హైదరాబాద్, మార్చి 15 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లకు సరుకుల సరఫరాలో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. నాసిరకం కందిపప్పు, తక్కువ బరువు కోడిగుడ్లను అందజేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మార్కెట్ రేటు ప్రకారం టెండర్ దక్కించుకొని నాణ్యతలేని, ఫుల్లెట్ గుడ్లను పంపిణీ చేస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. గుత్తేదారులు కాసుల కోసం అడ్దదారులు తొక్కుతున్నారు. కానీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ యేడు జిల్లా కొనుగోలు కమిటీ (డీసీసీ)ల ఆధ్వర్యంలో ఏకీకృత పద్ధతిలో టెండర్లు నిర్వహించారు. జిల్లా పరిధిలో ఒకే కాంట్రాక్టర్‌కు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సరుకుల పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. ప్రతిరోజూ 17 నుంచి 18 లక్షల గుడ్ల చొప్పున నెలకు 5.40 కోట్లు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. దీనిప్రకారం గుడ్ల ధరను ఆయా జిల్లాలను బట్టి రూ. 6.10 నుంచి రూ.6.40, కందిపప్పు రేటును రూ. 116 నుంచి రూ.122గా నిర్ణయించారు.
కోడిగుడ్ల బరువు 50 నుంచి 60 గ్రాములు ఉండాలని, ఫస్ట్‌క్లాస్ కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ధేశించారు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం ఈ మార్గదర్శకాలను పాటించడంలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం 30-40 గ్రాముల కోడిగుడ్లు, పుచ్చిపోయిన కందిపప్పును హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు వీటిని తీసుకొనేందుకు నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి వెనక్కి పంపిస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోడిగుడ్లు, ఇతర సామగ్రిని ప్రతినెలా మూడుసార్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కోడిగుడ్ల నాణ్యతను ధ్రువీకరిస్తూ మూడు రకాల కలర్స్ (గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు)తో స్టాంపింగ్ వేయాల్సి ఉంటుంది. కానీ గుత్తేదారులు మాత్రం మార్గదర్శకాలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తున్నారు. కేవలం నెలకు రెండుసార్లు అంటే పదిహేను రోజులకోసారి ఆహారపదార్థాలు సరఫరా చేస్తూ రవాణా ఖర్చులు తప్పించుకుంటున్నారని తెలుస్తున్నది. ఇటీవల సంబంధిత శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంలోనూ రెండేసార్లు సరుకులు అందిస్తామని కాంట్రాక్టర్లు చెప్పగా, ఆమె కూడా ఒకింత సానుకూలంగా స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల అక్రమాలకు అధికారపార్టీ నేతలు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే బినామీల పేరిట ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. మరికొన్ని చోట్ల గుత్తేదారులతో కుమ్మక్కయి వారి అక్రమ సొమ్ములో వాటాలు పంచుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సరుకుల సరఫరాను పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ విస్మరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, లబ్ధిదారుల ఫిర్యాదులను సైతం బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.