నవంబర్ 29వ తేదీ అంటే ‘దీక్షా దివస్’ గుర్తుకువస్తుంది. ‘దీక్షా దివస్’ అంటే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదమే గుర్తుకువస్తుంది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గుర్తుకువస్తుంది. కేసీఆర్ చేసిన దీక్ష వల్లనే కేంద్రం దిగివచ్చి మొట్టమొదటిసారి చేసిన డిసెంబర్ 9న చేసిన ‘ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ’ ప్రకటన గుర్తుకువస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న రోజు 2009, నవంబర్ 29వ తేదీ. ‘దీక్షా దివస్’ పేరున కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రక మలుపు. నవంబర్ 29 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం విశాల ప్రజా ఉద్యమంగా మారి సబ్బండ వర్గాల సహకారం, సకల జనుల పోరాటం, అమరుల త్యాగఫలం వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కారమైంది. అద్భుత విజయం, రాష్ట్ర ఏర్పాటు దీక్ష ప్రారంభించే ముందు తెలంగాణ సమాజంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
2009 అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ఉద్యమకారులను, ముఖ్యంగా ఉద్యోగులను, విద్యార్థులను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పటికే మనం పుట్టిన గడ్డ మీద రెండవ తరగతి పౌరులుగా మారిన తెలంగాణ ప్రజల అనుభవం ఆగ్రహంగా మారడానికి కారణమైంది. హైదరాబాద్ ఫ్రీజోన్‌గా మార్చడం అన్యాయం అని మొట్టమొదటిసారి తెలంగాణ ఎన్జీఓ సంఘం ప్రకటించి 2009, అక్టోబర్ 12న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని ప్రకటించడంతో వేలాదిగా ఉద్యోగులు తరలి వచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్న స్వామిగౌడ్, దేవీప్రసాద్ నేతృత్వంలో జరిగిన నిరసనలో నాటి ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, విఠల్ పాల్గొని అన్ని రాజకీయ పార్టీలకు వేసిన ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. గతంలో ‘ముల్కీ రూల్స్ సబబే’ అని సుప్రీం తీర్పు ఇస్తే ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కటై రాజ్యాంగ సవరణ చేసుకొని ఎలా ముందుకుసాగారో అదేవిధంగా తెలంగాణ రాజకీయ పార్టీలు కదలాలని పిలుపునిస్తే ఒక్క రాజకీయ పార్టీ కదలకపోవడం, మౌనంగా ఉండటం విషాదం. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాత్రమే ఫ్రీ జోన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. దీంతో పాటు సుప్రీం తీర్పు అమలైతే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చారిత్రాత్మక ప్రకటన చేసింది.
కేసీఆర్ వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించి ఫ్రీ జోన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అందులోభాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలతో, సంస్థలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఉద్యమ నిర్మాణం కోసం ఉద్యోగ సంఘాల నేతృత్వంలో పది జిల్లాలలో సమావేశాలు జరిగాయి. లక్షలాది మంది సమావేశాలలో పాల్గొని పోరాటానికి శ్రీకారం చుట్టారు.
చివరి సమావేశం మెదక్‌లో జరిగింది. అదే రోజు రాత్రి దాదాపు 12 గంటలకు కొంపల్లి, హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. మేమంతా హైదరాబాద్ చేరుకోవడం ఆలస్యం అవుతుందని కేసీఆర్ స్వయంగా మాకు ఎదురుగా వచ్చి కొంపల్లిలో అర్ధరాత్రి సమావేశం నిర్వహించి, పదిరోజుల పాటు జరిగిన విస్తృత సమావేశ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారేసరికి ఉద్యమ కార్యాచరణకు ఒక రూపం వచ్చింది. ఈ క్రమంలో అనేక రోజులు కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతర మేధోమథనం జరిగింది. మాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్‌రావు, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎందరో పాల్గొన్నారు. ఒక సందర్భంలో విరామం లేకుండా రెండు రోజులు చర్చించడం, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఆకాంక్షలు గమనంలోకి తీసుకుని ముందుకు సాగడం తెలంగాణ ఉద్యమ బలోపేతానికి దోహదం చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల పాత్రపై జయశంకర్, కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. సిద్ధిపేట కేంద్రంగా ఉద్యోగుల గర్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ సూచనలతో నవంబర్ 21న సభ ఏర్పాటుచేసి అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులను పాల్గొనేలా చేయాలని చేసిన ప్రయత్నం వల్ల 2 లక్షలకు పైగానే ఉద్యోగులు హాజరు కావడం విశేషం. స్వామి అగ్నివేష్, కేసీఆర్, జయశంకర్, ఉద్యోగ సంఘాల నేతల సందేశాలు ఉద్యోగులను ఆకర్షించాయి. ఫ్రీ జోన్ తీర్పు అమలుకాకుండా రాజ్యాంగ సవరణ చేయాలి, లేకుంటే ఉద్యోగులు పెన్‌డౌన్ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఆ సభ తర్వాత ఉద్యోగ సంఘాల జాక్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు నోటీస్ ఇచ్చి సమస్యను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రకటించడంతో ఉద్యమ వేడి మొదలైంది. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రజల పట్ల అనుసరిస్తున్న వివక్షకు విరుగుడు రాష్ట్రసాధన ఒక్కటే మార్గమని కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దానికనుగుణంగా పార్టీ నాయకులు, అన్ని వర్గాలతో చర్చలు జరిపి నవంబర్ 29వ తేదీన కరీంనగర్, తీగలగుట్టపల్లి నుంచి ‘దీక్షా దివస్’ దీక్షా శిబిరానికి పయనమయ్యారు. మధ్యలో అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్ అరెస్టు తర్వాత 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన విషయం తెలిసిందే.
‘దీక్షా దివస్’తో పాటు రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి అడుగులో కేసీఆర్‌తో కలిసి నడవడం చరిత్రలో నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత రెండేండ్లుగా రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రగతిని కాంక్షించే ప్రజలు ‘దీక్షా దివస్’ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
– జి.దేవీప్రసాదరావు