Oscar Awards | ఆస్కార్ సంరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ సినీ యవనిపై సృజనాత్మకతకు పట్టం కట్టే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక కోసం సినీ ప్రేమికులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి అందరికంటే మిన్నగా ఆస్కార్ పురస్కారాలు భారతీయ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అందుక్కారణం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీలో నిలవడమే. మార్చి 12న 95వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ బరిలో నిలిచిన ఉత్తమ చిత్రాల వివరాలు, వాటిలో ఏ సినిమా విజేతగా నిలిచేందుకు ఎక్కువగా అవకాశముందో తెలుసుకుందాం..
ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన ఉత్తమ చిత్రాల్ని భిన్న జోనర్స్ నుంచి ఎంపిక చేశారు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు, సీక్వెల్స్, ఫాంటసీ..ఇలా విభిన్న కథా చిత్రాలు రేసులో ఉండటంతో పోటీ ఉత్కంఠగా మారింది. ఆల్ క్వైట్ ఇన్ వ్సైన్ ఫ్రంట్, అవతార్-ది వే ఆఫ్ వాటర్, ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎల్విస్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ది ఫాబెల్మాన్స్, టార్, టాప్‌గన్ మ్యావెరిక్, ట్రాయాంగిల్స్ ఆఫ్ సాడ్‌నెస్, ఉమెన్ టాకింగ్…చిత్రాలు ఈ ఏడాది ఉత్తమ సినిమా అవార్డు బరిలో నిలిచాయి. వీటిలో అత్యధిక నామినేషన్స్ పొందిన అబ్సర్డిస్ట్ కామెడీ డ్రామా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాప్‌గన్- మ్యావెరిక్’, 1920 ఐర్లాండ్‌లో జరిగిన అంతర్యుద్ధ నేపథ్యంలో రూపొందిన ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రాలు రేసులో ముందున్నాయని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఓ సినిమాకు లభించిన ప్రజాదరణ, ఆస్కార్ బరిలో నిలవక ముందు గెలుపొందిన వివిధ ప్రతిష్టాత్మక అవార్డులు, ఓటింగ్‌లో ఎక్కువ మంది మద్దతు పొందడం వంటి అంశాల ప్రాతిపదికన విజేతల్ని ఊహించలేమని, ఎలాంటి అంచనాలు లేని చిత్రాలు ఆఖరి నిమిషంలో అవార్డుల్ని గెలుపొందిన ఉదంతాలు ఉన్నాయన్నది కొందరి మాట.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తీసిన అబ్సర్డిస్ట్ (నైరూప్య) కామెడీ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకొని ఉత్తమ చిత్ర అవార్డు రేసులో ముందున్నది. ఈ భూమిపై మనుషులు పోలిన మనుషులు ఉంటారనే ఓ భావన మాదిరిగానే…ఈ అనంత విశ్వంలో కూడా సమాంతర ప్రపంచాలుంటాయని, అక్కడ మనల్ని పోలిన మనుషులతో సంభాషించడం సాధ్యమనే ఉహాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎవెలిన్ అనే చైనా మహిళ చుట్టూ నడిచే ఈ కథలో ఈ ప్రపంచం తాలూకు గందరగోళం, అనేకానేక నైరూప్య భావనలతో సాగిపోయే మహిళా జీవితాన్ని వినోదాత్మక కోణంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ చిత్రం ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్, క్రిటిక్స్ ఛాయిస్, గోథమ్ అవార్డ్స్, సియాటిల్ ఫిల్మ్ క్రిటిక్ సొసైటీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.
ఇక ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రం కూడా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్, గోల్డెన్‌గ్లోబ్స్, బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను గెలుపొందింది. ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రాన్ని 1920లో ఐర్లండ్‌లో జరిగిన అంతర్యుద్ధం నేపథ్యంలో ఇద్దరు మిత్రుల సంఘర్షణకు దృశ్యరూపంగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే సృజనాత్మక స్థాయీ భేదాలు, తామే అధికులమని భావించే మనస్తత్వం చివరకు ఎలాంటి సంక్షుభిత పరిస్థితులకు దారి తీస్తుందనే మానవీయ అంశాన్ని ఈ చిత్రంలో చర్చించారు. ఇక ‘టాప్‌గన్-మ్యావెరిక్’ 1990లో వచ్చిన ‘టాప్‌గన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. టామ్‌క్రూయిజ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అమెరికా నౌకాదళ కెప్టెన్ ఓ మిషన్‌ను చేపట్టి అందులో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ. అబ్బురపరిచే పోరాట దృశ్యాలు, కథాపరంగా కదిలించే భావోద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డుతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా అవార్డులను సొంతం చేసుకుంది.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన చిత్రం ‘ద ఫాబెల్మన్స్’. కళాకారుల జీవితాలకు దృశ్యరూపంలా హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కళ కేవలం మనోల్లాస సాధనం కాదని, అదొక జీవిత దర్శనం అనే తాత్వికతను ఈ సినిమాలో చూపించారు. తాను చిన్నతనంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1999లో ఈ సినిమాకు సన్నాహాలు చేయగా అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. కళాకారుల జీవిత ఇతివృత్తంతో తీసిన మరో చిత్రమే ‘టార్’. బాహ్య ప్రపంచంలో కళాకారులు గొప్ప గౌరవం పొందే వ్యక్తులుగా చెలామణి అవుతున్నా, వారి అంతర్లోకాల్లో ఎంతో సంఘర్షణ ఉంటుందని అనునిత్య అభద్రతాభావంతో సతమతమవుతుంటారనే అంశాన్ని ఈ సినిమాలో స్పృశించారు. కళాకారుల జీవితాలు, వారి జీవన సంఘర్షణ నేపథ్యంలో తీసిన ‘ద ఫాబెల్మన్స్’ ‘టార్’ చిత్రాలు కూడా ఉత్తమ చిత్రాల రేసులో విజేతలుగా నిలిచే అవశాలున్నాయని చెబుతున్నారు.
జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్-ద వే ఆఫ్ వాటర్’ చిత్రం కూడా ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నది. యుద్ధం వినాశనాన్ని తెస్తుందనే సందేశంతో తీసిన ‘ఆల్క్వైట్ ఇన్ వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా కూడా బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో పోటీలో నిలిచింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఆస్కార్‌లో ఉత్తమ చిత్రాలుగా అవార్డులందుకొన్న చిత్రాల్ని పరిశీలిస్తే కామెడీ, ఫ్యామిలీ డ్రామా, జీవన సంఘర్షణాత్మక నేపథ్య చిత్రాలకు ఎక్కువ అవార్డులు వరించాయి. గత మూడేళ్లుగా అవార్డులు పొందిన కోడా, నోమాడ్‌ల్యాండ్, పారసైట్ వంటి చిత్ర కథాంశాల్ని పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, టాప్‌గన్-మ్యావెరిక్, ది ఫాబెల్మాన్ వంటి చిత్రాల్లో ఒకదానికి ఉత్తమ చిత్ర విజేతగా నిలిచే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తమ చిత్ర రేసులో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ నిస్సందేహంగా ముందున్నదని హాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 11 నామినేషన్లతో ఆస్కార్ బరిలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు అనేక అవార్డులను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఓ అబ్సర్డిస్ట్ కామెడీ నేపథ్యంలో కథను నడిపించిన విధానం, సంక్లిష్టమైన అంశాల్ని ఎలాంటి తికమక లేకుండా అర్థవంతంగా చెప్పడం, స్క్రీన్ప్లేపరంగా కొత్త టెక్నిక్స్‌ను వాడటం ఈ సినిమాకు ప్లస్ అవుతాయని చెబుతున్నారు. అదీగాక ఈ సినిమాను ఆసియా, అమెరికా వలసదారుల నేపథ్యంలో రూపొందించారు కాబట్టి సాంస్కృతిక బంధానికి సినిమా మాధ్యమం ద్వారా బాటలు వేసే ఓ సాధనంగా ఉపయోపడుతుందనే భావన కూడా నెలకొని ఉంది.