Yash | కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజున మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సినిమా ఫలితంపై యశ్ లేదా చిత్రబృందం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ విడుదల తర్వాత యశ్ తనతో ఏం మాట్లాడారో సినిమా డబ్బింగ్ సూపర్వైజర్ జయ్‌దేవ్ మోహన్ తాజాగా వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జయ్‌దేవ్ మోహన్.. ‘టాక్సిక్’ విడుదల తర్వాత యశ్‌తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. సినిమా ఫలితం, రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. అయితే యశ్ మాత్రం ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పినట్లు జయ్‌దేవ్ వెల్లడించారు. సినిమాను ప్రేక్షకుల తీర్పుకే వదిలేయాలని, ఇకపై చేయాల్సిన పని చాలా ఉందని యశ్ తనతో అన్నట్లు తెలిపారు.యశ్ మాటల్లో బాధను తాను అర్థం చేసుకున్నానని జయ్‌దేవ్ పేర్కొన్నారు. సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన నేపథ్యంలో ఫలితం ఆశించిన విధంగా రాకపోవడం బాధ కలిగించే విషయమే అయినప్పటికీ.. చివరకు ప్రేక్షకుల నిర్ణయమే అంతిమమని ఆయన అభిప్రాయపడ్డారు.
‘టాక్సిక్’కు సంబంధించిన తన ప్రయాణం గురించి కూడా జయ్‌దేవ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమా కథకు సంబంధించిన తొలి వెర్షన్‌ను తాను సుమారు నాలుగేళ్ల క్రితమే విన్నానని తెలిపారు. అయితే షూటింగ్ పూర్తయ్యే సమయానికి కథలోని పలు అంశాలు, వెర్షన్స్ మారిపోయాయని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత దాని రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి తాను కూడా ఎమోషనల్ అయ్యానని పేర్కొన్నారు. అయితే సినిమా బాగా తీశామని చెప్పడం మాత్రమే సరిపోదని.. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేదే చివరకు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విషయంలో ప్రేక్షకుల తీర్పును గౌరవించాల్సిందేనని జయ్‌దేవ్ అన్నారు. ప్రేక్షకులకు నచ్చితే సినిమాను ఆదరిస్తారని, నచ్చకపోతే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. ‘మేము సినిమా బాగా తీశాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాలేదు’ అని చెప్పడం సరైన కారణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఎలా ఉందో తుది నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.