Kingdom | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ విడుదలై ఏడాది పూర్తైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కింగ్డమ్’.. శ్రీలంక నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అండర్‌కవర్ కాప్ సూరి పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. అక్రమ ఆయుధాల రవాణా, క్రిమినల్ కార్టెల్, తప్పిపోయిన అన్న కోసం చేసే అన్వేషణ చుట్టూ కథ సాగుతుంది. చివర్లో విజయ్ దేవరకొండ డబుల్ రోల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, విజయ్ మేకోవర్‌కు ప్రశంసలు వచ్చినప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో బలహీనతలు ఉండటంతో సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.82 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియాలో #1YearForKingdom హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ అభిమానులు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హీరో స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తుచేసుకుంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రెండ్‌పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు “సరైన కథ, బలమైన స్క్రీన్‌ప్లే ఉంటే ‘కింగ్డమ్’ బ్లాక్‌బస్టర్ అయ్యేది” అని అభిప్రాయపడుతుండగా, మరికొందరు “ప్లాప్ అయిన సినిమాను ఇప్పుడు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, కథను మరింత ఆసక్తికరంగా చెప్పి ఉంటే ఫలితం పూర్తిగా మారేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అభిమానులు ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే సీక్వెల్‌పై ఇప్పటికి భారీ అంచనాలు ఉండేవి అని పోస్టులు చేస్తున్నారు. ‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండకు ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడంతో, ‘కింగ్డమ్’పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలతో అయినా ఆయన మళ్లీ విజయాల బాట పట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.