Bribe | ముదిగొండ, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అంటూ ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదు. ఏదైనా పనిచేయాలంటే టేబుల్ కింద చేయి పట్టనిదే చేయమంటున్నారు. ప్రజల నిత్యం ఎవరో ఒక అధికారి అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నాడు.
తాజాగా ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన మండలాల్లో శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా తమ్మిశెట్టి సురేష్ విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వలేనని కొంతవరకు ఇస్తానని వేడుకున్నాడు. అడిగినంత ఇస్తే తప్ప పని కాదని రెండు మూడు నెలల నుంచి తిప్పుతున్నాడు.
విసిగి వేసారిన బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. వారు పక్కా ప్రణాళికతో శనివారం బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా సురేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారి కోరారు.