Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు. అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
పెద్ది దర్శన్ రెడ్డి పార్థివదేహాన్ని చూసిన పలువురు అభిమానులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. “మా నాయకుడు ఇక లేరు” అంటూ విలపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. నర్సంపేటలో ఎటు చూసినా శోకసంద్ర వాతావరణమే కనిపించింది. అభిమానుల రోదనలు, నివాళులతో పట్టణం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజల ప్రేమాభిమానాలకు ప్రతీకగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ప్రియ నేతకు అశ్రునివాళులు అర్పించారు.