e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home కొమరంభీం ధరణి హసం

ధరణి హసం

భూ సమస్యల పరిష్కారానికి వేదిక
తహసీల్‌ కార్యాలయాల్లోనే పూర్తి సేవలు

రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌.. అన్నీ ఒకేచోట
స్లాట్‌ బుక్‌ చేసుకున్న మరునాడే ప్రక్రియ పూర్తి
గంటల వ్యవధిలోనే చేతికి పత్రాలు
ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు మంగళం
సమయం, అదనపు ఖర్చు ఆదా
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, అక్టోబర్‌ 28(నమస్తే తెలంగాణ) :భూ వివాదాలకు చెక్‌పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ సత్ఫలితాలిస్తున్నది. రెవెన్యూ చట్టం సంస్కరణలో భాగంగా సర్కారు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టగా, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడింది. మీ సేవకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకున్న మరుసటి రోజే.. భూ రిజిస్ట్రేషన్‌తో పాటు డిజిటల్‌ పట్టా పాసు పుస్తకం చేతికందుతున్నది. గంటల వ్యవధిలోనే ఏండ్లనాటి సమస్యకు పరిష్కారం లభిస్తుండగా, అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది. నాడు చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పుణ్యమాని ఆ బాధ తప్పిందని వారంతా మురిసిపోతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,756 దరఖాస్తులు రాగా, యంత్రాంగం 29,746 పరిష్కరించింది. మిగతావి పరిశీలనలో ఉండగా, త్వరలోనే క్లియర్‌ చేసేందుకు చర్యలు చేపడుతున్నది. కాగా, గతేడాది అక్టోబర్‌ 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా, సరిగా నేటికి ఏడాది అవుతున్నది.

- Advertisement -

గతంలో భూ సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకున్న నాథుడే లేకుండే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూలో పారదర్శకమైన సేవలను అందించేందుకు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో భూ సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 29న ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో రైతులకు సంబంధించిన భూ సమస్యలన్నీ కూడా ఈ పోర్టల్‌ ద్వారా పరిష్కరించుకునే వీలు కలిగింది. ఏడాది కాలంలో ధరణి ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 30 వేలకు పైగా రైతులకు ప్రయోజనం కలిగినట్లు అంచనా.. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 11,350 దరఖాస్తులు రాగా, 11,253 పరిష్కరించారు. మంచిర్యాల జిల్లాలో 9,892 దరఖాస్తులు రాగా, 9,471 దరఖాస్తులను పరిష్కరించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 5,591 దరఖాస్తులు రాగా, 5,135 పరిష్కరించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 3,923 దరఖాస్తులు రాగా, 3,887 పరిష్కరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.

రైతులకు పారదర్శక సేవలు..
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలందుతున్నాయి. ధరణి పోర్టల్‌తో డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతున్నది. ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్‌లోనే స్టాంప్‌ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో డాక్యుమెంట్‌ రైటర్స్‌గాని, మీ సేవ నిర్వాహకులుగాని అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలులేదు. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, సక్సేషన్‌, పార్టిషన్‌ సేవలకు పట్టణాలకు రావాల్సిన అవసరం లేదు. మండల కేంద్రాల్లోనే అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా రోజుల తరబడి తిరగాల్సిన పనిలేకుండా త్వరగా పూర్తవుతున్నది. అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. గతంలో డబుల్‌ రిజిస్ట్రేషన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఈ విధానంతో విముక్తి కలిగింది. వారసత్వంగా వచ్చే భూములను వారసులు పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. గతంలో 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్‌.. ఏండ్లు గడిచినా పూర్తయ్యేది కాదు. ప్రస్తుతం రైతులకు ఈ బాధలన్నీ తప్పాయి. వారసత్వ రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్‌ కార్డులతో మీ సేవలో స్లాట్‌ బుకింగ్‌ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది. కుటుంబ సభ్యుల పేరిట కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ కావడంతో పాటు ఒరిజినల్‌ పట్టాదారు పాసు పుస్తకం నేరుగా రైతుల ఇంటికే అందిస్తున్నారు. స్లాట్‌ బుకింగ్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వరకు ధరణి పోర్టల్‌ ద్వారానే ప్రక్రియ జరుగుతుండడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.

భూ సమస్యలకు పరిష్కారం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు భూ సమస్యపై ధరణి పోర్టల్‌ ద్వారా పరిష్కారం చూపేలా సర్కారు చర్యలు తీసుకున్నది. రైతులు మీ సేవ కేంద్రంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని తహసీల్‌ కార్యాలయానికి వెళ్తే, ధరణి పోర్టల్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి భూ సమస్యకు పరిష్కారం చూపుతారు. కొత్త డిజిటల్‌ పాసుపుస్తకాలను అందిస్తారు. ఇందులో ప్రధానంగా సేల్‌డీడ్‌, గిప్టు డీడ్‌, సక్సెషన్‌, విరాసత్‌, మార్టిగేజ్‌, గ్రీవెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్‌, పెండింగ్‌ మ్యుటేషన్స్‌, పేరు, ఊరు తప్పు, సర్వే నంబరు తప్పు, మిస్సింగ్‌ సర్వే నంబరు, వయసు, ఆధార్‌కార్డు లింకింగ్‌, సబ్‌ రిజిస్టర్‌లో డ్యాక్యుమెంటేషన్‌ పెండింగ్‌ మ్యుటేషన్‌వంటి సమస్యలను పరిష్కరించి కొత్త పాసుపుస్తకాలను అందిస్తారు.

వేలిముద్రలు రాకున్నా ఐరిష్‌తో ప్రక్రియ
ఎదులాపురం, అక్టోబర్‌ 28 : భీంపూర్‌ మండలం కరంజి(టి)కి చెందిన షేక్‌ బాషుకు గ్రామ శివారులో సర్వే నంబరు 40/ఏ/1లో 4 ఎకరాల భూమి ఉంది. తన వ్యక్తిగత అవసరాల కోసం దానిని కావటి నవీన్‌ అమ్మాలనుకున్నాడు. బుధవారం (27.10.2021) స్లాట్‌ బుక్‌ చేశారు. ఈ మేరకు గురువారం భీంపూర్‌ తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. ధరణి ప్రత్యేక గదిలో ఉద్యోగి సుదర్శన్‌ ఎంతగా ప్రయత్నించినా షేక్‌ బాషు (వృద్దాప్యంతో) వేలి ముద్రలు రాలేదు. దీంతో వెంటనే ఐరిష్‌ విధానంలో వివరాలు సరిచూసుకుని ధ్రువీకరించారు. నిమిషాలలో పట్టామార్పిడి ప్రక్రియ పూర్తయింది. ధరణి పోర్టల్‌లో గంటల వ్యవధిలోనే పని పూర్తికావడంతో భూమి అమ్మిన, కొన్న వ్యక్తులు ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్లారు.

ధరణితో అక్రమాలకు చెక్‌..
నిర్మల్‌ టౌన్‌, అక్టోబర్‌ 28 : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ పేద రైతులకు ఉపయోగపడింది. గతంలో సబ్‌ రిజిస్టర్‌, రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు వచ్చినా సిబ్బంది చేతివాటం ప్రదర్శించేవారు. రెవెన్యూశాఖ మీద ఉన్న అపోహను తొలగించేందుకు సీఎం కేసీఆర్‌ ధరణి ద్వారా పారదర్శకమైన సేవలను ప్రారంభించారు. దీంతో రైతులకు సమయం, ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోయాయి. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 11,350 ధరణి దరఖాస్తులు రాగా, 97 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.

  • రాంబాబు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement