శివ్వంపేట, జూలై 31: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీగురు పీఠంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయాల్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. రెండు ఆలయాల హుండీలను పగులగొట్టి వాటిలో ఉన్న నగదును అపహరించి పరారయ్యాడు.
శుక్రవారం ఉదయం ఆలయ కార్యనిర్వహకుడు సత్యనారాయణ గౌడ్ దేవాలయానికి వచ్చి పరిశీలించగా డోర్లు, హుండీలు పగులగొట్టిన విషయం గుర్తించాడు.
వెంటనే ఆలయ చైర్మన్ శివకుమార్ గౌడ్‌కు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మధుకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను సేకరించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించారు. ఈ ఘటన పై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.