కొల్లాపూర్ రూరల్, మార్చి 15 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఆదివారం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, సోమశిల పర్యటనకు వచ్చిన టూరిస్టులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్దకు వచ్చి క్యూలో నిలబడగా అంతలోనే బంక్ యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.