హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బీసీలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయలేని పరిస్థితి ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియను ఆపలేదని తెలిపారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ తరఫున ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని వెల్లడించారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఈ రిజర్వేషన్లను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ధర్నా చేసినా బీజేపీకి కనువిప్పు కలుగలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలువడం కల అని పేర్కొన్నారు. సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడిందని, అభివృద్ధి నిలిచిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలని సూచించారు.