం చేస్తున్నది ఏఏ. ఆల్కహాల్ మానాలి అనుకునేవారు ఓ రెండడుగులు మావైపు వేస్తే, మేము పది అడుగులు అటుగా వేసేందుకు సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మాకు ఎంతోమంది మిత్రులు పరిచయం అవుతారు. ఎప్పుడన్నా తాగుడు గుర్తుకొస్తే… వారికి ఫోన్ చేసి ఓ పదినిమిషాలు మాట్లాడితే చాలు, ఆ ఉద్వేగం మేఘంలా కదిలి కరిగిపోతుంది. ఏఏ మనల్ని మద్యం నుంచి మాత్రమే తప్పించదు. మన లోలోపల ఉండే నిజమైన, స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుంది.’
Alcohol3
తను ఓ అద్భుతమైన చిత్రకారుడు. కుంచె పడితే… లోకానికి ప్రతిరూపాన్ని చూపించగలడు. ఎలాంటి సందర్భానికైనా తన బొమ్మతో ప్రాణం పోయగలడు. మంచి పేరు, దానికి తగ్గ ఉద్యోగం, చిత్రకారుడిగా గౌరవం.. వేటికీ లోటు లేదు. కానీ ఒక్కటే లోపం. ఒక్కటే.. కానీ అది తన జీవితాన్ని తలకిందులు చేసింది. డబ్బు నుంచి ఆరోగ్యం వరకు అన్నీ దూరమయ్యేలా చేసింది. ఇక తన ఉనికికి విలువ లేదు అనుకునే సమయంలో ఆల్కహాలిక్స్ అనానిమస్ జీవితాన్ని చక్కదిద్దింది. అదెలాగో ఆయన మాటల్లోనే…
నేను చిన్నప్పుడు చాలా తెలివైన విద్యార్థిని. అందరిలాగే డిగ్రీలో మద్యం రుచిచూశాను. మొదట్లో తాగుతుంటే బాగుండేది. ఈ క్రమంలో ఎప్పుడు ఆల్కహాలిక్‌గా మారానో తెలుసుకోలేకపోయాను. ఆల్కహాలిజం అనేది ఒక అలవాటో, వ్యసనమో మాత్రమే కాదు. అది ఒక వ్యాధి. నిరంతరం పెరిగే వ్యాధి (ప్రొగ్రెసివ్), నయం కాని జబ్బు (ఇన్క్యూరబుల్), ప్రాణాంతకమైన సమస్య (ఫేటల్). ఈ ఆల్కహాలిక్స్ జన్యు నిర్మాణమే భిన్నంగా ఉంటుంది. మద్యం అలవాటు ఉన్నవారు కొంతమంది అది గుర్తొచ్చినప్పుడు తాగుతారు; కొంతమంది పుట్టినరోజులు లాంటి ప్రత్యేక సందర్భాల్లో తాగుతారు; కొంతమంది అదేపనిగా తాగి హఠాత్తుగా ఆపేస్తుంటారు. కానీ ఆల్కహాలిక్ అలా కాదు. తను తాగుడు లేకుండా ఉండలేడు. గ్లాసు కింద పెట్టాక మళ్లీ ఎప్పుడు తాగాలా అనే ఆలోచిస్తాడు. అలాగని ఒకరు చెబితే తన సమస్యను గుర్తించే పరిస్థితిలో ఉండడు. తనకు తానుగా తెలుసుకోవాల్సిందే. అదంత తేలిక కాదు. ఎందుకంటే మద్యంలో మునిగితేలుతున్నప్పుడు, అతని ఆలోచన కూడా భిన్నంగా ఉంటుంది. తనకు అన్నీ తెలుసు అనే అహంకారం, అంతా తన అదుపులో ఉందనే భ్రమ, తను చెప్పిన అబద్ధాలను తనే నమ్మేంత బలహీనతలతో ఉంటాడు. మద్యానికి లొంగిపోయి తన ఆరోగ్యాన్ని ఎలాగూ పాడుచేసుకుంటాడు. ఎందుకంటే మద్యంతో రెండు వందలకు పైగా జబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఆల్కహాలిక్ సగటు జీవితం 20 ఏండ్ల ముందే ముగుస్తుందనీ అంటారు. దీంతోపాటుగా తన భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతాడు. వ్యక్తిత్వపరంగా విలువలనూ పోగొట్టుకుంటాడు. అందుకే ముందు తన సమస్యను గుర్తించాలి. ఆల్కహాలిజం ఒక వ్యాధి అని గుర్తించారు కానీ దానికి కచ్చితమైన మందు లేదు. అందుకే ఆల్కహాలిక్ అనానిమస్ (ఏఏ) చాలా ఉపయోగపడుతుంది. నేను రెండేండ్ల నుంచీ మద్యం ముట్టడం లేదు. ఏఏ మద్యమనే వ్యసనానికి ఒక పరిష్కారం మాత్రమే కాదు. దాన్ని ఆత్మస్థయిర్యంతో ఎదుర్కొనేలా చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. మద్యాన్ని మాత్రమే కాదు.. మనలో ఉన్న ప్రతి బలహీనతనూ మనం దాటేయగలం. ఇందులో చేరాకే నేను నా జీవితంలో మొదటిసారి ప్రశాంతతను అనుభవించాను!
మద్యంతో తన పరిచయం బీరు బాటిల్‌తో మొదలై ఇరవై ఏండ్లపాటు కొనసాగింది. మొదటి పదేండ్లు సరదాగా, తర్వాత ఐదేళ్లు ఇబ్బందిపడుతూ, చివరి ఐదేళ్లు ఎలా ఆపాలో తెలియక ఆ మత్తులో జోగారు. అయితే మత్తులోనో, కాకపోతే తాగుతూనో… 24 గంటల్లో ఏదో ఒకటే స్థితి. రోజుకు ఏడు ఫుల్ బాటిళ్లు తాగినా తృప్తి ఉండేది కాదు. చివరి 13 ఏళ్లు రాత్రి 2-5 మధ్యే ఇంటికి చేరేవారు. ఒక్కోసారి పోలీసులే జాలిపడి ఇంటికి చేర్చేవారు. కుటుంబ సమస్యలు మొదలయ్యాయి, సంపాదన లేదు, ఆస్తులు అమ్మేశారు. ఏఏలో అడుగుపెట్టాక జీవితం మళ్లీ చేతికొచ్చింది.
‘ఆల్కహాలిజానికి చాలా చికిత్సలే ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక ఆ వ్యక్తి తిరిగి సమాజంలోకి అడుగుపెట్టేస్తాడు. కానీ గల్లీ గల్లీలో మద్యం షాపులు.. వీధికో బార్ తనను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ సమస్యలో రికవరీతోపాటు రిలాప్స్ కూడా ఉంటుంది. అంటే… ఎన్నేండ్లు తాగకుండా ఓర్చుకున్నా, ఓ పెగ్గు పుచ్చుకుంటే మళ్లీ ఆ వ్యసనంలో జారిపోతాం. దాన్ని ఆపలేం. అందుకే ఈ సపోర్ట్ గ్రూప్ నిరంతరం అండగా నిలబడుతుంది. తాగుడుతో సతమతమైన వ్యక్తే మరో ఆల్కహాలిక్ సమస్యలను గుర్తిస్తాడు. ఇలాంటివాళ్లందరూ ఒకచోటుకు చేరి తమ అనుభవాలు, బలాలు, ఆశలతో… తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా పోరాడటమే ఏఏ. ఇందులో చేరేందుకు ఎలాంటి రుసుమూ ఉండదు. తాగుడు ఆపాలనే కోరిక ఉంటే చాలు. అలాంటి లక్ష్యంతో వచ్చే ఎవ్వరినీ తిరస్కరించం. ఇక్కడేమీ వైద్యం ఉండదు. కౌన్సిలింగ్ జరగదు. నమ్మకాన్ని పెంచుకునేందుకు పన్నెండు సూత్రాల సరళమైన పద్ధతిని పాటిస్తామంతే! వీటితో మద్యం తాగాలనే మానసిక ఒత్తిడిపై పోరాటం చేస్తాం. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా, దానికి పరిష్కారం వెతుక్కోవాలే కానీ… ఆ నెపంతో తాగుడు మొదలుపెట్టవద్దని ఏఏ ప్రోత్సహిస్తుంది. నేను పన్నెండేండ్ల నుంచీ ఇందులో సభ్యుడిగా ఉన్నాను. మద్యం నుంచి దూరంగా బతుకుతున్నాను. అసలు మద్యపానం జరుగుతున్న చోటుకు సైతం దూరంగా ఉంటాను. వర్తమానంలో జీవించమనీ, జీవితాన్ని ఒక్కో రోజుగా విభజించుకోమని ఏఏ చెబుతుంది. అలాగని భవిష్యత్తును విస్మరించం. నేను మళ్లీ దూరవిద్యలో ఎంఏ చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చిన నిబద్ధతతోనే అది సాధ్యమైంది. ఎప్పుడు ఏం చేయాలి, ఏది అవసరం అన్న విచక్షణ ఏర్పడింది.
హెల్ప్‌లైన్ నెంబరుకు (96664 66118/119) ఫోన్ చేస్తే చాలు… మత్తు నుంచి బయటపడే మార్గం దొరికినట్టే! కొత్త జీవితం ఆరంభం అయినట్టే.
ఓ వ్యక్తి తను తాగుడుకు బానిసయ్యాడా లేదా అని తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఒక్క సెకను అహాన్ని పక్కన పెడితే నిజం గట్టిగా వినిపిస్తుంది. ఆల్కహాలిజం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇదో కుటుంబ సంక్షోభం. తాగుడుకు బానిసైనవాడు బాటిల్ వెనుక పరిగెడుతుంటే, కుటుంబం అతని కోసం తల్లడిల్లిపోతుంటుంది.
Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?
Layoffs | కొనసాగుతున్న లేఆఫ్స్.. మీ ఉద్యోగం పోయేలోపే ఈ జాగ్రత్తలు తీసుకోండి