షాబాద్, నవంబర్ 26 : 50 ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధికి, పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పల్లెల రూపురేఖలు మారేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్ సర్కారు హయాంలో ఏ గ్రామానికి వెళ్లినా పల్లెలన్నీ పచ్చదనంతో దర్శనమిచ్చేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందుకు విరుద్ధంగా పల్లెలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండేళ్లు అవుతున్నా గ్రామపంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన గ్రామాలన్నీ నేడు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలు బాగుండేవని చెబుతున్నారు.
గతమెంతో ఘనం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని షాబాద్ మండలం కక్కులూర్ గ్రామం పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలిచింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కక్కులూర్లో కంపోస్ట్ యార్డు, వైకుంఠధామం, రైతు వేదిక, పల్లె ప్రకృతివనం, హరితహారం నర్సరీ, గ్రామపంచాయతీ ట్రాక్టర్, క్రీడా ప్రాంగణం తదితర పనులు చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పచ్చదనంతో గ్రామం మురిసిపోయింది. పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలిచిన కక్కులూర్ గ్రామాన్ని వివిధ రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధుల బృందాలు సందర్శించి ప్రశంసించారు.
రెండు సంవత్సరాలు గడుస్తున్నా..
గత సర్కారులో ఆదర్శంగా నిలిచిన కక్కులూర్ గ్రామం.. నేటి ప్రభుత్వంలో అధ్వానంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండు సంవత్సరాలైనా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడంలేదు. నెలనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో చెత్త సేకరణ ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితులు కూడా లేవు. కంపోస్ట్ యార్డు దుస్థితి అధ్వానంగా మారింది. వైకుంఠధామం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పల్లె ప్రకృతివనం నీళ్లు, నిర్వహణ లేకపోవడంతో అడవి మాదిరిగా తయారైంది. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు కనిపించడంలేదు. రోడ్డు పక్కన మురుగు ఏరులై పారుతున్నది. ఇది చూసిన ప్రజలు నాటి కేసీఆర్ పాలనలోనే తమ గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగిందని, కాంగ్రెస్ వచ్చినంక అభివృద్ధి ఏమీలేదని చెబుతున్నారు. ఇది ఒక్క షాబాద్ మండలంలోనే కాదు.. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే బాగుండే..
మా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులు బాగా జరిగినయి. చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్, కంపోస్ట్ యార్డు, పల్లె ప్రకృతివనం, సీసీ రోడ్ల నిర్మాణం చేయడంతో గ్రామం పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినంక పనులు చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.
– బాలయ్య, కక్కులూర్ గ్రామస్తుడు
గ్రామాలను ఎవరూ పట్టించుకోవడంలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. గత సర్కారులో చేపట్టిన పనులతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మారింది. రోడ్డు పక్కన మొక్కలకు సరిగ్గా నీళ్లు పోయడంలేదు. ప్రకృతివనం, చెట్లు ఎండిపోతున్నాయి. పారిశుధ్య పనులూ చేపట్టడంలేదు.
– కరుణాకర్, మాజీ ఎంపీటీసీ, కక్కులూర్
బీఆర్ఎస్ హయాంలో గ్రామం ఆదర్శంగా నిలిచింది
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా గ్రామం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా గ్రామంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు ఆదర్శంగా నిలువడంతో ఇతర రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గ్రామాన్ని సందర్శించి బాగుందని కితాబిచ్చారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. నిధులివ్వకపోవడంతో ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామపంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
– భానూరి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, కక్కులూర్