రవీంద్రభారతి, నవంబర్ 26 : ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17న క్యాబినెట్ సమావేశంలో పార్టీపరంగా 42శాతం ఇస్తామన్న ముఖ్యమంత్రి 17శాతానికి మించి ఇవ్వకపోవడం బీసీలను రాజకీయ సమాధి చేయడమేనని ధ్వజమెత్తారు.
2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల కంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు మరింత తగ్గించడం అన్యాయమని మండిపడ్డారు. 42శాతం అమలుచేసి ఉంటే 5,300 సర్పంచ్ స్థానాలు బీసీలకు దక్కేవని, 17శాతం వల్ల కేవలం 2,176 సర్పంచ్ స్థానాలే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రావాల్సిన రిజర్వ్ స్థానాలను జనరల్ స్థానాలకు కేటాయించి రాష్ట్రంలో రెడ్ల రాజ్యాన్ని గ్రామస్థాయి నుంచి తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని 30 మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదని, 80 మండలాల్లో ఒకటీరెండు మాత్రమే రిజర్వ్ అయ్యాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 జీపీలకు గాను ఒక్కటి కూడా బీసీలకు రిజర్వ్ కాలేదని జాజుల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏడు జిల్లాల్లో 10శాతం లోపు, పది జిల్లాల్లో 20శాతం లోపు రిజర్వేషన్లు కేటాయించారని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేటాయించి బీసీలకు మోసం చేశారని ఆరోపించారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయం జీర్ణించుకోలేక బీసీ శ్రేణులు గాంధీభవన్‌ను ముట్టడించాయని, బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాయని ఆయన హెచ్చరించారు. బీసీ జేఏసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 30న చలో హైదరాబాద్ పేరుతో ఇందిరాపార్క్ వద్ద బీసీల రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా పెరిక సురేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్ సగర, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, తారకేశ్వరి, సమతా యాదవ్, గౌతమి, వరికుప్పల మధు, గూడూరు భాస్కర్, వెంకటేశ్‌గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రం రజక, కొప్పుల చందు, పద్మావతి, బండిగారి రాజు, భరత్ తదితలు పాల్గొన్నారు.