కవాడిగూడ/రవీంద్రభారతి, నవంబర్ 26: పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బీసీ, వివిధ పక్షాల నేతలైన విషారదన్ మహారాజ్, అయిలి వెంకన్నగౌడ్, ఎస్ దుర్గయ్యగౌడ్, అంబాల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఆయా చోట్ల బీసీ నాయకులు మాట్లాడుతూ జీవో 46తో రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలను నయవంచనకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు.
ట్యాంక్‌బండ్ వద్ద నాయకులు రోడ్డుపై బైఠాయించి బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగడంతో నాయకులు ఆందోళన విరమించి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయకుండా, న్యాయస్థానంలో చెల్లని జీవోలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను వంచించారని విమర్శించారు. జీవో 46 తీసుకువచ్చి రాజకీయంగా బీసీల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.