Selenium | మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు, శరీరానికి శక్తి లభించేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు అనేక పోషకాలు సహాయం చేస్తాయి. కనుక అన్ని పోషకాలను మనం తరచూ అందేలా చూసుకోవాలి. అయితే పోషకాలు అంటే చాలా మంది విటమిన్ ఎ, బి12, విటమిన్ డి, సి లాంటివి చెబుతారు. అంత వరకు బాగానే ఉన్నా ఇంకా అలాంటి పోషకాలు చాలానే ఉన్నాయన్న సంగతి అనేక మందికి తెలియదు. మన శరీరానికి కేవలం విటమిన్లు మాత్రమే కాదు, అనేక మినరల్స్ కూడా అవసరం అవుతాయి. కనుక మినరల్స్ కూడా లభించేలా చూసుకోవాలి. ఇక మినరల్స్‌లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటివి చెబుతారు. కానీ ఇవే కాకుండా మన శరీరానికి కావల్సిన మినరల్స్ లో ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో సెలీనియం కూడా ఒకటి. సెలీనియం కూడా మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అనేక జీవక్రియలకు ఇది అవసరం అవుతుంది.
మనకు నిత్యం అవసరం అయ్యే అనేక మినరల్స్‌లో సెలీనియం కూడా ఒకటి. దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. అందువల్ల సెలీనియంను చాలా మంది తీసుకోరు. కానీ ఇది అనేక పనులను నిర్వహిస్తుంది. మన శరీరంలో అనేక జీవక్రియలకు సహాయం చేస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మన శరీర మెటబాలిజం పెరిగేందుకు సెలీనియం దోహదం చేస్తుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సెలీనియం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారికి సెలీనియం ఎంతో మేలు చేస్తుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సెలీనియం ఉండే ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది.
ఇక సెలీనియం మినరల్ అయినప్పటికీ ఇది యాంటీ ఆక్సిడెంట్లాగే పనిచేస్తుంది. రోజూ మన శరీరానికి తగినంత సెలీనియం లభించేలా చూసుకోవాలి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు. సెలీనియం యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభించేలా చేస్తుంది. వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు, జ్వరాలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. సెలీనియం తగినంతగా లభించకపోతే శరీరం తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. కనుక మన శరీరానికి సెలీనియం లభించేలా చూసుకోవాలి. సెలీనియం మనకు రోజుకు 70 నుంచి 80 మైక్రోగ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. ఇది మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది.
సెలీనియం మనకు సముద్రపు ఆహారంలో అధికంగా లభిస్తుంది. పీతలు, చేపలు, రొయ్యలు వంటి ఆహారాలను తింటుంటే సెలీనియంను పొందవచ్చు. అలాగే బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి నట్స్, సీడ్స్లోనూ ఇది ఉంటుంది. చికెన్, కోడిగుడ్లు, పాలకూర, పుట్ట గొడుగులు వంటి ఆహారాలను తింటున్నా కూడా సెలీనియంను పొందవచ్చు. వెల్లుల్లి, ఆవాలు, ఆలివ్ ఆయిల్, బ్రోకలీ, ఓట్స్, మటన్ లివర్, పైన్ నట్స్ వంటి ఆహారాలను తినడం వల్ల కూడా సెలీనియం లభిస్తుంది. ఇలా ఆయా ఆహారాలను తరచూ తింటుంటే సెలీనియం లభించేలా చూసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.