టెక్స్టైల్స్ రంగానికి సాంకేతిక సొబగులు అద్దడంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి కేటీఆర్ చొరవతో విపణిలో సిరిసిల్ల బ్రాండ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. నయా టెక్నాలజీతో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారీగా నజరానాలు ప్రకటించింది. వేగంగా రుణ సౌకర్యం, టెక్స్టైల్స్ పార్కులో స్థలాల కేటాయింపు చేపడుతున్నది. పవర్‌లూంల స్థానంలో ఎయిర్, వాటర్‌జెట్, ప్రాసెసింగ్, డయ్యింగ్, సైజింగ్ యూనిట్లు పెట్టుకునే వారికి చేయూతనిస్తున్నది. దీంతో నేతన్నలకు చేతినిండా పనిదొరకనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– రాజన్నసిరిసిల్ల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
రాజన్నసిరిసిల్ల, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న చేనేత రంగానికి తెలంగాణ సర్కారు పూర్వ వైభవం తెచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించింది. మూడంచెల వస్త్ర పరిశ్రమ అభ్యున్నతికి విరివిగా నిధులు కేటాయించింది. రూ.3 వేల కోట్లతో వివిధ వస్త్ర ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు, ఆసాములు, యజమానులకు చేతినిండా పనికల్పించింది. బతుకమ్మ చీరల తయారీలో సూరత్, ఇచ్చల్ కరంజీ, భీవండీలకు దీటుగా డిజైన్ల రూపకల్పనలో పోటీ పడుతున్నది. సాధారణ మరమగ్గాలకు సర్కారు చేయూతనిచ్చి సబ్సిడీ నిధులు అందించి వాటిని ఆధునీకరించునేలా ఆసాములను ప్రోత్సహించింది. నాడు దిన్పైలీ, రాత్‌పైలీ పన్నెండు గంటలు నిల్చుండి పనిచేసిన కార్మికులు నెలకు రూ.10 వేలు సంపాదించేవారు. నేడు సర్కారు సహకారంతో నెలకు రూ.20 వేల వరకు కూలీ ఆర్జిస్తున్నారు. బతుకమ్మ చీరలే కాదు.. చీరలకు వినియోగించే దారం, సాంచాలకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి పరిశ్రమను ఆదుకుని, నేతన్నల బతుకులకు భరోసా ఇచ్చింది. రైతు మాదిరి నేతన్నకు బీమా పథకం, ఆసరా పింఛన్లు, పొదుపు పథకాలతో ఇతర రాష్ర్టాల నుంచి కార్మికులు బతుకు దెరువు కోసం సిరిసిల్లకు వలసబాట పడుతున్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున సిరిసిల్లకు వందలాది మంది వచ్చి ఉపాధి పొందుతున్నారు.
సాంకేతిక విప్లవం
టెక్స్టైల్స్ రంగానికి సాంకేతిక దన్ను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే తొలి టెక్స్టైల్స్ పార్కు, అత్యధిక శాతం మరమగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు, నగరి, మంగళగిరి, ధర్మవరంలో 25వేల పవర్‌లూమ్స్ మాత్రమే ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 35 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇరవై వేలమందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈపరిశ్రమలో కేవలం ముతక రకం వస్ర్తాలు మాత్రమే తయారవుతున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని పరిశ్రమలు రకరకాల వస్ర్తాల తయారీతో ముందుకెళ్తున్నాయి. ఈనేపథ్యంలో తమిళనాడులోని తిరుపూరు, ఈరోడ్, సేలం లాంటి ప్రాంతాల్లో విభిన్నమైన వస్ర్తాలు తయారీచేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎగుమతులు చేస్తున్నాయి. ఆ తరహాలో సిరిసిల్లను తీర్చి దిద్దాలన్న సంకల్పంతో మంత్రి కేటీఆర్ ఇక్కడి వ్యాపారులను తమిళనాడుకు స్టడీ టూర్‌కు స్వయంగా ప్రభుత్వం ఖర్చులతో పంపించారు. రెండు దఫాలుగా మరమగ్గాల యజమానులు, వస్త్ర వ్యాపారులు వెళ్లి అక్కడి మరమగ్గాలపై అధ్యయనం చేశారు. ఇదే తరహాలో ఇక్కడి నేత కార్మికులకు టెక్స్టైల్స్ రంగంలోని నిష్ణాతులతో నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నది.
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో సిరిసిల్లను బ్రాండ్ ఇమేజ్‌గా నిలుపాలన్నది కేటీఆర్ ఆశయం. అందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మరమగ్గాలు, వాటి అనుబంధ రంగాల యంత్రాల తయారి సంస్థలను సిరిసిల్లకు రప్పించి మరమగ్గాల మేళా (ప్రాపర్టి)షో 2017 నవంబర్‌లో ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వస్ర్తోత్పత్తి దారులు, మరమగ్గాల యజమానులు, ఆసాములు తరలివచ్చారు. వీరికి కంపెనీల యాజమానులు అవగాహన కల్పించారు. నాటి నుంచి వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిన కేటీఆర్ చిన్న పిల్లల నుంచి మొదలు వధూవరులు ధరించే వస్ర్తాలన్ని ఇక్కడే తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో డైయింగ్, ప్రాసెసింగ్, సైజింగ్, ప్రిటింగ్ లాంటి యూనిట్ల ఏర్పాటు చేసుకోవాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు కోరింది.
నగదు ఉండి స్థలం లేక, స్థలం ఉండి డబ్బులు లేని పారిశ్రామిక వేత్తలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నది. టెక్స్టైల్స్ పార్కులో స్థలం కూడా ఉంది. అక్కడ కాకుండా అప్పారెల్ పార్కులోనూ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు ఇచ్చే డీపీఆర్‌ను జౌళీశాఖ ప్రభుత్వానికి నివేదించనున్నది. ఇటీవల సిరిసిల్లను సందర్శించిన టెక్స్టైల్స్ శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి ఇక్కడి జౌళీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నిరకాల వస్ర్తాలు తయారు చేసే విధంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు నందిస్తుందని చెప్పారు. ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు బ్యాంకు రుణాలు, స్థలాల కేటాయింపు, సబ్సిడీలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.